కరోనాతో నిలిచిపోయిన సర్జరీలు

0 17

హైదరాబాద్  ముచ్చట్లు:
రాష్ట్రంలో గరిబోళ్లకు పెద్ద రోగమొస్తే ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలకు చికిత్స అందని ద్రాక్షగా మారింది. పేరుకు రెండు పెద్దాస్పత్రుల్లో క్యాథ్‌ ల్యాబ్స్‌ ఉన్నా.. చికిత్స అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. గుండె సంబంధిత జబ్బులకు చికిత్స అందించడానికి రాష్ట్రం మొత్తం మీద మూడు ఆస్పత్రుల్లో మాత్రమే క్యాథ్‌ ల్యాబ్‌ సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్‌, సికింద్రాబాద్‌ గాంధీ, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో తప్పా యాంజియోగ్రామ్‌లు, యాంజియో ప్లాస్టీలు నిర్వహించే ఆస్పత్రులు మరెక్కడా లేవు. కొంతకాలంగా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో క్యాథ్‌ ల్యాబ్‌ సేవలు అందుబాటులో లేవు. ఏడాది కిందట ఉస్మానియాలోని క్యాథ్‌ ల్యాబ్‌ మరమ్మతులకు గురై మూలకు పడింది. ఇక గాంధీ.. కోవిడ్‌ నోడల్‌ కేంద్రంగా మారడంతో ఏడాదిన్నరగా సేవలు అందుబాటులో లేవు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులు నిమ్స్‌కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ వారం రోజులు, ఒక్కోసారి నెల రోజుల సమయం కూడా పడుతుంది.

సర్కార్‌ ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అత్యవసరమైన రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో హార్ట్‌ ఆపరేషన్‌కు వీలైన క్యాథ్‌ల్యాబ్స్‌, ఇతర సదుపాయాలు ఉన్నాయి. కార్డియాలజీ ప్రొఫెసర్లు, పీజీ డాక్టర్లు ఉన్నా ఏడాదికిపైగా ఈ రెండు హాస్పిటల్స్‌లో ఒక్క హార్ట్‌ సర్జరీ కూడా చేయలేదు. ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగానికి రోజూ సుమారు 300 మంది రోగుల వరకు వస్తుంటారు. ఇక్కడ రోజుకు 10-15 వరకు యాంజియోగ్రాములు, 7-10 వరకు యాంజియో ప్లాస్టీలు జరుగుతుంటాయి. కాని అత్యంత కీలకమైన క్యాథ్‌ ల్యాబ్‌ సేవలు మాత్రం ఏడాదిగా నిలిచిపోయాయి. 2006లో నెలకొల్పిన క్యాథ్‌ ల్యాబ్‌.. 2016 వరకు బాగానే పని చేసింది. ఆ తర్వాత మోరాయిస్తుండగా.. మరమ్మతులు చేస్తూ 2019 వరకూ లాక్కొచ్చారు. మళ్లీ మోరాయించడంతో మరోసారి మరమ్మతులు చేసి గతేడాది మే వరకు నడిపారు. అప్పటికే పని భారం పెరిగిన ఆ పరికరం పూర్తిగా పని చేయకపోవడంతో క్యాథ్‌ల్యాబ్‌ సేవలు పూర్తిగా ఆగిపోవడంతో ల్యాబ్‌ను మూసేశారు. ఛాతి నొప్పి, గుండె సంబంధిత రోగాలతో వచ్చే వారికి కేవలం ఓపీ మాత్రమే చూసి పంపిస్తున్నారు. ఇక గాంధీ హాస్పిటల్‌ 2020 మార్చి నుంచి పూర్తిగా కరోనా ట్రీట్‌మెంట్‌కే పరిమితమైంది.

- Advertisement -

ఇటీవల నాన్‌కోవిడ్‌ సేవలు మొదలైనా, కార్డియాలజీ సేవలను ప్రారంభించలేదు. దాంతో ఇక్కడ హార్ట్‌ సంబంధిత సేవలు అందించలేని పరిస్థితి నెలకొనడంతో పేద రోగులు నిమ్స్‌, ఇతర ప్రయివేటు హాస్పిటల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది.ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల భారమంతా ఒక్కసారిగా నిమ్స్‌పై పడుతుండటంతో రోగులు వారాలకు వారాలు చికిత్స కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక క్యాథ్‌ ల్యాబ్‌ ఉన్నా కోవిడ్‌ ఆస్పత్రిగా మారడంతో 2020 మార్చి నుంచి ఇక్కడికి వచ్చే రోగులను ఉస్మానియాకు పంపించేవారు. మే 2020 నుంచి ఉస్మానియాలోనూ క్యాథ్‌ ల్యాబ్‌ పని చేయకపోవడంతో నిమ్స్‌కు పంపిస్తున్నారు. ఇవే కాకుండా ఉస్మానియాకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ నుంచి వారానికి ముగ్గురు, నలుగురు వస్తుంటారు. ఇక్కడ క్యాథ్‌ల్యాబ్‌ పని చేయకపోవడంతో వీరందరినీ నిమ్స్‌కు రిఫర్‌ చేస్తున్నారు. ఇంకా నిలోఫర్‌, ఈఎన్టీ, సరోజినీ, ఛాతీ, మెంటల్‌ హాస్పిటల్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్స్‌ నుంచీ కార్డియాలజీ సేవల కోసం నిమ్స్‌కు వస్తూ ఉంటారు. నిమ్స్‌లో ప్రస్తుతం ఉన్న 2 క్యాథ్‌ల్యాబ్స్‌లో ప్రతి రోజూ సేవలందించినా రోజుకు 50-60 మందికి మాత్రమే చికిత్స అందించగలుగుతున్నారు. దాంతో వారం, పది రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Stopped surgeries with the corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page