సింహాచలంలో ఎవరి స్వాధీనంలో ఎంత

0 1

విశాఖపట్టణం  ముచ్చట్లు:

సింహాచలం దేవస్థానం, మాన్సాన్‌ ఆస్తుల జాబితా నుంచి భూముల తొలగింపుపై చేపట్టిన విచారణ నివేదికకు పరిమితం కానుందా? మరో అడుగుముందుకేసి తొలగించబడిన భూముల స్థితిపై సమగ్ర సర్వే చేయించి చర్యలకు ప్రభుత్వం దిగుతుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సింహాచలం దేవస్థానం భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణాధికారిగా నియమించిన విశాఖపట్నం దేవాదాయదాయ, ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌ ప్రాథమిక నివేదికను తయారు చేశారు. దేవాదాయ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ భ్రమరాంబతో కలిసి పుష్పవర్ధన్‌ తయారు చేసిన నివేదికలో 2016లో ఒకేసారి దాదాపు 700 ఎకరాలు సింహాచలం అప్పన్న భూములను జాబితా నుంచి తప్పించిన విషయం నిర్ధారించినట్లు తెలిసింది. నిషేధిత జాబితా 22(ఎ)/సిని ఉల్లంఘించి రికార్డుల నుంచి తప్పించిన దేవస్థానం భూములు ఎవరిచేతుల్లో వున్నాయనేది తేలాలంటే సమగ్ర సర్వే చేయాల్సివుందని దేవాదాయశాఖాధికారులు అంటున్నారు. 700 ఎకరాల్లో అత్యధిక భాగం గత ప్రభుత్వ పెద్దల అనుయాయల చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానం భూములు పొందిన వారిలో టిడిపి, అధికార పార్టీకి చెందిన కొంతమంది పెద్దలు, వీరి అనుయాయులున్నట్లు తెలుస్తోంది. తొలగించిన భూములతో కొంతమంది రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసుకొని వందల కోట్లు లబ్ధిపొందగా, మరికొందరు ఇళ్ల స్థలాల కింద మార్చుకొని అమ్ముకున్నారు. మరికొందరు అప్పన్న భూములు అప్పనంగా కొట్టేసి సాగుచేసుకుంటున్నట్లు దేవాదాయశాఖ వద్ద ప్రాథమిక సమాచారం వున్నట్లు సమాచారం. తొలగించిన భూములన్నీ పెద్దల చేతుల్లో వుండడంతో నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకొనే సాహసం చేయలేకపోతున్నారు. 700 ఎకరాల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ముఖ్య అనుచరులు కొంతభూమిని దక్కించుకున్నారు. అప్పన్న భూములు దగ్గించుకున్న వారిని గుర్తించి, చర్యలకు ఉపక్రమించి స్వాధీనం చేసుకోవాలంటే ఆ భూముల వాస్తవ పరిస్థితిపై సర్వే చేపట్టాల్సివుంది. ప్రస్తుత భూమి స్థితిపై సర్వే చేపడితే భూ వినియోగం, ఎవరిచేతుల్లో ఎంతభూముంది? ఎవరి చేతుల మీదుగా ఎవరి చేతుల్లోకి ఎంతభూమి చేతులు మారిందన్న విషయాలు బహిర్గతం కానున్నాయి. అయితే ప్రభుత్వం ఆ తరహా సర్వే చేపట్టే దిశగా ముందుకువెళ్తుందా? 700 ఎకరాలు తొలగించబడినట్లు నిర్ధారణయ్యిందని రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, కేసులు, అందుకు సహకరించిన అధికారులపై చర్యల వరకే పరిమితమవుతుందా? అనేది వేచిచూడాల్సివుంది. రికార్డుల నుంచి తొలగించబడ్డ భూముల కథంతా బయటకు రావాలంటే సమగ్రసర్వే నిర్వహించి, ఎవరి స్వాధీనంలో ఎంత భూముంది? వారికి ఆ భూమి ఎలా సంక్రమించిందన్న నిజాలు బహిర్గతం చేసినప్పుడే ప్రభుత్వం చేపడుతున్న విచారణకు సార్ధకత వుంటుంది.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:How much is in anyone’s possession in Simhachalam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page