కృష్ణా ప్రాజెక్టులపై అడగడుగునా నిర్లక్ష్యం

0 25

హైదరాబాద్  ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లయితున్నా కృష్ణా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. అసలు కృష్ణా నీళ్లను మన రాష్ట్రం సమర్థవంతంగా వినియోగించుకునే ప్రయత్నమే జరగలేదు. దీంతో కృష్ణాలో మనకు ఉన్న నీటి వాటాను కూడా వాడుకోలేని దుస్థితి వెంటాడుతోంది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు తాత్కాలికంగా 299 టీఎంసీల కోటా ఉంది.  హక్కుగా ఉన్న వాటాలో ఏటా దాదాపు 50 టీఎంసీలు  వదులుకోవాల్సి వస్తోంది. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీ లిఫ్ట్‌‌, కల్వకుర్తి ఎత్తిపోతలు, జూరాల ప్రాజెక్టుతో పాటు దానిపై ఏర్పాటు చేసిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌ సాగర్‌‌ లిఫ్టుల ద్వారా ఈ నీటిని వాడుకోవాలి. కానీ ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణ– విస్తరణ పనులు చేయకపోవడం, కెపాసిటీలను తగ్గించటంతో ఇవన్నీ సగం నీటిని మాత్రమే అందిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా కేటాయింపులకు మించి నీటిని తరలించుకుపోతోంది.

 

- Advertisement -

మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏటా ఒక వాటర్‌‌ ఇయర్‌‌లో ఉపయోగించుకోని నీటిని మరుసటి ఏడాదికి క్యారీ ఓవర్‌‌ చేయాలని లెటర్లు రాయడం మినహా నీళ్లు వినియోగించుకునే ప్రయత్నం చేయడం లేదు.శ్రీశైలానికి వచ్చే వరదను వీలైనన్ని ఎక్కువ సోర్స్‌‌ల ద్వారా మళ్లించుకోవాలని ఏపీ కుట్రలు చేస్తోంది. ఇప్పటికే  పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌, ఎస్కేప్‌‌ గేట్లు, హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌, ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా నీటిని తరలిస్తోంది. సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీంను డిసెంబర్‌‌ నాటికి సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా వెలిగొండ ట్విన్‌‌ టన్నెల్స్‌‌ అందుబాటులోకి తెస్తోంది.  హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వల విస్తరణకు పూనుకుంది. కాల్వలతో పాటు  టన్నెల్‌‌ కెపాసిటీని డబుల్ చేస్తోంది. మొత్తం 221 కి.మీ.ల కాల్వ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టింది. మొత్తంగా శ్రీశైలం రిజర్వాయర్ను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పరిమితం చేసే ప్రయత్నాల్లో ఏపీ సర్కారు ఉందిపోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌పై కేంద్ర ప్రభుత్వం 2020 ఆగస్టు 5న అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సమావేశం ఏర్పాటు చేయగా.. అదే రోజు కేబినెట్‌‌ సమావేశం ఉందని సీఎం కేసీఆర్‌‌  డుమ్మా కొట్టారు. అదే నెలలో సంగమేశ్వరం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అక్టోబర్‌‌ 6న జరిగిన అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సమావేశానికి సీఎం హాజరయ్యారు. అప్పటికే ఏపీ పనులు మొదలు పెట్టడంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు వేశామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా అది ఇంతవరకూ విచారణకు రాలేదు.

 

ఎన్జీటీలో రైతు న్యాయపోరాటం చేసినా మన సర్కారు సహకరించలేదు. ఎన్జీటీ విచారణ క్లోజ్‌‌  చేసే  టైంలో మెమో దాఖలు చేసి ఏదో  చేశామని చెప్పుకునే ప్రయత్నం చేసింది. సంగమేశ్వరం పనులు వేగంగా సాగుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆర్డీఎస్‌‌ కుడి కాల్వ పనులను కొన్ని నెలల కిందే ఏపీ మొదలు పెట్టినా, రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే వరకూ రాష్ట్ర సర్కారు చప్పుడు చేయలేదు. కృష్ణాలో న్యాయమైన హక్కుగా వచ్చే చుక్క నీటి వాటాను కోల్పోబోమని చెప్పడం మినహా ఏం చేయలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట కొబ్బరికాయ కొట్టిన ప్రాజెక్టు పాలమూరు –  రంగారెడ్డి. ఎల్లూరు పంపుహౌస్‌‌ను అండర్‌‌గ్రౌండ్‌‌కు మార్చి తవ్వకాలు చేపట్టి కల్వకుర్తి లిఫ్ట్‌‌ పంపుహౌస్‌‌ను ముంచేశారు. ఇంతవరకు కల్వకుర్తి పంపుహౌస్‌‌ పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆయకట్టు ప్రమాదంలో పడింది. ఏడేండ్లలో పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.11 వేల కోట్లే ఖర్చు చేశారు. దీని నిర్మాణ వ్యయం రూ. 35,200 కోట్ల నుంచి రూ. 52 వేల కోట్లకుపైగా పెరిగింది. ఈ ఏడాది జూన్‌‌లోనే నీళ్లు ఎత్తిపోస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పారు. పాలమూరుపై ఇలా డెడ్‌‌లైన్‌‌లు పెట్టడం ఇది రెండోసారి. రెండు టీఎంసీలు ఎత్తిపోయాల్సిన ఈ ప్రాజెక్టును ఒక టీఎంసీకి కుదించారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోశామని చూపించే ప్రయత్నంలో మొదట అర టీఎంసీకే పనులు చేస్తున్నారు.

 

కాళేశ్వరం కంప్లీట్‌‌ అయిందని, ఇక తన దృష్టంతా పాలమూరు మీదనే ఉంటుందని 2019 ఆగస్టులో ప్రాజెక్టును సందర్శించినప్పుడు కేసీఆర్ చెప్పారు. తర్వాత కొన్ని నెలలు ప్రాజెక్టు పనులపై కనీసం రివ్యూ కూడా చేయలేదు. ఈ ప్రాజెక్టు ఎప్పటికి కంప్లీట్‌‌ అవుతుందో ఇంజనీర్లకే  క్లారిటీ లేదు. డిండి ఎత్తిపోతల పథకాన్ని ఏడేండ్లుగా సర్వేల పేరుతోనే సాగదీస్తున్నారు. ఇప్పటి వరకు 20 శాతం పనులు కూడా చేయలేదు. రూ. 6 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో ప్రాజెక్టు మొదలుపెట్టగా ఇప్పటికి రూ. 1,825 కోట్లు ఖర్చు చేశారు.కల్వకుర్తి లిఫ్ట్‌‌  స్కీం ఆయకట్టు 4.24 లక్షల ఎకరాలు కాగా ఏటా వానాకాలంలో 3 లక్షల ఎకరాల వరకు నీళ్లిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద 20 టీఎంసీల నీళ్లు నిల్వ చేయడానికి రిజర్వాయర్లు నిర్మించాలని 2016లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే వాటిని పక్కన పెట్టారు. ఐదేండ్ల తర్వాత అవే రిజర్వాయర్ల నిర్మాణం కొత్తగా చేపట్టనున్నట్టు కేబినెట్‌‌ సమావేశంలో పేర్కొన్నారు. జూరాల రిజర్వాయర్‌‌ ఆధారంగా నిర్మించిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్‌‌  లిఫ్టుల కాల్వలు సరిగా లేక పూర్తిగా నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నారు. మూడు లిఫ్టులు కలిపి 4.60 లక్షల ఎకరాలకు పైగా నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా, ఏటా 3 లక్షల ఎకరాలకే నీళ్లు ఇవ్వగలుగుతున్నారు. వీటి కింద ఆరుతడి పంటలే ఎక్కువగా సాగవుతున్నాయి. ఆర్డీఎస్‌‌  ఆధునీకరణ, తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ల పనులు నిదానంగా సాగుతున్నాయి. 16 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నా, పది టీఎంసీలు కూడా ఉపయోగించుకోవడం లేదు. ఆర్డీఎస్‌‌ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేయిస్తానని చెప్పిన కేసీఆర్‌‌ ఆ మాట నిలబెట్టుకోలేదు. గట్టు ఎత్తిపోతల పథకం, జూరాల పక్కనే 20 టీఎంసీల కెపాసిటీతో మరో రిజర్వాయర్‌‌ నిర్మాణం, ఆమ్రాబాద్‌‌ ఎత్తిపోతలు, రాచకొండ లిఫ్ట్‌‌ సహా ఇలా అనేక ప్రాజెక్టులను ప్రకటించడమే తప్ప ఒక్కటీ ఆచరణలోకి రాలేదు.రాష్ట్ర సర్కారు కాళేశ్వరంపై శ్రద్ధ పెట్టి కృష్ణా బేసిన్‌‌ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోంది. పాలమూరు, డిండి కన్నా ఆలస్యంగా ప్రారంభించిన కాళేశ్వరం   పనులు 65 శాతం పూర్తయ్యాయి. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా బడ్జెట్‌‌ కేటాయింపుల్లో వివక్ష  మానలేదు.

 

పాలమూరు ప్రాజెక్టు పెండింగ్‌‌ బిల్లులే రూ. 2 వేల కోట్ల వరకు ఉన్నాయి. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌‌సాగర్‌‌ లిఫ్టులు, వాటి కింద సేకరించిన భూములకు బిల్లులు ఇంకో రూ. 5 వేల కోట్ల వరకు ఉంటాయి. ఇతర ప్రాజెక్టులకు కలుపుకొంటే కృష్ణా ప్రాజెక్టుల పెండింగ్‌‌ బిల్లులే రూ. 10 వేల కోట్ల వరకు ఉన్నాయి.పాత ప్రాజెక్టులపై  నిర్లక్ష్యం ప్రదర్శించిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సడెన్‌‌గా కొత్త ప్రాజెక్టులను మోసుకు వచ్చింది. వెంటనే  వీటి సర్వే పనులు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. శ్రీశైలం బ్యాక్‌‌ వాటర్‌‌లో పెద్దమరూర్‌‌ వద్ద బ్యారేజీని నిర్మించి పైపులైన్‌‌ల ద్వారా పాలమూరు లిఫ్ట్‌‌ స్కీంలోని ఏదులకు నీటిని ఎత్తిపోస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదే విషయం ఏడాది కిందట్నే చెప్పినా అప్పుడు కనీసం సర్వే కూడా చేయలేదు. భీమా వరద కాల్వ, సాగర్‌‌ టెయిల్‌‌పాండ్‌‌, పులిచింతల ఎడమ కాల్వ, కల్వకుర్తి రిజర్వాయర్ల పేరుతో కొత్తగా రూ. 20 వేల కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలువనుంది.  ఉట్టికెక్కనమ్మ స్వర్గానికి ఎగబాకింది అన్నట్లుగా  పాతవి పక్కన పడేసి కొత్త ప్రాజెక్టుల పాట ఎత్తుకోవటం వెనుక వేల కోట్ల టెండర్ల దందా మొదలైందన్న ఆరోపణలు వస్తున్నాయి.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Ignorance at every turn on Krishna projects

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page