ఢిల్లీతో ఢీ..యేనా

0 10

న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం సాధ్యమని చెప్పుకొచ్చిన జగన్ రివర్స్ గేర్ వేశారా? రఘురామ వ్యవహారం మొదలు.. పోలవరానికి నిధుల వరకూ వరుస ఎదురుదెబ్బలతో తన పంథా మార్చుకున్నారా? కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ సర్కార్ అమీతుమీకి సిద్ధమైందా? ఢిల్లీని ఢీ కొట్టందుకు సిద్ధమయ్యే కేంద్రంపై మాటల యుద్ధం మొదలెట్టిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. లోక్‌సభ స్పీకర్ పక్షపాత వైఖరి వహిస్తున్నారంటూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలు.. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేయడం వంటి ఘటనలు ఆ వాదనలకు ఆజ్యం పోస్తున్నాయి.ఏపీకి ప్రత్యేక హోదా.. విశాఖ ఉక్కు.. పోలవరం ప్రాజెక్టుకి నిధులు.. విశాఖ రైల్వే జోన్ ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం ఇచ్చిన హామీలు కోకొల్లలు. గతంలో తమ కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ ప్రభుత్వం ప్రకటించిందని చంకలు గుద్దిన బీజేపీ.. అధికారంలోకి వచ్చాక హ్యాండిచ్చింది. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్య విలువలకు పాతరేసింది. అయినా తొలినాళ్లలో జగన్ కేంద్రంలోని మోదీ సర్కార్‌తో తలపడేందుకు సాహసించలేదు. సఖ్యతతో ఉంటూ పనులు సాధించుకోవాలనుకున్నా లక్ష్యం నెరవేరలేదనే చెప్పాలి.రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పూనుకోవడం.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడాన్ని జగన్ సర్కార్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ తన కేసుల నుంచి బయటపడేందుకు.. బాబాయ్ హత్య కేసు నిందితులైన సొంతవారిని కాపాడుకునేందుకే ఢిల్లీలో అమిత్‌ షా చుట్టూ తిరుగుతున్నారని ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇంకా మౌనంగా ఉంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ముందస్తు జాగ్రత్తతో వైసీపీ రివర్స్ గేర్ వేసిందన్న వాదనలున్నాయి.నోటితో పలకరించి నొసటితో వెక్కిరించినట్లుగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైసీపీ పక్కా ప్లాన్‌తోనే ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. రెబల్ ఎంపీ రఘురామపై వేటు వేయాల్సిందేనని ఒత్తిడి తేవడం.. ప్రత్యేక హోదాపై చర్చించాల్సిందేనని రాజ్యసభలో పట్టుబట్టడం.. పోలవరం నిధుల కోసం లోక్‌సభలో ప్రశ్నించడం.. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో వైసీపీ ఎంపీలు నిరసన తెలపడం వంటి చర్యలు అందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ సూటిగా.. సుత్తి లేకుండా నేరుగా మోదీ సర్కార్‌ను టార్గెట్ చేశారు విజయసాయి. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం మాట తప్పిందని ధ్వజమెత్తారు. ప్రస్తుత పెరిగిన ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనాలు రూ.55,657 కోట్లు అయితే ఎనిమిదేళ్లలో కేంద్రం ఇచ్చింది కేవలం రూ.11,182 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని.. మాట తప్పిందని షాకింగ్ ట్వీట్ చేయడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

- Advertisement -

Tags:Collision with Delhi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page