ప్రియుడు కోసం కొడుకోనే చంపి…

0 27

అనంతపురం  ముచ్చట్లు :
ఐదు పదుల వయసు దాటినా శారీరక సుఖం కోసం బరితెగించిన కిరాతక తల్లి కన్నప్రేమకే మచ్చతెచ్చింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో కన్నకొడుకునే చంపేసి చివరికి కటకటాల పాలైంది. అనంతపురం జిల్లా కదిలి పట్టణంలో జరిగిన దారుణ ఘటన తాలూకు వివరాలను కదిరి డీఎస్పీ భవ్యకిషోర్‌ వెల్లడించారు.కదిరి పట్టణం కంచుకోటలోని బిలాల్‌వీధికి చెందిన బాలసుబ్బలక్ష్మి భర్త వీరనారాయణ కొన్నేళ్ల కిందటే మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె శ్రీనివాసులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తల్లి వ్యవహారం గురించి తెలుసుకున్న కుమారుడు బాలచిన్న (24) తరచూ ఆమెతో గొడవపడేవాడు. తల్లి ప్రవర్తనపై విసిగిపోయి మద్యానికి బానిసై డబ్బుల విషయంలో ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో తనకు అన్ని రకాలుగా అడ్డొస్తున్న కొడుకును చంపేయాలని నిర్ణయించుకుని ప్రియుడికి చెప్పింది.తన కొడుకును హత్యచేస్తే రూ.లక్షన్నర సుపారీ ఇస్తానని, తెలిసిన వారిని పురమాయించాలని సుబ్బలక్ష్మి తన ప్రియుడికి చెప్పింది. అందుకు అంగీకరించిన శ్రీనివాసులు తన అల్లుడు ఆదినారాయణ, రామ్మోహన్‌, బిట్ర ప్రభాకర్‌ అనే వ్యక్తులతో కలిసి హత్యకు స్కెచ్ వేశాడు. ఈ మేరకు నలుగురు ఆమె నుంచి రూ.లక్షన్నర సుపారీ తీసుకున్నారు. నిందితుడితో పరిచయం ఏర్పరచుకుని పలుమార్లు మద్యం తాగారు.ఈ క్రమంలోనే మద్యంలో విషం కలిపి హత్య చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. మూడోసారి విఫలం కాకూడదని కిరాయి హంతకుల్లో ఒకడైన నేరచరిత కలిగిన గాండ్లపెంట మండలానికి చెందిన బిట్ర ప్రభాకర్‌ తన నాటు తుపాకీని వెంటతీసుకెళ్లాడు. ఈనెల 16న చిన్నతో కలిసి నలుగురు నిందితులు నల్లచెరువు మండలం పోలేవాండ్లపల్లి సమీపంలోని ఆవులచెరువు వద్దకు మద్యం తాగేందుకు వెళ్లారు. ప్రణాళిక ప్రకారం చిన్నకు పురుగు మందు కలిపిన మద్యం తాగించారు. ఆయన అపస్మారక స్థితిలోకి చేరుకోగానే మొదట కర్రతో, బండరాళ్లతో ముఖం, తలపైన బాదారు. చిన్న చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ నెల 21న పోలేవాండ్లపల్లి వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వద్ద దొరికిన వివరాల ఆధారంగా చిన్న భార్య పవిత్ర, తల్లి సుబ్బలక్ష్మి మృతదేహాన్ని గుర్తుపట్టారు. వాంగ్మూలం తీసుకునే సమయంలో తల్లి సుబ్బలక్ష్మి పొంతనలేని సమాధానాలు చెప్పడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిజం వెలుగుచూసింది.ఆమె ఇచ్చిన సమాచారంతో నిందితులను కదిరి మండలం సున్నపుగుట్టతండా వద్ద సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి నాటుతుపాకీ, మద్యం సీసా, పురుగుమందు, తుపాకీ గుండ్లు, హత్యకు వాడిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో కన్నతల్లే కొడుకును చంపిందని తెలుసుకుని కదిరి పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు. ఇంతటి నీచానికి పాల్పడిన కిరాతకురాలిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags”Killing son for boyfriend …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page