జులై 28న తిరుమలలో పల్లవోత్సవం

0 10

తిరుమల ముచ్చట్లు:

 

మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో జులై 28వ తేదీ బుధ‌వారం పల్లవోత్సవం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి పల్లవోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు అంద‌జేస్తారు.

- Advertisement -

చారిత్రక ప్రాశస్త్యం

శ్రీవారికి పరమభక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తిభావంతో భూరి విరాళాలు అందించారు. ఇందులో భాగంగా మూలవిరాట్టుకు, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్లాటినం, బంగారు, వజ్రాలు, కెంపులు, పచ్చలు తదితర అమూల్యమైన ఆభరణాలు బహూకరించారు. అదేవిధంగా బ్రహ్మూత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు అందించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదో రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి ఆయన అందించారు.ప్రతిరోజూ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతిరోజూ 5 కేజిల నెయ్యి ఇచ్చే సంప్రదాయం ఆయన ప్రారంభించగా అది నేటికీ కొనసాగుతోంది. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతినెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవం అనంతరం ఆలయానికి చేరుకుంటారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Pallavotsavam on July 28 in Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page