వరుస తప్పిదాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు

0 13

విజయవాడ  ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్తానమైన హైకోర్టుకు , రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనేక అంశాల్లో నిరంతరం వాద,ప్తతివాదనలు సాగుతూనే ఉన్నాయి. అనేక సందర్బాల్లో హైకోర్టు తీర్పులతో విభేదిస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెడుతోంది. తుదివరకూ తన పంతం నెగ్గించుకునేందుకు పోరాడుతోంది. అనేక సందర్బాల్లో సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పులనే సమర్థిస్తోంది. కొన్నిసార్లు హైకోర్టులోనే తేల్చుకోమని చెబుతోంది. అధికారులు సైతం హైకోర్టు తీర్పులను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అనేక ఉదంతాలు తేటతెల్లం చేస్తున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను వెంటనే అమల్లోకి తేకుండా సాధ్యమైనంతవరకూ సాగదీస్తున్నారు. అనేక మార్లు చెప్పించుకున్న తర్వాతనే వాటిపై స్పందిస్తున్నారు. బాధితులు కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత తాపీగా కోర్టుకు హాజరై క్షమాపణలు చెబుతున్నారు. ప్రభుత్వం తాను న్యాయస్థానంతో విభేదిస్తున్న అంశం ప్రజల దృష్టిలో పడేందుకు ఇలా జాగు చేస్తోందనే వాదన ఉంది. తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాల్సిన అవసరాన్ని కల్పిస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారులకు సంబంధించి సర్కారుకు ఉపయోగపడే సలహానే న్యాయస్థానం అందచేసింది. ఇంతమంది సలహాదారులు అవసరమా? అని ప్రశ్నించింది. ఈ పరిశీలనకు తగినంత ప్రాతిపదిక ఉందనే చెప్పాలి.ఆంధ్రప్రదేశ్ వంటి 13 జిల్లాలతో కూడిన ఓ మోస్తరు రాష్ట్రానికి దేశంలో కేంద్రం సహా ఏ ప్రభుత్వానికి లేనంతమంది సలహాదారులున్నారు. వారికి కేబినెట్ మంత్రితో సమానమైన జీతభత్యాలు, సౌకర్యాలు అందుతున్నాయి. వారు అందచేస్తున్న సేవలేమిటనే దానిపై సమాచారం దొరకడం లేదు.. రాజకీయంగా అవసరమైన వారు, గతంలో ప్రభుత్వంలో పనిచేసి ప్రస్తుతం ఉపయోగపడతారనుకున్నవారందరికీ సలహాదారులనే ముద్ర వేసేశారు. ఏపీలో 40 మంది వరకూ సలహాదారులున్నారు.

 

- Advertisement -

మంత్రుల సంఖ్యపై నిర్దిష్టమైన పరిమితి ఉంది. కానీ వీరి విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. అందుకే కావాల్సిన వ్యక్తులను సులభంగా దగ్గరకు చేర్చుకోవడానికి ఈ వెసులుబాటును వినియోగించుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే అనేక రకాల విమర్శలు ఉన్నాయి. నిజంగా పనిచేసేవారికి పదవులు ఇస్తే తప్పులేదు. కానీ అడిగినవారందరికీ అదే హోదా కల్పించడమే అభ్యంతరకరమవుతోంది. ఒక్కో సలహాదారుపై నెలసరి 12 లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతోందని అంచనా. వారి వేతనం, వారికింద పనిచేసే సిబ్బంది జీతాలు, వాహన సదుపాయం, వసతి వంటి వాటికి భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇంతపెద్ద మొత్తంలో వెచ్చించినా , వారి నుంచి తగిన స్థాయిలో సేవలను సర్కారు పొందలేకపోతోంది.సలహాదారుల్లో చాలామందికి తగినంత పని లేదనేది ఉన్నతాధికారుల అభిప్రాయం. సలహాదారులు ఎవరి కిందా పనిచేయరు. సంబంధిత మంత్రులకు సైతం జవాబుదారీ కాదు. ఈ కారణంగానే వారి పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సంబంధిత శాఖల కార్యదర్శులకు ఎటువంటి సమాచారం ఉండటం లేదు. నేరుగా ముఖ్యమంత్రి వీరిని డీల్ చేయాల్సి ఉంటుంది. ప్రజా వ్యవహారాల సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి కి మాత్రమే వివిధ శాఖలపై అధ్యయనం, సలహాల వంటి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మిగిలిన వారు నామ్ కే వాస్తేగానే ఉంటున్నారు. సజ్జల సైతం పార్టీకి ప్రదాన కార్యదర్శి హోదాలో ఉండటంతో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు రాజకీయ కోణంలో సమాధానం చెప్పడానికే సమయం వెచ్చిస్తున్నారు.వీరందరి సేవలను వినియోగించుకునేందుకు , దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రికి వెసులుబాటు ఉండటం లేదు. కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అయినా ఆ బాధ్యత అప్పగించి ఉంటే బాగుండేది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అయిదు కోట్ల రూపాయల వరకూ వ్రుథా వ్యయం అవసరమా? అన్నది ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. గతంలో సలహాదారుగా నియమితులైన సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి పనిలేదనే కారణంతో పదవి నుంచి వైదొలిగిపోయారు.

 

సలహాదారుల పరిస్థితికి అదొక నిదర్శనం.హైకోర్టుల్లో కేసులు నడుస్తున్న సందర్భంలో న్యాయమూర్తుల ఉద్దేశం వారి వ్యాఖ్యల ద్వారా ముందుగానే కొంతవరకూ అర్థమవుతుంది. కేసు తీవ్రతను, పూర్వాపరాలను విచారణ సందర్భంగా గమనించి వారు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒక తీర్పు వచ్చిన తర్వాత అది చట్టంతో సమానం. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచరణలో పెట్టాల్సిందే. లేదంటే అప్పీలుకు పోవాలి. రెండింటిలో ఏదో ఒకటి చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబందిత కార్యదర్శులు బాధ్యులవుతారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన కేసుల్లో ప్రతికూల తీర్పులు వస్తే అధికారులు అమలు చేయకుండా నాన్చుతున్నారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న కేసుల్లో ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి అనుమతులు రావడం లేదని చెబుతున్నారు. దాంతో ఉన్నతాధికారులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇలా నెలల తరబడి గడచి పోవడంతో ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు వందల కేసులు ప్రభుత్వాధికారులపై దాఖలయ్యాయి. ఇది కచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామమే. సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం అధికారుల కెరియర్ పై మచ్చ పడే అవకాశం ఉంది. అధికారులు ఇబ్బందులు పడకుండా సత్వర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ నాయకులకు కేసులు కొత్త కాదు. కానీ ప్రభుత్వాధికారులు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి న్యాయస్తానాలలో ధిక్కరణ కేసులు ఆటంకంగా పరిణమిస్తాయి.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:When is the full stop for a series of mistakes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page