సీమ టపాకాయిలా రేవంత్

0 11

హైదరాబాద్ ముచ్చట్లు:
ఒక విధంగా కాంగ్రెస్ తెలంగాణాలో అతి పెద్ద ప్రయోగమే చేసింది. మూడేళ్ల క్రితం వరకూ అదే పార్టీని తిడుతూ టీడీపీలో ఉన్న‌ నేతను తీసుకువచ్చి ఏకంగా పీసీసీ చీఫ్ ని చేసేసింది. అయితే పక్క పార్టీ, కొత్త నేత అన్న తేడాలు లెక్కలు చూస్తూ కూర్చుంటే తెలంగాణాలో కాంగ్రెస్ నావ పూర్తిగా మునగడం ఖాయమని ఆ పార్టీకి తెలుసు. అందుకే ఉన్నంతలో నలుగురిని కూడగట్టే నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కి పగ్గాలు అప్పగించింది. రేవంత్ కి అసలే నోటి ధాటి ఎక్కువ. ఇక పదవి ఇచ్చాకా ఊరుకుంటారా. సీమ టపాకాయల్లా మాటల తూటాలు పేలుస్తున్నారు.కాంగ్రెస్ లో నాయకులకు కొదవ లేదు. కానీ తమ సొంత ఊరు నుంచి పక్క ఊరుకి వెళ్ళేసరికి వారు పరాయి వారిగా మారిపోతారు. అలాంటి స్థితిలో తెలంగాణాలో అన్ని ప్రాంతాలకు తెలిసిన నేతగా, చక్కని వక్తగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన పంచ్ డైలాగులకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. రేవంత్ కి సరిగ్గా ఉపయోగించుకుంటే ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి కొత్త ఉత్సాహం రావడం ఖాయం. ముఖ్యంగా టీయారెస్ మీద విసుగెత్తి ఉన్న జనాలలో ఆయన ఆశలు రేకెత్తిస్తే పరిణామాలు మారినా ఆశ్చర్యం లేదు.

ఇక ఏడేళ్ల క్రితం వరకూ ఒకే రాష్ట్రంగా ఉన్న ఏపీ తెలంగాణాలలో రాజకీయాలు కూడా ఒకే తీరున సాగుతాయి అంటారు. తెలంగాణాలో కాంగ్రెస్ కనుక ఏ మాత్రం పుంజుకుంటే మాత్రం ఆ ప్రభావం తప్పకుండా ఏపీ మీద కూడా పడుతుంది అంటున్నారు. తెలంగాణాలో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ జెండాను రెపరెపలాండించడంలో రేవంత్ రెడ్డి కనుక సక్సెస్ అయితే ఏపీ కాంగ్రెస్ కి కూడా హుషార్ వస్తుంది అని అంటున్నారు. విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి కదలికల మీద ఏపీ పాలిటిక్స్ కూడా ఇపుడు ఆసక్తిని ప్రదర్శిస్తోంది అనే చెప్పాలి.జగన్ కోసం ఒకనాడు రెడ్లు అంతా ఏకమయ్యారు. ఆయన ఏపీ సీఎం కావాల్సిందే. మా హవా సాగాల్సిందే. రెండవ మాట లేదు అని నాడు పంతం పట్టారు. ఇపుడు కూడా రేవంత్ రెడ్డి విషయంలో అలాంటి పరిస్థితి వస్తుందా అంటే రావచ్చు అన్న వారూ ఉన్నారు. తెలంగాణాలో రెండు దఫాలుగా అధికారం కోల్పోయింది కాంగ్రెస్. దాంతో రెడ్లు రాజకీయంగా ఎక్కువగా నష్టపోయారు. ఇపుడు రేవంత్ కనుక జెండా ఎత్తితే అన్ని విధాలుగా సాయం చేయడానికి ఆ సామాజికవర్గం ముందుంటుంది అంటున్నారు. ఏపీ రెడ్లు కూడా చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు అన్న మాటా ఉంది. మరి రేవంత్ రెడ్డి మీద ఒక అనుమానం ఉంది. ఆయన చంద్రబాబు శిష్యుడు అని, టీడీపీ అనుకూల మీడియాకు ఆప్తుడు అని.

 

- Advertisement -

ఆ విషయంలో సందేహాలు కనుక తీరితే రేవంత్ హిట్ అవుతారు అంటున్నారు. వరుసపెట్టి ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేయడానికి రేవంత్ సన్నద్ధమయ్యారు. ఇదే పార్టీకి కలిసొస్తుందని రేవంత్ భావిస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్‌ని ఎదురుకోవాలంటే గత పీసీసీ అధ్యక్షులు మాదిరిగా సైలెంట్‌గా ఉంటూ, పార్టీ సమావేశాల్లో మాత్రమే పాల్గొనడం చేయకూడదని రేవంత్ భావిస్తున్నారు.నిత్యం ప్రజల్లో ఉంటేనే కాంగ్రెస్‌కు కొత్త ఊపు వస్తుందని అనుకుంటున్నారు. అందుకే రేవంత్ వరుసపెట్టి ప్రజల సమస్యలపై కొట్లాడటానికి సిద్ధమయ్యారు. రాబోయే రోజుల్లో మరింతగా దూకుడుగా ఉండాలని చూస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు పోరాటాలు చేయాలనే విధంగా పనిచేస్తున్నారు. ఇదే కాకుండా రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా చేస్తారని తెలుస్తోంది. రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తే సక్సెస్ అవుతారనే ఫార్ములా వైఎస్సార్, చంద్రబాబు, జగన్‌ల విషయంలో నిజమైన విషయం తెలిసిందే.అందుకే రేవంత్ రెడ్డి కూడా అదే పాదయాత్ర ద్వారా జనాలకు దగ్గరయ్యి, నెక్స్ట్ కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో రేవంత్, సంజయ్‌కు మించేలా పాదయాత్ర ప్లాన్ చేసుకుంటారని తెలుస్తోంది. అంటే ఎన్నికల వచ్చే వరకు ప్రజల్లోనే ఉండాలని రేవంత్ ఫిక్స్ అయిపోయారు. చూడాలి మరి రేవంత్ ప్లాన్స్ ఎలా సక్సెస్ అవుతాయో?

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Seema Tapakaila Rewanth

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page