జీబా వ్యవసాయానికి 5.5 కోట్లు

0 23

ఏలూరు ముచ్చట్లు:

వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ‘జీబా’ వ్యవసాయ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీరు, ఎరువులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరిగే ఈ విధానాన్ని రాష్ట్రంలో 50వేల ఎకరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈమేరకు 5.5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. జీబా అంటే మొక్కజొన్న గంజి నుంచి తయారుచేసిన ప్రత్యేక సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డైపర్ తరహాలో నీటిని పీల్చుకునే గుణాన్ని ఇది కలిగి ఉంటుంది. గుళిక మాదిరిగా ఉండే ఈ పాలిమర్ తన బరువుకన్నా దాదాపు 400 రెట్ల నీటిని పీల్చుకుని నిల్వ ఉంచుకోగలదు. ఆ నీటిని నెమ్మదిగా విడుదల చేస్తూ ఒక దశలో భూమిలో కలిసిపోతుంది. జీబా గుళికలను ఎరువులతో కలిపి విత్తనాలు జల్లే సమయంలో విత్తనం కింద 100 మిల్లీమీటర్ల చిన్న గోయి తీసి పెడతారు.

- Advertisement -

హెక్టారుకు 4 నుంచి 8 కేజీల వరకూ ఇది అవసరం అవుతుంది. మొక్క కింద వేర్ల వద్ద ఈ గుళికలు ఉండటం వల్ల మొక్కకు అవసరమైన నీటిని, పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల నీరు, పోషకాలు నేరుగా మొక్కకు అంది ఎదుగుదల బాగుంటుంది. ఐదు నెలల వరకూ ఈ గుళికలు తమ పని చేస్తాయి. తరువాత ఇవి మట్టిలో కలిసిపోతాయి. నీరు, ఎరువులను తగు మాత్రంగా ఉపయోగించడం వల్ల ఆమేరకు రైతుకు పెట్టుబడుల నుంచి వెసులుబాటు లభిస్తుంది. ఈ విధానాన్ని వివిధ దేశాలు సహా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగు సాధ్యమవుతుంది. తొలి దశలో 50వేల ఎకరాల ఉద్యాన పంటల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ముందుగా రైతులకు ఈ విధానంపై అవగాహన కల్పించనున్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఈ విధానం గురించి వివరిస్తారు. 15.25 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టులో 5.55 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం, యుపీఎల్ కంపెనీ 8.33 కోట్లు, రైతులు 1.37 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. ఈ విధానం వల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గి, మేలైన దిగుబడులు వస్తాయి. ఇప్పటికే ఈ విధానం వల్ల రైతులు లబ్ధి పొందడం చాలాచోట్ల నిరూపితమైన నేపథ్యంలో రాష్ట్ర రైతులకు వరంగా మారుతుందని ఆశిస్తున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:5.5 crore for Zeba agriculture

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page