వలస నేతలకు కష్టకాలం

0 12

హైదరాబాద్  ముచ్చట్లు :
ఇతర పార్టీల నుంచి ఎవరైనా వలస వస్తే.. వారి స్థాయిని భట్టి గౌరవం ఇస్తాయి చేర్చుకున్న పార్టీలు. అక్కడ మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తారు నాయకులు. కానీ.. తెలంగాణ బీజేపీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులకు సీన్‌ రివర్స్‌లో ఉందట. మెడలో కండువా తప్ప చేతుల్లో పార్టీ పదవి ఒక్కటీ లేదు. బీజేపీ నుంచి ఒక్కో వికెట్‌ పడిపోతున్న సమయంలో వలస నేతలపట్ల కాషాయ శిబిరం ఆలోచన శ్రేణులను కలవర పెడుతోందట.ఇతర పార్టీల నుంచి వచ్చి కమలం తీర్థం పుచ్చుకున్న మాజీ ప్రజాప్రతినిధుల సంఖ్య తెలంగాణ బీజేపీలో చాంతాడంత ఉంది. వీరిలో కొందరు ఆయా పార్టీలలో ఒక వెలుగు వెలిగిన వారే. బీజేపీ మీటింగ్‌కు వస్తే మాత్రం నలుగురిలో నారాయణలా ఉండాల్సిందే. చేతిలో ఒక్క పదవీ లేకపోవడంతో స్టేజ్‌ కింద కూర్చోవాల్సి వస్తోంది. వేదికపైకి పిలుపు లేదు. దీంతో ఇబ్బందిగా ఫీలవుతున్నారట నాయకులు.తెలంగాణలో గత రెండు మూడేళ్లుగా ఇతర పార్టీల నుండి చేరికలు భారీగానే జరిగాయి. అందులో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంకొందరు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్న ముఖ్య నాయకులు.

 

రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో వారంతా కాషాయ గూటికి చేరుకున్నారు. ఇలా వచ్చిన వారికి బీజేపీ సిస్టమ్‌ మింగుడు పడటం లేదని సమాచారం. బీజేపీలో జంబో కార్యవర్గాలు ఉండవు. ఏదైనా పార్టీ మీటింగ్ జరిగితే కీలక బాధ్యతల్లో ఉన్నవారికి మాత్రమే వేదికపై కుర్చీలు వేస్తారు. దీంతో పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేకుండా సమావేశాలకు వస్తోన్న మాజీ మంత్రులకు సైతం వేదిక కింద కుర్చీలు వేస్తున్నారు. పైగా ఇది పార్టీ ప్రోటోకాల్‌గా చెప్పడం వారు జీర్ణించుకోలేకపోతున్నారట.సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే కొంతమంది వలస నాయకులు బీజేపీ సమావేశాలకు, పార్టీ ఆఫీస్‌ బేరర్స్‌ మీటింగ్‌కు దూరంగా ఉంటున్నారట. తాము గతంలో ఉన్న పార్టీలో ఎంతో విలువ ఉండేదని.. బీజేపీలో స్టేజ్‌ కింద కూర్చోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారట. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేసిన సందర్భంగా ఈ విషయంపై కాషాయ శిబిరంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. తనకు కనీసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా పదవీ ఇవ్వలేదన్నది మోత్కుపల్లి విమర్శ. పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టాలన్నా అనుమతి కావాలి. ఇది పార్టీ రూల్. దీంతో బీజేపీలోకి వచ్చిన కొత్త కాపుల్లో అసహనం వ్యక్తం అవుతోందని సమాచారం. ఒకరిద్దరు నేతలు ఈ అంశంపై ఓపెన్‌ కామెంట్స్‌ కూడా చేశారు.పదవులు లేకుండా తాము ఎలా పని చేస్తామని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. పదవులు లేకపోతే తమ మాట ఎవరు లెక్క పెడతారని నిలదీస్తున్నారట. పైగా పార్టీలో తామేం చేయాలో క్లారిటీ లేకపోతే ఎలా అన్నది వారి భావన. గతంలో చట్టసభల్లో పనిచేసిన దాదాపు 30 మంది నాయకులు వరకు ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఉన్నారు. వీరిలో కొందరికే పార్టీ పదవులు దక్కాయి. డీకే అరుణ, పొంగులేటి లాంటి వారికి జాతీయ స్థాయిలో బాధ్యతలు ఇచ్చారు. మాజీ మంత్రి విజయరామారావుకు రాష్ట్రస్థాయిలో పదవి ఉంది. మాజీ ఎమ్మెల్యేలు అరుణ తార, కొండేటి శ్రీధర్ , సోమారపు సత్యనారాయణలు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నారు.విజయశాంతితో సహా చాలామందికి బీజేపీలో ఎలాంటి బాధ్యతలు లేవు. ఇలాంటి వారిని కోర్ కమిటీ సభ్యులని చెబుతున్నా.. వాస్తవానికి కోర్ కమిటీ లేదు. బీజేపీకి నేతలు గుడ్‌బై చెప్పడం మొదలైన ఈ సమయంలో ఈ అంశంపై పార్టీ పెద్దలు సీరియస్‌గా దృష్టి పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Hard times for immigrant leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page