మరో బాలయ్యగా తమ్మినేని

0 10

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

 

 

నందమూరి బాలకృష్ణ ఎప్పుడేమి మాట్లాడి సొంత పార్టీకి ఇబ్బంది తెచ్చిపెడతారో ఎవరికి తెలియదు. బాలయ్య బామ్మర్ది, వియ్యంకుడు కావడంతో చంద్రబాబు ఆయన్ను ఏమి చేయలేని పరిస్థితి. ఆయన స్థానంలో ఎవరున్నా ఈపాటికి గట్టి చర్యలే ఉండేవి. ఇప్పుడు అధికార వైసిపి లో సైతం ఇలాంటి కామెంట్స్ తో ఒక్కసారిగా చర్చల్లో నిలుస్తూ ఉంటున్నారు ఎపి స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆయన చేసే వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటాయి. తాజాగా స్పీకర్ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.ఏపీ స్పీకర్ తమ్మినేని మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి భూమ్మీద బతికే హక్కులేదన్నారు. అంతవరకు బాగానే ఉంది. దేశంలో జరుగుతున్న అత్యాచార సంఘటనలు చూస్తే ప్రతి ఒక్కరికి మనసులో ఉండే భావనే అది. అయితే అవసరం అయితే ఇలాంటి వారిని చట్టాలకు అతీతంగా అయినా పైకి పంపించేయాలనడమే వ్యవస్థలపై ఆయనకున్న నమ్మకాన్ని తెలియచేస్తుందన్న విమర్శలు వినవస్తున్నాయి.

- Advertisement -

వాస్తవానికి ప్రపంచంలో నేరస్థులకు శిక్షలు వేసే నాలుగు విధానాల్లో మనది పరివర్తన సిద్ధాంతం. తప్పు చేసిన వారిలో పశ్చాత్తాపం ఏర్పడి జీవితంలో వారు మరోసారి తప్పు చేయకుండా అనుసరించే విధానం ఐపిసి సూచిస్తుంది. తీవ్ర నేరాల్లో అవసరమైతే ఉరి శిక్షను కూడా న్యాయస్థానాలు విధిస్తున్నాయి. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా చట్టసభ కు అధిపతిగా ఉన్న తమ్మినేని సీతారాం ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో ప్రజల్లో ఎలాంటి సందేశం అందిస్తాయన్నది విద్యావంతుల ప్రశ్న.నిజానికి బూజుపట్టిన విధానాలను వదిలించుకుని దేశ న్యాయ, పోలీస్ వ్యవస్థలను బలోపేతం చేయాలిసిన బాధ్యత శాసన వ్యవస్థదే. అయితే దురదృష్టం కొద్దీ చట్టసభలు తాము చేసే చట్టాల్లో లోపాలు నేరస్థులకు అవకాశంగా మారుస్తున్నాయి. ఫలితంగా సులువుగా డబ్బున్న నేరగాళ్ళు దశాబ్దాలపాటు కింది కోర్ట్ నుంచి సుప్రీం కోర్టు వరకు కేసులు సాగదీస్తూ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేని పరిస్థితి కల్పిస్తున్నారు. దీనికి ముఖ్యంగా అన్ని పార్టీలు బాధ్యులే. ప్రతీ విషయంలో రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయి. నేరస్థులను కాపాడేందుకు కొందరు నేతలే ముందుంటున్నారు. ఇలాంటి స్థితి తప్పాలంటే వ్యవస్థల ప్రక్షాళన ఒక్కటే మార్గం. సగటు జీవికి చట్టం పట్ల భయం, భక్తి వచ్చేలా అన్ని వ్యవస్థలు ముందుకు వెళ్ళలిసి ఉంది. ఇందులో ముందుగా ఆదర్శంగా ఉండాలిసింది మాత్రం రాజకీయా నాయకులే. వారిపట్ల కూడా చట్టం ఒకేలా వ్యవహరిస్తుందనే నమ్మకం ప్రజల్లో కలిగిన నాడు వ్యవస్థల పట్ల గౌరవం ఇనుమడిస్తుంది. లేకపోతే తమ్మినేని సీతారాం వంటి వారు చేసే వ్యాఖ్యలు సంచలనం కోసమే తప్ప చిత్తశుద్ధి లేని వ్యాఖ్యలు గానే మిగిలిపోతాయి.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Tammineni as another child

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page