కంచుకోటలో  పదవులెక్కడ

0 8

నల్గొండ ముచ్చట్లు:

 

కప్పుడు కాంగ్రెస్‌కు నల్లగొండ జిల్లా కంచుకోట. ఉద్దండులైన నాయకులు ఉన్నారక్కడ. పార్టీ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లాకు పెద్దపీట వేసేవారు. ప్రస్తుతం ప్రకటించిన పీసీసీలో జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. ఎందుకీ పరిస్థితి? సీనియర్లు ఉన్నా.. ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?దిగ్గజ కాంగ్రెస్‌ నాయకులు ఉన్న జిల్లా ఉమ్మడి నల్లగొండ. పార్టీకి బలమైన నాయకత్వం.. కేడర్‌ ఉండేది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు ఎంపీలు కాంగ్రెస్‌ ఖాతాలోనే పడ్డాయి. ఔట్‌గోయింగ్‌ పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి.. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి.. ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఈ ప్రాంతానికి చెందినవారే. ఇంత మంది ఉన్నా.. ఈ దఫా ప్రకటించిన పీసీసీలో నల్లగొండ జిల్లాకు సరైన ప్రాధాన్యం దక్కలేదనే చర్చ కాంగ్రెస్‌లో సాగుతోంది.2014 ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు కాంగ్రెస్‌ గెల్చుకుంది. ఒక ఎంపీ సీటు కూడా కాంగ్రెస్‌దే. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీయడంతో విపక్షం కుదేలైంది. ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు నాడు కారెక్కేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకే కాంగ్రెస్‌ పరిమితమైంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య గెలిచారు. వీరిలో చిరుమర్తి లింగయ్య కండువా మార్చేశారు. మంత్రులుగా పనిచేసిన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఉత్తమ్‌ భార్య పద్మావతి ఓడిపోవడంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

 

 

 

- Advertisement -

2019 లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఉత్తమ్‌, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచి ఉత్సాహం నింపారు. కానీ.. ఉత్తమ్‌ రాజీనామాతో ఉపఎన్నిక జరిగిన హుజూర్‌నగర్‌ అసెంబ్లీ సీటు మాత్రం గులాబీ ఖాతాలో పడింది. ఇక్కడ పోటీ చేసిన ఉత్తమ్‌ భార్య పద్మావతి ఓడిపోయారు. ప్రస్తుతం జిల్లాలో ఒకే ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. ఆయన కూడా పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియని స్థితి. తాజాగా ప్రకటించిన పీసీసీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చోటు దక్కలేదు. ఏ కమిటీలోనూ చోటు ఇవ్వలేదు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని మాత్రం ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. హేమాహేమీలైన కాంగ్రెస్‌ నేతలు ఉన్న జిల్లా నుంచి ఒక్కరినే పరిగణనలోకి తీసుకోవడం పార్టీ వర్గాలకు మింగుడు పడటం లేదట.పీసీసీ పీఠం దక్కకపోవడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ మారితే జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టే. వరస ఎన్నికల్లో ఓటమి.. అధికారానికి దూరమై చాన్నాళ్లు అవుతుండటంతో పార్టీ కేడర్‌ చాలాచోట్ల సర్దుకుంటోంది. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో జానారెడ్డి ఓడిపోవడంతో శ్రేణులు డీలా పడ్డాయి. ఇటు పార్టీ పదవులు లేక.. అటు నాయకులు ఎన్నికల్లో గెలవక జిల్లాలో కాంగ్రెస్‌ భవిష్యత్‌ ఏంటన్నది కాలమే చెప్పాలంటున్నాయి పార్టీ వర్గాలు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Position in Kanchukota

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page