ఆన్ లైన్ క్లాసులుపై  గందరగోళం

0 10

హైద్రాబాద్  ముచ్చట్లు:

రాష్ర్టంలో ఆన్లైన్ క్లాసులపై గందరగోళం నెలకొంది. క్లాసులు నిర్వహించవద్దని జిల్లాల్లో డీఈవోలు ప్రకటనలు ఇస్తుంటే.. ప్రైవేటులో మాత్రం క్లాసులు కొనసాగుతున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఇందుకోసం పేరెంట్స్ నుంచి అదనంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సర్కారు మాత్రం జీవోలు ఇచ్చేశామని  చెప్పుకొస్తోంది. స్టేట్లో మొత్తం 10,700 వరకూ ప్రైవేటు స్కూల్స్ ఉండగా, వాటిలో 30 లక్షల మంది వరకూ స్టూడెంట్స్ చదువుతున్నారు. వాస్తవానికి జూన్ 12 నుంచి 2020–21 అకడమిక్ ఇయర్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్తో ఇంకా అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రకటించ లేదు. జూలై 1 నుంచి క్లాసు ప్రారంభించాలని సూచిస్తోంది.విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోయినా, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లోని చాలా స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి. తమ స్కూల్ పిల్లలు వేరే స్కూళ్లకు పోవద్దనీ, ఫీజులూ వసూలు చేసుకోవచ్చని మేనేజ్మెంట్లు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎల్ కేజీ పిల్లలకు కూడా క్లాసులు ప్రారంభించారంటే, మేనేజ్మెంట్ల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఈ క్లాసులు వినాలంటే తప్పనిసరిగా ఫీజులు చెల్లించాలని పేరెంట్స్ పై ఒత్తిడి తెస్తున్నాయి. లేకపోతే పిల్లలు వెనుకబడతారని భయపెడుతున్నాయి. కరోనా సంక్షోభం వల్ల ఫీజులు కట్టడం ఇబ్బందిగా ఉందని పేరెంట్స్ చెప్తున్నా, మేనేజ్మెంట్లు వినిపించుకోవడం లేదు. పేరెంట్స్ స్కూల్స్కు రావాల్సిన అవసరం లేదనీ, డిజిటల్ పద్దతుల్లో అకౌంట్ కు గానీ, గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా గానీ ఫీజులు చెల్లించాలని చెప్తున్నాయి. దీంతో పిల్లల భవిష్యత్ కోసం కొందరు పేరెంట్స్ అప్పులు తెచ్చి మరీ ఫీజులు కడుతున్నారు. కొన్ని చోట్ల స్కూల్స్ ముందు పేరెంట్స్ ఆందోళనలు కూడా చేస్తున్నారు.

- Advertisement -

లాక్డౌన్ టైంలో ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దని కోరుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 90 శాతం పేరెంట్స్ ఆన్ లైన్ క్లాసులు వద్దనే చెప్తున్నారు. క్లాసులకు ఫీజులు కట్టడం ఒక ఇబ్బంది కాగా, ల్యాప్ టాప్లు, స్మార్ట్ ఫోన్లు లేకపోవడమూ మరో కారణం అంటున్నారు.నిబంధనలకు విరుద్ధంగా లాక్ డౌన్ టైంలో పలు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నడుపుతున్నాయి. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్స్ యూనియన్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా, పట్టించుకోవడం లేదు. అయితే జిల్లాల్లో డీఈఓలు మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని, ఎలాంటి క్లాసులు నిర్వహించవద్దని ప్రకటనలు ఇస్తున్నారు. కానీ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్లు ఆ ప్రకటనలను లెక్కచేయడం లేదు. ప్రభుత్వం నుంచి ఆన్ లైన్ క్లాసులు నిర్వహణపై ఎలాంటి ఆదేశాలు రాలేదని, క్లాసులు నడుపుకోవచ్చని మేనేజ్మెంట్ల సంఘం ప్రకటన ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించి, క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ లేకపోవడంతో విద్యాశాఖ సెక్రటరీయే ఆ బాధ్యతలు చూస్తున్నారు. సెక్రటరీ నుంచీ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ క్లాసులు నడుపుకోవచ్చనే ఆర్డర్ ఇచ్చినా, ఎన్నిగంటలు, ఎలా నిర్వహించాలి? స్మార్ట్ఫోన్లు లేని వారి పరిస్థితి ఏంటీ? అన్నవి ఆలోచించాల్సిన అవసరముందని విద్యావేత్తలు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు నడుస్తుండటంతో, సర్కారీ స్కూళ్లలో చదివే విద్యార్థులు, పేరెంట్స్ లో ఆందోళన మొదలైంది. స్కూళ్లు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉండటంతో వారిలో అయోమయం ఏర్పడింది. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగితే, చాలా మంది సర్కారీ స్కూళ్ల స్టూడెంట్లు ప్రైవేటు స్కూళ్లలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు స్కూల్స్ ప్రతినిధులు ఆ మేరకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అయితే ఆన్ లైన్ ఎడ్యుకేషన్ తో అసమానతలు మరింత పెరుగుతాయని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Confusion over online classes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page