గ్రేటర్ లో ఏళ్లతరబడి తిష్ట

0 17

హైదరాబాద్  ముచ్చట్లు :

నగరవాసుల జీవనాన్ని ప్రభావితం చేసే జీహెచ్ఎంసీలో అసలేం జరుగుతుందో ఎవరికి అంతుచిక్కటం లేదు. ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ను నిర్ణయించే కొందరు ఉన్నతాధికారులే వాటిని ఉల్లంఘిస్తున్నందున పదవీ విరమణ పొందిన తర్వాత కూడా కొందరు అధికారులు తాము బతికినంత కాలం బల్దియానే దిక్కు అన్నట్టు తయారయ్యారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న డీసీలు, మెడికల్ ఆఫీసర్లు, జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లలో ఎక్కువ శాతం మంది ఏళ్ల నుంచి తిష్ట వేసిన వారే ఉన్నారు. వీరిలోనూ ఉన్నతాధికారిగా పదవీ విరమణ పొంది, మళ్లీ బల్దియాకొచ్చిన వారూ ఉన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా రొటీన్ మెయింటనెన్స్, ఇప్పటికే నిధులు సమకూర్చిన ఎస్ఆర్ డీపీ పనులు అడపాదడపాగా కొనసాగుతున్నా, అన్ని విభాగాల అధికారుల హడావుడి ఏ మాత్రం తగ్గలేదు.రిటైర్డు అధికారులను అదే హోదాలో నియమించి వారికి సకల సౌకర్యాలను కల్పిస్తూ బల్దియా ఖజానాపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్ పై వచ్చి డిప్యూటేషన్ పూర్తయినా, సీటును వదిలి వేళ్లేందుకు ఇష్టపడని అధికారులు కొందరైతే.. మరి కొందరు డిప్యూటేషన్ మాట అలా ఉంచితే, ఏకంగా పదవీ విరమణలు పొందిన మళ్లీ పైరవీలు చేసుకుని ఇక్కడే వాలుతున్నారు. రిటైర్డు అయిన ఉద్యోగులు ఇంకా అవసరమని ఉన్నతాధికారులు భావిస్తే వారిని తిరిగి ఔట్ సోర్సుగాను, ఓ క్యాడర్ అధికారులను ఓఎస్ డీలుగా ప్రభుత్వం నియమించేందుకు అవకాశాలున్నాయి.

- Advertisement -

ఈ మధ్య పదవీ విరమణ పొందిన తెలంగాణేతర ప్రాంతానికి చెందిన ఓ ఉన్నతాధికారి మళ్లీ ప్రయత్నం చేసుకుని ఇక్కడే వచ్చి వాలారు.కానీ జీహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం వారికి అతి ముఖ్యమైన ఫైనాన్స్, పరిపాలన వంటి విభాగాలు అప్పగించకుండా ఇతర విభాగాలకు వారి సేవలను ఉపయోగించవచ్చు. కానీ ఓ అధికారి ప్రభుత్వంలోని ఓ పెద్ద అధికారి అండతో జీహెచ్ఎంసీలో మళ్లీ అదనపు కమిషనర్ గా కొనసాగుతున్నారు. ఆయనకు ఐటీ, ఫైనాన్స్ లతో పాటు అతి ముఖ్యమైన పరిపాలన విభాగాలను కూడా కట్టబెట్టారు. సదరు అధికారి నియామకంపై కమిషనర్ సైతం విముఖంగా ఉన్నట్లు సమాచారం. పరిపాలన బాధ్యతలను ఇవ్వటమే గాక, సదరు అధికారికి చెక్ పవర్ కూడా ఇవ్వటం పట్ల జీహెచ్ఎంసీలోని పలు ఉద్యోగ , కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి.ఇతర విభాగాలు, శాఖల నుంచి డిప్యూటేషన్ పై బల్దియాకొచ్చి, నిబంధనలను ఉల్లంఘించి ఏళ్ల తరబడి సీట్లలో కొనసాగితే అర్హత ఉన్నా, తమకెపుడు పదోన్నతులు కల్గుతాయని కార్పొరేషన్ ఉద్యోగులు వాపోతున్నారు. కార్పొరేషన్ కు చెందిన ఉద్యోగుల్లో సీనియార్టీ ప్రకారం, రిజర్వేషన్ల అమలుతో ఉన్నతమైన పదవులను పొందిన వారు సింగిల్ డిజిట్ లోనే ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కొందరు ఉద్యోగులకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా, మరికొందరికి జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా, బిల్ కలెక్టర్లుగా మొత్తం 300 మందికి పదోన్నతులు కల్పించిన అధికారులు ఇంత వరకు వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Evil year after year in Greater

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page