పల్లీలు…కేరాఫ్ దేవరకద్ర..

0 21

మహబూబ్ నగర్  ముచ్చట్లు:

బావులు, బోర్లు.. ఏ మాత్రం నీటి ఆనవాళ్లున్నా రైతులు వరిసాగుకే మొగ్గుచూపుతున్న పరిస్థితులివి. కానీ ఇతర పంటలతో పోలిస్తే వరిపైరుపై వస్తున్న ఆదాయం తక్కువే. దీంతో ఆ ప్రాంత రైతాంగం ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించింది. వరికి బదులుగా వేరుశనగ సాగు చేశారు. మంచి దిగుబడి సాధించారు.. ధర కూడా కలిసొచ్చింది. అమ్ముకోవడానికి ఇక్కట్లు లేకుండా రైతుల వద్దకే వ్యాపారులు క్యూకట్టి మరీ కొనుగోలు చేశారు. దీంతో రైతులు మంచి లాభాలు గడించారు. సుమారు రూ.500కోట్ల విలువైన వేరుశనగ పంట పండినట్లుగా అంచనా. ఇదంతా కరువు ప్రాంతంగా పేరొందిన దేవరకొండ రైతాంగం సాధించిన విజయం. కృష్ణానదికి అనుకొని ఉన్న చందంపేట, నేరేడుగొమ్మ, పీ.ఏ.పల్లి, డిండి మండలాల రైతులే విజేతలు.దేవరకొండ.. ఒకప్పుడు పూర్తి కరువుకాటకాలకు నెలవుగా ఉండేది. కానీ నేడు నీటివనరులు అందుబాటులోకి వచ్చాయి. మిషన్‌ కాకతీయలో పటిష్టపరిచిన చెరువులు, కుంటలు అలుగుపోశాయి. డిండి ప్రాజెక్టు కూడా పొంగిపొర్లడంతో భూగర్భజలాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ యాసంగిలో రైతులు ప్రయోగాత్మకంగా వరికి బదులు వేరుశనగ సాగుకు మొగ్గు చూపారు. కొందరు రైతులైతే వానకాలంలో పత్తి పంటను సాగు చేసి, యాసంగిలో చేనును చదును చేసి వేరుశనగ వేశారు.

- Advertisement -

ఇలా దేవరకొండ డివిజన్‌లోని చందంపేట, నేరడుగొమ్మ మండలాల్లో ఎక్కువ భాగం పీ.ఏ.పల్లి, డిండి మండలాల్లోని కొన్ని గ్రామాల రైతులు ప్రయోగాత్మకంగా వేరుశనగను సాగు చేశారు. మొత్తం 35వేల నుంచి 40వేల ఎకరాల్లో ఈ యాసంగిలో వేరుశనగ సాగుచేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దీన్ని సాగు చేసే క్రమంలో ఎక్కువ మంది రైతులు తుంపర సేద్యంపై దృష్టి పెట్టారు. బోర్లు, బావుల నుంచి పొలంలోకి పైప్‌లైన్లు వేసి ప్రత్యేకంగా స్ప్రింక్లర్లను బిగించారు.ఎకరంలో వేరుశనగ సాగు చేస్తే అన్ని రకాల ఖర్చుల కలిపి రూ.18వేల నుంచి 22వేల వరకు ఖర్చు వచ్చినట్లు రైతులు తెలిపారు. ఎకరానికి 15నుంచి గరిష్టంగా 18క్వింటాళ్ల వరకు పంట చేతికి వచ్చింది. ఈ సారి లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఊర్లకు చేరడంతో కూలీల సమస్య కూడా పెద్దగా తలెత్తలేదు. ఆరు లక్షల క్వింటాళ్ల వరకు వేరుశనగ దిగుబడి వచ్చినట్లు అంచనా. అంటే సుమారు రూ.500కోట్ల విలువైన పంట పండినట్లుగా భావిస్తున్నారు.పల్లీ నూనెల ధరలు మార్కెట్‌లో భగ్గుమంటున్న నేపథ్యంలో ఈ సీజన్‌లో వేరుశనగ పంటకు కూడా మంచి ధర లభించింది. వ్యాపారులే పోటీ పడి అడ్వాన్స్‌లు ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. క్వింటాల్‌ రూ.7వేల నుంచి 8వేల వరకు ధర పలికింది. దీంతో ఒక్కో ఎకరం పంటకు గానూ కనీసం లక్ష రూపాయల వరకు రైతులకు గిట్టుబాటైంది. గతంలో ఇదే రైతులు దగ్గరలోని వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌ లాంటి పట్టణాలకు వెళ్లి వ్యాపారులకు విక్రయించే వారు. కానీ, ఈ సారి వ్యాపారులే రైతుల వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేయడం విశేషం. దీంతో రైతులు డిమాండ్‌గా తమ పంటను అమ్ముకోగలిగారు. ఒక్కో ఎకరాకు అన్ని ఖర్చులు పోను కనీసం రూ.50వేలకు పైగానే లాభాలు గడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని రైతులకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్ననేపథ్యంలో దేవరకొండ ప్రాంత రైతులు వేరుశనగ సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Villages … Carafe Devarakadra ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page