కేతిరెడ్డి వర్సెస్ ప్రభాకరరెడ్డి

0 24

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా అన‌గానే గుర్తుకు వ‌చ్చే రాజ‌కీయ కుటుంబం జేసీ ఫ్యామిలీ. ప్రభాక‌ర్‌ రెడ్డి, దివాక‌ర్ రెడ్డి సోద‌రుల రాజ‌కీయం.. రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రికీ తెలిసిందే. దాదాపు 40 ఏళ్ల పాటు తాడిప‌త్రిలో తిరుగులేని విజ‌యాలు సొంతం చేసుకున్న సోద‌ర ద్వయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే గత ఎన్నిక‌ల్లో ఇక్కడ తాడిప‌త్రి నుంచి వైసీపీ త‌ర‌ఫున కేతిరెడ్డి పెద్దారెడ్డి విజ‌యం ద‌క్కించుకు న్నారు. ఈ క్రమంలో ప్రభాక‌ర్ వ‌ర్సెస్ పెద్దారెడ్డిల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఆధిప‌త్య రాజకీయాల‌కు కేంద్రంగా మారిన తాడిప‌త్రి కొన్ని రోజుల పాటు ప్రధాన వార్తగా మారింది. ఇక‌, పోలీసు కేసులు.. ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాలతో ప్రభాక‌ర్ కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే పెద్దారెడ్డి ఆయ‌న ఇంటికి వెళ్లిమ‌రీ హెచ్చరిక‌లు జారీ చేయ‌డం కూడా అంద‌రికీ తెలిసిందే. అయితే.. స్థానిక ఎన్నిక‌ల్లో తాడిప‌త్రి మునిసిపాలిటీలో ప్రభాక‌ర్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఏపీ మొత్తం మీద టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాల్టీ ఇదే..! త‌న విజ‌యానికి జ‌గ‌న్ కార‌ణ‌మ‌ని.. ఆయ‌న స‌హ‌క‌రించ‌క‌పోతే.. గెలుపుగుర్రం ఎక్కేవాడిని కాద‌ని.. ప్రభాక‌ర్ రెడ్డి బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో ఇక‌, ఇరు ప‌క్షాల మ‌ధ్య ర‌గ‌డ స‌డ‌లిపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. దివాక‌ర్‌, ప్రభాక‌ర్‌రెడ్డి కుటుంబాల ఆధిప‌త్యంలో కొన‌సాగుతున్న ఓ ఆల‌యం విష‌యంలో పెద్దారెడ్డి వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ప్రస్తుత తాడిపత్రిలో ర‌గ‌డ‌కు కార‌ణంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలోని వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. 1950 నుంచి ఈ ఆలయం జేసీ వర్గీయుల చేతుల్లో ఉంది. వారే కమిటీ మెంబర్లుగా ఉంటున్నారు. అయితే.. పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక జేసీ వ‌ర్గానికి చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి ఆ గుడిని దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చేశారు, ఇక‌, అప్పటి నుంచి ఆలయం అంతా దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. జేసీ ఫ్యామిలీ పెత్తనం నామమాత్రంగా మారిపోయింది. దీంతో జేసీ వ‌ర్గం స‌హ‌జంగానే ఆందోళ‌న‌కు గురైంది.ఈ క్రమంలోనే త‌మ స‌త్తా చాటాల‌నుకున్న జేసీ వ‌ర్గం .. ఈ ఆల‌యంలో యాగం త‌ల‌పెట్టింది. అయితే.. దీనికి అధికారులు అడ్డు చెప్పారు.జేసీ వర్గం యాగం తలపెట్టిన సమయంలోనే అధికారపార్టీ నాయకులు ఆల‌యంలో నియ‌మితులైన‌ కొత్త కమిటీ ద్వారా పూజలు చేయిస్తామని ప్రకటించారు. దీంతో ఇది మ‌రింత వివాదానికి కార‌ణంగా మారింది. జేసీ వ‌ర్సెస్ పెద్దారెడ్డి వర్గాలు ఆల‌యం విష‌యంలో పోటీ ప‌డుతుండడం.. రాజ‌కీయంగా తాడిపత్రిలో ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయోన‌ని అధికారులు హ‌డ‌లి పోతున్నారు. ఈ క్రమంలోనే రెండు వర్గాలను ఆలయం చుట్టుపక్కలకు రాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే.. రాజ‌కీయంగా ఆధిపత్య ధోర‌ణితో ముందుకు సాగుతున్న ఈ రెండు వ‌ర్గాలు ఎప్పుడైనా ఘ‌ర్షణ‌కు దిగే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి తాడిపత్రిలో ఎప్పుడు? ఏం జ‌రుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:Kethireddy vs. Prabhakarreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page