కరువులోనే రైతాంగం…

0 14

మిషన్ చెరువుల్లో కనిపించని నీరు

 

నిజామాబాద్ ముచ్చట్లు:

 

 

- Advertisement -

ఖరీఫ్‌ పంటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుకు అన్నివైపుల నుంచీ ఆదరణ కరువవుతోంది. ఒకవైపు వర్షాభావం.. మరోవైపు తగ్గిన భూగర్భ జలాలు వెరసి రాష్ట్రంలో చెరువుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. గొలుసు కట్టు సహా చెరువులన్నింట్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. ఫలితంగా పొట్టపోసుకోవడానికైనా ఈసారి సాగు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే 29 జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోయిన నేపథ్యంలో భవిష్యత్‌పై ఆందోళన నెలకొంది. మిషన్‌ కాకతీయకు ఎంపికైన చెరువుల్లోనూ చుక్క నీరులేకపోవడంతో ఆయకట్టు తడవడం కష్టంగా మారింది.ఖరీఫ్‌ అదను మించుతున్న సమయంలో వేసిన కాసిన్ని పంటలకు సాగునీరు అందడం గగనంగా మారింది. గత రెండేండ్లుగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి నిల్వలు పెద్దగా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో చెరువు పరిధిలోని ఆయకట్టు గట్టెక్కడం కూడా గండంగా మారింది. గొలుసుకట్టు చెరువులు సహా సాధారణ చెరువుల్లోనూ నీటి నిల్వలు అడుగంటి పోయాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా వెయ్యి చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, కోదాడ, తుంగతుర్తి, తిరుమలగిరి మండలాల్లో ఎక్కువశాతం చెరువులు వట్టిపోయాయి. మెదక్‌ జిల్లాలో 90శాతం చెరువులు ఎండుముఖం పట్టాయి.

 

 

 

 

కామారెడ్డి జిల్లాలో చెరువులు, ఊట చెరువులు కలిపి 1971 ఉండగా.. వాటి పరిధిలో 98,120 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. కానీ ఏడాదికాలంగా చెరువులన్నీ ఎండిపోయాయి. నిజామాబాద్‌ జిల్లాలో 3251 చెరువులుండగా అన్నీ ఎండిపోయాయి. అశోక్‌సాగర్‌, అలీసాగర్‌ లాంటి కొన్ని పర్యాటక ప్రాంతాల్లోని చెరువుల్లో మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇలాంటి తరుణంలో ఖరీఫ్‌ సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే 29 జిల్లాల్లో భూగర్భ జలాలు కూడా పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే గత జూన్‌ నెల మూడోవారం నాటికి మెదక్‌ జిల్లాలో -10.70, సంగారెడ్డి జిల్లాలో -7.65, ఆదిలాబాద్‌ జిల్లాలో -5.33, వికారాబాద్‌ జిల్లాలో -4.61, మేడ్చల్‌ మల్కాజిరిగి జిల్లాలో -5.16, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో -3.58, జనగామ జిల్లాలో -3.34 మీటర్ల మేర భూగర్భ జలాలు మరింత పడిపోయాయి.మిషన్‌ కాకతీయలో ఎంపికైన చెరువుల్లోనూ నీరు కరువైంది. పూడిక తీసిన చెరువుల్లోనూ నీరు లేకపోవడంతో రైతులకు ప్రస్తుతం ఎటువంటి ఆధారమూ లేదు. రంగారెడ్డి జిల్లా మొత్తం చెరువుల్లో 1045 చెరువులకు అనుమతులు వచ్చాయి.

 

 

 

 

ఇప్పటివరకు 695 చెరువుల పనులు పూర్తిచేశారు. ఏ ఒక్క చెరువులోకి నీరు చేరలేదు. దాంతో ఆయకట్టు పూర్తిగా బీడువారింది. జిల్లాలోని మొత్తం 2339 చెరువులను పునరుద్ధరించి వాటి పరిధిలోని 69,198 ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలని సంకల్పించినా లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి లేదు. నిర్మల్‌ జిల్లా పెంబి మండల కేంద్ర సమీపంలోని చెరువు కింద 300 ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉంది. 28 లక్షలతో పనులు చేపట్టినా చెరువులో నీటి జాడ లేకుండా పోయింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం పాకాల చెరువు సైతం డెడ్‌ స్టోరేజీకి చేరింది. చెరువు సామర్ధ్యం 3.38 టీఎంసీలు కాగా 18, 193 ఎకరాల ఆయకట్టుంది. పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Farmers in drought …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page