పెన్నమ్మ నదిలో శివాలయం

0 14

నెల్లూరుముచ్చట్లు:
పెన్నానది తీరాన ఇసుక మేటలో పూడిపోయిన శివాలయం తవ్వకాల్లో బయటపడింది. ఈ సంఘటన చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని పెన్నా తీరాన నాగేశ్వరాలయం ఉండేది. ఇక్కడ విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించారని చెబుతుంటారు. 200 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. నిత్యం పూజలు జరుగుతుండేవి. మహా శివరాత్రి, నాగుల పంచమి పర్వదినాల్లో ఉత్సవాలు, విశేష పూజలు నిర్వహించేవారని తమ పూర్వీకులు తెలిపినట్లు వృద్ధులు వెల్లడించారు. 70 ఏళ్ల క్రితం పెన్నానదికి వరదలు ఉధృతంగా రాగా ఇసుకమేటల కారణంగా క్రమేపీ ఆలయం భూమిలో పూడిపోయింది. ఇసుక కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామాన్ని నదికి రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించుకున్నారు. కాలక్రమేణా ఆలయం పూర్తిగా పూడుకుపోయి ఆనవాళ్లే కనిపించలేదు.ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్థానిక యువకులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చారు. ఇటీవల ఓ రోజు రచ్చబండపై కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా వృద్ధులు ఆలయం గురించి చెప్పారు. నూతనంగా అనుమతులు లభించిన ఇసుక రీచ్‌కు సమీపంలో ఆలయం ఉండొచ్చని చెప్పగా యువకులు రీచ్‌ కాంట్రాక్టర్‌ శ్రీనివాసచౌదరి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జేసీబీ, హిటాచీ యంత్రాలను ఇచ్చి సహకరించారు. దీంతో మంగళవారం ఉదయం యువకుల నేతృత్వంలో తవ్వకాలు మొదలుపెట్టారు. ఆలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. శిఖరం, గర్భగుడి, ముఖ మండపాలు వెలుగులోకి వచ్చాయి. శిఖరంపై చెక్కిన అందమైన దేవతామూర్తుల ప్రతిమలు కొంతమేర దెబ్బతిన్నాయి. శివాలయం బయట పడడంతో గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని కొబ్బరికాయలు కొట్టారు.పురావస్తు శాఖ అనుమతులు తీసుకుని దాతల సహకారంతో ఆలయాన్ని పునః నిర్మించేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలిపారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

- Advertisement -

Tags:Shiva temple on the river Pennamma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page