జాతీయ రాజకీయాల్లోకి మమత

0 12

న్యూఢిల్లీ ముచ్చట్లు:

జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలంటే ఒక మెట్టు దిగి రాకతప్పదని మమతా బెనర్జీ గ్రహించారు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తానే చొరవ చూపడం ప్రారంభించారు. తాజాగా అమరవీరుల ర్యాలీ పేరిట దీదీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రధానమైన విపక్ష పార్టీలన్నీ భాగస్వామ్యం వహించాయి. కాంగ్రెసు, సమాజ్ వాదీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జెడీ , డీఎంకే వంటి పార్టీల నాయకులు ఢిల్లీ నుంచి ఆన్ లైన్ లో పాల్గొన్నారు. పలుపార్టీల ఐక్య కూటమికి ఇదో ముందడుగు గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యునైటెడ్ ప్రంట్ ఏర్పాటుకు శరద్ పవార్ చొరవ తీసుకోవాలంటూ మమత అభ్యర్థించారు. భారతీయ జనతాపార్టీని గద్దె దించేందుకు సమయం ఆసన్నమైందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఉత్తరప్రదేశ్; బిహార్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, దక్షిణాది రాష్ట్రాలను ఆమె లక్ష్యంగా చేసుకుంటూ విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తాను అనుసంధాన పాత్రకు పరిమితం అవుతానని, నాయకత్వ బాధ్యత పెద్దలే స్వీకరించాలని పరోక్షంగా సూచించారు. ఇంతవరకూ ఆమె కూడా పోటీలో ఉంటారని అనుకున్నారు. కానీ ఒక అడుగు వెనక్కి తగ్గి, ముందుగా ఐక్య ప్ఱంట్ ను గెలిపించడం పైనే ఫోకస్ పెట్టాలని మమత బెనర్జీ నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతోందివిపక్షాలపై అనేక రకాల ఒత్తిడులు కొనసాగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫెగాసస్ వ్యవహారంతో ప్రతిపక్షాల్లో అభద్రత నెలకొంది. ప్రధానంగా రాజకీయ రహస్యాలు అందరికీ తెలిసినవే. ఈరోజుల్లో వాటికి సీక్రెసీ లేదు. అందువల్ల వాటి కంటే తమ ఆర్థిక, వ్యక్తిగత జీవితాలపై నిఘా పెడితే ప్రమాదమనే భయం నాయకులను వెంటాడుతోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఒక అనివార్యమైన ఐక్యత దిశలో నేతలు ఒక అవగాహనకు వచ్చేందుకు అవకాశం ఉంది. మమతా బెనర్జీ ఈవిషయంలో డేరింగ్ గా వ్యవహరిస్తున్నారు. ఆమెపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోవడం, ప్రజామద్దతు పుష్కలంగా ఉండటంతో కేంద్రాన్ని లెక్క చేయడం లేదు. మిగిలిన నాయకులకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అయినా బీజేపీ సారథ్యంలో కేంద్రం ఉంటే , తమకు క్షణక్షణం ఇబ్బందికరమేననేది అందరికీ అర్థమైంది. అందుకే మమత బెనర్జీ పిలుపు పట్ల సానుకూలత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అమరవీరుల దినోత్సవం పేరిట ఆమె నిర్వహించిన సమావేశంలో పెద్ద పార్టీల బాగస్వామ్యం మమత సక్సెస్ కు నిదర్శనం. ఇటీవల ఢిల్లీలో ప్రదానిని కలిసిన శరద్ పవార్ నే ఈ యుద్ధానికి నాయకత్వం వహించాలని కోరడంలోనే దీదీ తెలివితేటలు అర్థమవుతున్నాయి. ఫ్రంట్ కుంపటి నుంచి ఆయన జారిపోకుండా ముందరికాళ్లకు బంధం వేసేందుకే ఆమె ఈ ఆఫర్ ఇచ్చారు.ఊరందరి ధోరణికి తెలుగు రాష్ట్రాలు భిన్నం. ఇక్కడ అధికారంలో ఉన్న రెండు పార్టీలకు తగినంత బలం ఉంది.

జాతీయంగా ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు. ఈ ప్రాంతీయ పార్టీల బలం కేంద్రంలోని కూటములకు, ఇతరులకు అవసరం కావచ్చు. అందుకే కొన్నాళ్లుగా కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. జాతీయ స్థాయి ఫ్రంట్ కట్టి అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆ కూటమిని బలపరచ వచ్చని మమత బెనర్జీ విశ్వసిస్తున్నారు. అందుకే ఫ్రంట్ లో చేరవలసిందిగా టీఆర్ఎస్ ను కూడా ఆహ్వానించారు. దక్షిణభారత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం దీదీ తేల్చుకోలేకపోతున్నారు. తమిళనాడులో డీఎంకే ఎటూ కూటమిలో ఉంటుంది. కర్ణాటకలో జేడీఎస్, కేరళ లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కలిసి వస్తుంది. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇద్దరూ బీజేపీ పట్ల మెతక వైఖరిని అవలంబిస్తున్నారు. టీడీపీ ఎటువైపైనా మొగ్గు చూపేందుకు సిద్ధంగా ఉంది. కానీ ప్రస్తుతం బీజేపీతో విభేదాలు పెంచుకోదలచుకోలేదు. అందుకే మమత బెనర్జీ తో వ్యక్తిగత సంబంధాలున్నప్పటికీ దూరం పాటిస్తున్నారు. ఈ బలహీనతను దీదీ గమనించారు. పైపెచ్చు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు బలమెంతో వచ్చే ఎన్నికల వరకూ తెలిసే అవకాశం లేదు. మరోవైపు జగన్ కాంగ్రెసుతో కలిసి కూటమిలో ఉండే అవకాశం లేదు. ఈ కారణాల వల్లనే దీదీ ఏపీలో ఏ పార్టీకి కూడా ఫ్రంట్ లో చేరమని కోరడం లేదు.
ప్రతిపక్షాల ఐక్యత సాధించేందుకు అజెండా సిద్దంగా ఉంది. పార్లమెంటు సమావేశాల రీత్యా అన్ని పార్టీలు ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. అన్నిపార్టీలను ఒకే తాటిపైకి తేవడానికి ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా పార్లమెంటు సమావేశాల లో ఒకే అజెండాతో ప్రభుత్వంపై ధ్వజమెత్తడమే మొదటి అంశం కావచ్చు. ముఖ్యనేతలపై ఫెగాసస్ రహస్య నిఘా, వ్వవసాయ చట్టాలు, కరోనా పరిహారం వంటి విషయాలపై ఏకాభిప్రాయంతో పార్లమెంటును స్తంభింప చేయవచ్చని భావిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉమ్మడి రాజకీయ కార్యాచరణ కు దేశంలోని ప్రతిపక్షాలను కలిపే బాధ్యతను మమత స్వీకరించవచ్చని తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ తోనూ ఆమెకు మంచి సంబంధాలున్నాయి. అందువల్ల ఆయనను కీలక భాగస్వామిని చేయాలనేది దీదీ యోచన. ఆమె ప్రయత్నాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయి? బీజేపీ ఎటువంటి ప్రతి వ్యూహాలను రచిస్తుందనేది వేచి చూడాలి.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Mamata into national politics

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page