గుంటూరు జిల్లాల్లో రేవ్ పార్టీ కల్చర్

0 13

గుంటూరు     ముచ్చట్లు:

జిల్లాలో రేవ్ పార్టీ సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి హోటళ్లు, ప్రైవేటు అతిథి గృహాల్లో వ్యభిచారానికి పాల్పడుతున్నారు. పోలీసులు నిఘా పెడుతున్నా ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకోవడం అందరినీ కలవరపెడుతోంది. నెలరోజుల క్రితం గుంటూరు అరండల్‌పేటలో ఓ హోటల్‌లో విత్తన కంపెనీ డీలర్‌ ఒకరు తన పుట్టిన రోజు వేడుకలకు బెంగళూరు నుంచి యువతులను రప్పించాడు. వారితో కలిసి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.ఆ ఘటన మరిచిపోకుండానే 3 రోజుల క్రితం క్రోసూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అధికార పార్టీకి చెందిన నాయకుడొకరు తన పుట్టిన రోజును పురస్కరించుకుని భారీ రేవ్‌ పార్టీ నిర్వహించారు. దీనికి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అర్ధనగ్నంగా ఉన్న యువతులతో నేతలు డ్యాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు దారితీసింది. గతంలో సత్తెనపల్లిలో వైసీపీ నేత ఒకరు తన పుట్టినరోజుకు వావిలాల ఘాట్‌ను వేదికగా చేసుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు వేయించడం విమర్శలకు దారితీసింది.అమ్మాయిలతో చిందులేస్తున్న వైసీపీ నేతలురాష్ట్రంలో అమలవుతున్న కోవిడ్ నిబంధనలను అధికార పార్టీ నేతలే ఉల్లంఘించి వేడుకలు నిర్వహించడం, దానికోసం బయటి ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకురావడం వంటి ఘటనలు పోలీసుల ఉదాసీన వైఖరికి అద్దం పడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మొత్తానికి జిల్లాలో కొందరు రాజకీయ నాయకులు, మరికొందరు వ్యాపారులు కరోనా కాలంలోనూ పోలీసుల కళ్లు గప్పి రేవ్‌ పార్టీలు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఒకేచోట ఎక్కువ మంది జనాలు గుమిగూడటం, భౌతికదూరం పాటించకపోవడం వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నా క్రోసూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వైకాపా నేతలు రేవ్‌ పార్టీ నిర్వహిస్తుంటే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోందిమరోవైపు క్రోసూరు ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో చూసిన గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ బాధ్యులైన వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో స్థానిక పోలీసులు అప్పుడు రంగంలోకి దిగి రేవ్ పార్టీ నిర్వహించిన ఇద్దరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఎస్పీ స్పందించే వరకు స్థానిక పోలీసులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టకపోతే యువత పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.చిలకలూరిపేటకు చెందిన అధికార పార్టీ నాయకుడొకరు మూడు రోజుల క్రితం చీరాల వద్ద ఓ రిసార్ట్స్‌లో ఇలానే రేవ్‌ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి తాను అధికార పార్టీ నాయకుడినని, తనకు నామినేటెడ్‌ పదవి ఉందని, తననే పట్టుకుంటారా అంటూ పోలీసులపై చిందులు తొక్కాడు. అయినా పోలీసులు అతన్ని వదలకపోవడంతో ఓ ప్రజాప్రతినిధి బంధువు అక్కడి పోలీసులకు నచ్చజెప్పి విడిపించుకుని వెళ్లినట్లు చిలకలూరిపేట ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు.గతంలో బాపట్ల సూర్యలంక బీచ్‌లో ఓ రిసార్ట్స్‌లో హైదరాబాద్‌ నుంచి ఫార్మా కంపెనీ ప్రతినిధులు అమ్మాయిలను తీసుకొచ్చి భారీగా రేవ్‌ పార్టీ నిర్వహించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపకపోతే విష సంస్కృతి మరింత విస్తరించే అవకాశం ఉందని జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Rave party culture in Guntur districts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page