టీఆర్ఎస్ వర్సెస్ ఈటల

0 0

కరీంనగర్ ముచ్చట్లు:

 

ఇప్పటివరకు ద్విముఖ పోటీ మాత్రమే అనుకుంటున్న ఆ నియోజకవర్గంలో ట్రయాంగిల్ పోరు తప్పేలా లేదు. పీసీసీ చీఫ్ మార్పుకు ఇక్కడి ఉపఎన్నికలకు లింక్ ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన హుజురాబాద్ బై పోల్‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నియామకంతో సీన్ మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు హుజురాబాద్‌లో ‘టీఆర్ఎస్ VS ఈటల’ అన్నట్లుగా సాగుతోంది.తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరగనున్న మార్పులు చేర్పులతో ఇక్కడి ఉప ఎన్నికలు రసకందాయకంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌గా కొత్త వ్యక్తి నియామకమైన తరువాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కూడా హుజురాబాద్ వే కావడంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. కొత్త అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకునే నాయకుడు తన సత్తాను చాటుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదు.

 

 

 

 

- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా జరిగిన దుబ్బాక ఎన్నికలను ఆ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. రఘునందన్ రావు గెలుపుకోసం పార్టీ కేడర్ తీవ్రంగా శ్రమించి సక్సెస్ అయింది. త్వరలో జరగనున్న హుజురాబాద్‌లోనూ ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.పీసీసీ చీఫ్ మార్చు జరిగితే మాత్రం దుబ్బాక బై పోల్స్‌ను తలదన్నేలా హుజురాబాద్ ఎన్నికలు జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సారి బీజేపీ నుండి పోటీ చేసే అవకాశం ఉన్న ఈటల రాజేందర్‌కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఈటల బయటకు వచ్చి తొలిసారిగా బీజేపీ నుంచి బరిలో నిలవబోతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదురించి తన సత్తా చాటుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న రీతిలో రాజేందర్ వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనన్న లక్ష్యంతో ఈటల ఇప్పటికే నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరుగుతూ తన పట్టు సడలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.

 

 

 

 

ఇదే క్రమంలో గులాబీ నేతలు కూడా ఈటలను ఓడించాలన్న సంకల్పంతో కదన రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర నాయకత్వం అంతా హుజురాబాద్ పైనే ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి తప్ప ఈటలకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఇక్కడి పార్టీ కేడర్ ఈటల వైపు వెల్లకుండా నిలువరించడంలో సక్సెస్ అయిన టీఆర్ఎస్ నాయకత్వం ఓటర్లలో సానుకూలత పెంచుకునే దిశగా ముందుకు సాగుతోంది.పీసీసీ చీఫ్ మారినట్టయితే ఆ బాధ్యతలు తీసుకున్న వారు ఖచ్చితంగా తన ప్రభావాన్ని చాటుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం స్తబ్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం నింపాలంటే హుజురాబాద్ బై పోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం అత్యంత కీలకం. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అన్ని విధాల కృషి చేయాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షునిపై ఉంటుంది. అటు అధికార టీఆర్ఎస్ పార్టీని, ఇటు ఈటలను ఢీ కొట్టి మరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం శ్రమించాల్సిన ఆవశ్యకత కొత్త పీసీసీ చీఫ్ పై ఉంటుందన్నది వాస్తవం. దీంతో ఈటల, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ అత్యంత ఉత్కంఠతను రేకెత్తించనుంది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: TRS vs. Itala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page