సౌత్ కోస్టల్ జోన్  గా విశాఖ రైల్వే

0 17

విశాఖపట్టణం ముచ్చట్లు:

 

 

రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రైల్వే ప్రత్యేక జోన్‌ ఏర్పాటుకు అడుగులు చకచకా పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్‌కోస్టు) జోన్‌, ఒడిశాలోని రాయగడ డివిజన్ల ఏర్పాటుకు రైల్వే సమాయత్తమైంది. ఈ రెండు అంశాలపై రైల్వే మంత్రిత్వ శాఖకు పంపిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లపై నిర్ణయం ఇప్పటికీ పెండింగులోనే ఉంది. ఏర్పాటుకు సమయం పడుతుందని రైల్వేమంత్రి గతంలో ప్రకటించారు. అయితే వీటి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.డీపీఆర్‌లో పేర్కొన్నట్లుగా.. రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. ముందు పరిపాలన మొదలుపెట్టి ఆ తర్వాత కొత్త భవనాల్ని నిర్మించుకోవచ్చన్న అంశం కూడా చర్చల్లో ఉంది. ఈ జోన్‌ ఏర్పడాలంటే కొత్తగా వస్తున్న రాయగడ డివిజన్‌ కూడా ఏర్పాటు చేయాలి. అయితే అక్కడ ప్రస్తుతానికి మౌలిక వసతులేమీ లేవు. పైగా ఒడిశా నుంచి రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు రైల్వేబోర్డు, ఇటు తూర్పుకోస్తా రైల్వేజోన్‌ దృష్టంతా రాయగడలో ఏర్పాట్ల మీదే ఉన్నట్లు కనిపిస్తోంది.దక్షిణ కోస్తా జోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాట్లకు రూ.170 కోట్లు మంజూరయ్యాయి. అయితే గతేడాది బడ్జెట్‌లో రూ.3 కోట్లు, ఈ ఏడాది రూ.40లక్షలు ఇచ్చారు. ఇవన్నీ సిబ్బంది జీతభత్యాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. దక్షిణకోస్తా జోన్‌ అవసరాలకు ప్రత్యేకాధికారిగా ఓఎస్డీని, రాయగడలో ఏర్పాట్ల కోసం నోడల్‌ అధికారిని నియమించారు. రాయగడలో కొత్త డివిజన్‌ ఏర్పాట్లు పూర్తవడానికి రెండేళ్లు పట్టొచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే జోన్‌కు జనరల్‌ మేనేజర్‌ను, కొత్త డివిజన్‌కు డీఆర్‌ఎంను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం సిబ్బంది, రైల్వే ఆస్తులు, వనరుల పంపకాలు ఉంటాయని అంటున్నారు. దీన్నిబట్టి విశాఖకు జీఎం రావడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టొచ్చని అంచనా. మరోవైపు వాల్తేరు రైల్వే డివిజన్‌ ఉండదని తెలుస్తోంది.విజయనగరం నుంచి రాయగడ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ దాకా మూడో లైన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాయగడలో రూ.40కోట్ల విలువైన పనులు జరుగుతున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. డివిజన్‌ కేంద్ర కార్యాలయానికి భూకేటాయింపులు చేయడంతో పాటు సర్వే కూడా పూర్తయింది. దీంతో నిర్మాణాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారాల పెంపు, ఇతర భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
రైల్వేస్టేషన్‌కు, యార్డుకు వచ్చి వెళ్లే రైళ్ల రాకపోకలకు సిగ్నళ్లు అందించే కీలక ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ (ఈఐ)ను రాయగడలో తీసుకొస్తున్నారు. అధునాతన పరికరాలు ఉంచేందుకు అవసరమైన భవనాలు సిద్ధమయ్యాయి. రాయగడలో కొత్త డివిజన్‌కు అనుకూలంగా రైళ్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్లాట్‌ఫారాల సంఖ్యనూ పెంచుతున్నారు. ఇదివరకు మూడు ప్లాట్‌ఫాంలే ఉండగా, ఇప్పుడా సంఖ్యను 5కు పెంచుతున్నారు. డివిజన్‌లో రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యతల్ని చూసే ఆర్‌పీఎఫ్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం రాయగడలో నిర్మాణాలు జరుగుతున్నాయి. డివిజన్‌ స్థాయి అధికారుల కార్యాలయాలకు సన్నాహాలు చేస్తున్నారు.దేశంలో 16 రైల్వే జోన్లున్నాయి. వీటితో పాటు దక్షిణకోస్తా (సౌత్‌ కోస్ట్‌) పేరును రైల్వేబోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో జనరల్‌ మేనేజర్ల జాబితాలో చేర్చింది. దీన్ని బట్టి విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు ఖాయమని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలంటే కొత్త జోన్‌ ప్రస్తావన అవసరం. అందుకోసమే అధికారిక వెబ్‌సైట్‌లో పేరును పొందుపరిచినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Visakhapatnam Railway as South Coastal Zone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page