ఉత్సవ విగ్రహాలుగా ప్రజా ప్రతినిధులు

0 3

నిజామాబాద్ ముచ్చట్లు:

 

 

నిజామాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్‌తో పాటు మున్సిపల్ చైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యేల పెత్తనంతో వారు నలిగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్‌లు, ఒక మేయర్, ఆరు మున్సిపాలిటీలకు చైర్మన్లు ఉన్నారు. అందరూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ వారికి కనీసం ద్వితీయ శ్రేణి నాయకుల మాదిరిగా కూడా గుర్తింపు లభించడం లేదు. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను సుప్రీం బాసులుగా చేయడంతో వారి కన్నుసన్నల్లోనే అందరూ పని చేయాల్సిన పరిస్థతి నెలకొంది. పేరుకు ముందు ప్రొటోకాల్, క్యాబినెట్ ర్యాంకులు ఉన్న ఎమ్మెల్యేల ముందు మాత్రం అవి దిగదుడుపుగా మారాయి. జిల్లాలో మంత్రి, శాసనసభ స్పీకర్, పీయూసీ చైర్మన్ ఉండగా మిగిలిన ఆరు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేల పెత్తనం కొనసాగుతోంది. జిల్లా పరిషత్ చైర్మన్.. ఆయనది జిల్లాలో క్యాబినెట్ ర్యాంక్ హోదా. జిల్లాలో జరిగే కార్యక్రమాలకు ఆయన్నే ప్రాతినిధ్యం వహించాలి.మంత్రులు లేనప్పుడు క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరుకావడం ఆయన ప్రధాన విధి. జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫిషియో హోదాలో హాజరైనా.. ఆయన లేకుంటే సమావేశాలకు ప్రాధాన్యత ఉండదు. ప్రభుత్వం చేపట్టే డెవలప్ మెంట్ కార్యక్రమాల్లో జిల్లాపరిషత్ చైర్మన్‌కు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలి. నగర మేయర్. నగర పాలక సంస్థలో ప్రథమ పౌరులుగా ప్రధాన అగ్రతాంబులం మేయర్‌కే దక్కుతుంది. నగర పాలక సంస్థ పరిధిలో ఎటువంటి కార్యక్రమమైనా మేయర్ అధ్యక్షతన జరుగాల్సిందే. నగర పాలక సంస్థ సమావేశాలు మొదలు బడ్జెట్ సమావేశాలు, నగరం అభివృద్ధి విషయంలో ఐఏఎస్, కమిషనర్‌గా ఉన్నప్పటికీ మేయర్ అనుమతితోనే కార్యక్రమాలు జరుగుతాయి. నగరానికి మంత్రులు వచ్చినా, గవర్నర్లు వచ్చినా, ప్రధాని వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా స్వాగతం పలుకాల్సింది మేయరే. మున్సిపాలిటీలకు చైర్మన్లే ప్రథమ పౌరులు. వారు నగర పాలక సంస్థ మాదిరిగానే మిగిలిన అన్నింటికి వారి అధ్యక్షతనే కార్యక్రమాలు జరుగాలి. దానికనుగుణంగానే కార్యాచరణ ఉంటుంది. మున్సిపాలిటీ పరిధిలో ఎవరు వచ్చినా వారి ఆధ్వర్యంలోనే పనులు జరుగాలి.ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చి అధికారికంగా పదవులు అనుభవిస్తున్నప్పటికీ వారిపై పెత్తనం మాత్రం స్థానిక ఎమ్మెల్యేలదే. జిల్లా పరిషత్ సమావేశాల నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధుల అనుమతి తప్పనిసరిగా మారింది. నగర పాలక సంస్థ మున్సిపాలిటీలలో సాధారణ సమావేశాలతో పాటు బడ్జెట్ సమావేశాలు కూడా ఎమ్మెల్యేల కన్నుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు లేకుండా ఒక్క పాలకవర్గం సమావేశం జరుగడం కానీ, ఏదైనా డెవలప్‌మెంట్ తీర్మాణాలు జరుగవు. ఒకవేళ జరిగినా అక్కడ ప్రతిపక్షాలు బలంగా లేని ప్రాంతాల్లోనే సమావేశాల నిర్వాహణ జరుగుతోంది. ప్రథమ పౌరులు అని వారు ఏదైనా కార్యక్రమాన్నిప్రారంభించాలనుకుంటే మాత్రం ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి. ఏవైనా కార్యక్రమాలు వారు చేస్తున్నారంటే చిన్న చితక కార్యక్రమాలు మినహా పెద్ద కార్యక్రమాల్లో లోకల్ ఎమ్మెల్యే అనుమతి లేకుండా వేలు పెట్టని పరిస్థితి నెలకొంది.ఎమ్మెల్యేల దయాదక్షిణ్యాల మీద ప్రజాప్రతినిధులైన వారు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు సాగనంపే బాధ్యతను మోస్తున్నారు. పేరుకు అగ్రతాంబులం అయినా కుర్చీ మాత్రమే ప్రత్యేకమని, తోటి సభ్యుల మాదిరిగానే ఉంటున్నామని వారు వాపోతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి వారిపై నెలకొంది. తమ రాజకీయ భవిష్యత్తును ఊహించుకుని వారెవ్వరు కిమ్మనుకుండా పని చేస్తున్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చినా, మరెవ్వరు వచ్చినా తమ గోడును వెళ్లబోసుకోలేని పరిస్థితిలో సతమతమౌతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Public representatives as ceremonial statues

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page