డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నీళ్లు

0 4

మెదక్ ముచ్చట్లు:

మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు ప్రభుత్వం కేటాయించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల్లలో నాణ్యత లేమి స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో చిన్నపాటి వర్షానికే ఇండ్ల గోడలు కూలిన విషయం విధితమే. తాజాగా మరోమారు ఓ ఇంట్లో ఫ్లోరింగ్‌ కుంగిపోయింది. దాంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ కింద పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కాగా నిర్వాసితులకు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాల్టీ లోని ముట్రాజ్‌పల్లి వద్ద నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఇండ్లు కేటాయించారు. వేసవికాలంలో ముంపు గ్రామాల నిర్వాసితులను కాలనీలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లలోకి తరలించారు. వేసవికాలంలో తక్కువ వర్షాలు కురిసినప్పుడే ఆర్‌ అండ్‌ఆర్‌ కాలనీలో పల్లెపహాడ్‌ గ్రామానికి చెందిన భూ నిర్వాసితుని ఇంటిమెట్ల కింద బాత్‌రూం పక్కనున్న గోడ కూలింది. తాజాగా రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో ఏటీగడ్డ కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన నాయిని ముత్యంకు కేటాయించిన ఇంట్లో ఫ్లోరింగ్‌  ఒక్కసారిగా కుంగిపోయింది. ఇంట్లో నివసిస్తున్న వారు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని సామగ్రి మొత్తం కిందపడి పగిలిపోయాయి. అదేవిధంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లుకు సంబంధించిన గోడలు తేమ వస్తున్నాయనీ, పై కప్పు, స్లాబు ఊరుతు న్నాయని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. ‘నిర్వాసితుల త్యాగం మరువలేనిది వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని’ చెప్పిన నాయకుల మాటలు నమ్మి మోస పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలతో అడుకోవద్దని అధికారు లు, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి మాటలు నమ్మి తమ గ్రామాలు, బంగారు పంటలు పండే భూములను వదులుకొని జీవనోపాధి కోల్పోయి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోకి వచ్చామనీ, ఇక్కడ ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందో తెలియక భయాందోళనలో బతుకుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
కుంగిపోతున్న ఇళ్లు…
గోడలు కూలుతున్నయ్.. ఫ్లోరింగ్‌‌‌‌లు ‌‌‌‌కుంగుతున్నయ్.. స్లాబుల్లోంచి నీరు కారుతున్నయ్.. మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం గజ్వేల్ మండలం ముట్రాజ్‌‌‌‌పల్లిలో సర్కారు నిర్మించిన ఆర్ అండ్‌‌‌‌ ఆర్ ‌‌‌‌కాలనీలో ఇండ్ల పరిస్థితి ఇది. రెండు నెలల క్రితం ఏటిగడ్డ కిష్టాపూర్కు చెందిన 281 నంబరు నర్సింలు ఇల్లు, అదే గ్రామానికి చెందిన యాదగిరి 53 నంబరు ఇంటి గోడలు హఠాత్తుగా  కూలిపోయాయి. రెండు రోజుల క్రితం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన నాయిని ముత్యం 46 నంబరు ఇంట్లో ఏకంగా ఫ్లోరింగ్‌‌‌‌‌‌‌‌ ఒకటిన్నర అడుగు మేర కుంగిపోయింది. ఇండ్ల నిర్మాణ సమయంలో  పర్యవేక్షణ లేకపోవడం, నాణ్యతా లోపాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురైన 8 గ్రామాల్లోని నిర్వాసితుల కోసం గజ్వేల్ మండలం ముట్రాజ్పల్లి వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించారు. దాదాపు 6 వేల ఇండ్లకుగాను ఇప్పటివరకు 3 వేల పైచిలుకు ఇండ్లు నిర్మించి నిర్వాసితులను రెండు నెలల క్రితం హుటాహుటిన తరలించారు. గ్రామాలవారీగా కాలనీలను ఏర్పాటు చేసి వారికి  ఇండ్లను కేటాయించారు. ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలోని 3,000  ఇండ్లల్లో పీఆర్ ఇంజనీరింగ్ విభాగం 1,700,  మిగతా 1,30‌‌‌‌0 ‌‌‌‌ఇండ్లు డీడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు నిర్మించారు.  ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్న ధ్యాసతో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని నిర్వాసితులు చెబుతున్నారు. సరైన బేస్మెంట్‌‌‌‌‌‌‌‌ లేక గోడలు కూలడం, మొరం గట్టిపడకుండానే సిమెంట్ ఫ్లోరింగ్‌‌‌‌‌‌‌‌ చేయడం, ఇండ్ల చుట్టూ మట్టిని తొక్కించకపోవడం వల్ల వర్షాలకు భూమి కుంగుతోందని పేర్కొంటున్నారు. అధికారులు అసంపూర్తిగా నిర్మించిన ఇండ్లల్లో తమను వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ పైప్ను మొదటి అంతస్తు వరకు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేవలం ఐదు ఫీట్ల ఎత్తులోనే వదిలివేశారని పేర్కొంటున్నారు.ముట్రాజ్పల్లిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్ల యూనిట్ కాస్ట్ తక్కువగా ఉండటమే నాణ్యతా లోపాలకు కారణమై ఉంటుందని ఆఫీసర్లు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఒక్కో ఇంటికి రూ. ఆరు నుంచి ఏడు లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటే ప్రభుత్వం రూ. ఐదు లక్షలు మాత్రమే కేటాయించడం వల్ల నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని అంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన  డబ్బులను నిర్వాసితులకు నేరుగా  అందిస్తే దానికి మరిన్ని కలుపుకొని నాణ్యమైన ఇండ్లు నిర్మించుకునే అవకాశం ఉన్నా దీన్ని పట్టించుకోలేదు. ఇండ్ల నిర్మాణం సందర్భంగా నాణ్యతను పెద్దగా పట్టించుకోని ఆఫీసర్లు సమస్యలు తలెత్తగానే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. రెండు నెలల క్రితం కాలనీలో హఠాత్తుగా గోడలు కూలడంతో కళ్లు తెరచిన ఆఫీసర్లు సర్వే చేశారు. కాలనీలో దాదాపు 60కి పైగా గోడలు బాగా లేవని గుర్తించి వాటిని కూల్చి కొత్తవాటిని నిర్మించారు. రెండు రోజుల క్రితం ఫ్లోరింగ్‌‌‌‌ ‌‌‌‌కుంగడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు కాలనీలో ఫ్లోరింగ్ కుంగే అవకాశం ఉన్న ఇండ్లను గుర్తించారు. దాదాపు యాభైకి పైగా ఇండ్లల్లో ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేల్చారు. మళ్లీ ఇలాంటి ఘటన రిపీటైతే ప్రభుత్వానికి మచ్చగా మారుతుందనే భావనతో ఆదరాబాదరగా గుర్తించిన ఇండ్లలో ఫ్లోరింగ్‌‌‌‌‌‌‌‌ తొలగింపు పనులు ప్రారంభించారు. ఆర్అండ్‌‌‌‌‌‌‌‌ఆర్ కాలనీలో రెండు నెలలుగా నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో కాలనీవాసులు భయం భయంగా బతుకుతున్నారు. వర్షాలకు గోడలు తడిసి నీరు ఇంటి లోపలికి కారడంతో సామగ్రి మొత్తం తడిసిపోతోందని చెబుతున్నారు. భూమి తడిసి కుంగడం వల్ల శానిటరీ పైపులు పగిలి మురుగు రోడ్లపైకి చేరుతోందని, వర్షపు నీరు సైతం వెళ్లే దారి లేక రోడ్డుపై నిలిచి బురదమయంగా మారుతోందని వాపోతున్నారు. ప్రస్తుతం అరకొర వసతుల మధ్యనే దాదాపు పది వేలకు పైగానిర్వాసితులు కాలనీలో నివసిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Water in double bedroom homes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page