హూజూరాబాద్ కోసం పాట్లు

0 9

కరీంనగర్  ముచ్చట్లు :
రానున్న ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ గెలిచేందుకు అధికార తెలంగాణ రాష్టసమితి తలకు మించిన భారాన్ని మోసేందుకు సిద్దమవుతోంది. ఉప ఎన్నికల పుణ్యమా? అని దళిత బంధు పథకం హోరెత్తుతోంది. ఈ పథకం దీర్ఘకాలంలో రాస్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సి ఉంటుంది. ముందుగా హుజూరాబాద్ ను ఒక నమూనాగా భారీ ఎత్తున అమలు చేయాలనుకుంటున్నారు. అయితే పక్కగా రాజకీయ ఉద్దేశంతో , ఓట్లను బారీగా పొందేందుకే ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నారు. స్థానికంగా ఉన్న ఓట్ల సమీకరణలను బట్టి ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఏది ఏమైనా ఒకే ఒక ఉప ఎన్నిక కోసం ఇంత పెద్ద భారాన్ని తలకి ఎత్తుకోవడమేమిటనే సందేహం తలెత్తుతుంది. రెండేళ్లలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల నాటికి ఈ పథకాన్ని తురుపు ముక్కగా వాడుకునేందుకు కేసీఆర్ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.హుజూరాబాద్ లో రెండు లక్షల 26 వేల మంది ఓటర్లున్నారు. అందులో అత్యధికంగా 45 వేల ఓట్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి. నియోజకవర్గంలో గెలుపోటములను శాసించగల స్థాయిలో వారి సంఖ్య ఉంది. ఈటల రాజేందర్ కు నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో పాటు వెనకబడిన తరగతుల నాయకునిగానూ గుర్తింపు ఉంది. దీనికి కౌంటర్ చెక్ పెట్టాలంటే దళిత వర్గాన్ని అక్కున చేర్చుకోవాలని టీఆర్ఎస్ ఎత్తుగడ. అదే సమయంలో బీసీ సామాజిక వర్గంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో పద్మశాలులు అధిక సంఖ్యలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పద్మశాలి ఓట్ల సంఖ్య 26 వేల వరకూ ఉంటుంది. అందుకే టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన ఎల్. రమణను అర్జెంటుగా పార్టీలో చేర్చుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లను భారీగా టీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చేందుకు ఆయనను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు సైతం 26 వేల వరకూ ఉన్నాయి. అయితే బీజేపీ ఈ వర్గం ఓట్లను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందువల్ల ఇతర మైనారిటీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లను లక్ష్యంగా రాష్ట్ర స్థాయి నాయకులను రంగంలోకి దింపేందుకు టీఆర్ఎస్ భారీ ప్రచార కార్యక్రమానికి ప్లాన్ చేస్తోంది. కాంగ్రెసు నుంచి కౌశిక్ రెడ్డిని చేర్చుకోవడంలోనూ ఇదే మంత్రాంగం ఇమిడి ఉంది. మొత్తమ్మీద హుజూరాబాద్ కుల సమీకరణల సంకుల సమరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.దళిత బంధు పథకం పై టీఆర్ఎస్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఓ మోస్తరు ఉపాధికల్పన కార్యక్రమాలు చేపట్టే ఎస్సీ కుటుంబాలకు పదిలక్షల రూపాయల వరకూ ఈ పథకం కింద సాయం చేయాలి.

 

- Advertisement -

ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మందికి అర్హత ఉంటుంది. అందరికీ సాయం చేయడం సాధ్యం కాదు. నియోజకవర్గానికి వంద కుటుంబాలకు ఇవ్వాలని అంచనా వేస్తున్నారు. ఇది తీవ్రమైన అసంతృప్తికి దారి తీసే అవకాశం ఉంది. దీనివల్ల అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. కానీ వాటన్నిటినీ అధికార పార్టీ ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోవడం లేదు. పార్టీ దృష్టి అంతా హుజూరాబాద్ పైనే ఉంది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 2 వేల కోట్ల రూపాయల వరకూ వెచ్చించాలని నిర్ణయించింది. ఇది మిగిలిన నియోజకవర్గాల్లోని ఎస్సీలపై ప్రభావం చూపించవచ్చు. కానీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈటల సవాల్ ను చిత్తు చేయడమే ప్రదాన లక్ష్యం . ప్రస్తుతానికి గట్టెక్కడానికి అధికార పార్టీ ఈ ఎత్తుగడను ఎంచుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీసీలు, మైనారిటీ వర్గాలకు కూడా ప్రత్యేక సాయానికి పథకాలు రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవైపు హుజూరాబాద్ లో దళిత బంధు పథకం పై టీఆర్ఎస్ వర్గాల్లో హర్సాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు విపక్ష నేతలు మాత్రం అనుమానాస్పదంగానే చూస్తున్నారు. గతంలో ఎస్సీలకు మూడెకరాల భూమి అంటూ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారు. అలాగే అత్యున్నత స్థాయి పదవులు ద్వారా రాజ్యాంగ అధికారంలో కూర్చోబెడతామన్న హామీలు గాలికిపోయాయి. ఈ స్థితిలో దళిత బంధు సైతం మొక్కుబడిగా మిగిలిపోతుందనే అనుమానాలున్నాయి. ఇంకోవైపు రాష్ట ప్రభుత్వం కొత్త పధకాల హడావిడి పెరిగిపోతోంది. పాత వాటిని పక్కనపెట్టేసింది. లక్స రూపాయల రైతు రుణమాపీ హామీ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. రెండు పడకల ఇళ్ల పథకమూ పడకేసింది. ఇంటింటికీ నల్లా స్కీమ్ కూడా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. అందువల్ల ఎన్నికల సందర్బంలో ఇచ్చే హామీలలోని విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది. ఏదేమైనా దీర్ఘకాలిక అభివృద్ధి, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వనరుల కేటాయింపు లేకుండా ఎన్నికల కోసం స్కీములు ప్రకటించడం ఆర్థిక వ్యవస్తపై పెనుభారమే. తెలంగాణకు ఎంతో పెద్ద ఎత్తున ఆధాయం వస్తున్నప్పటికీ అలవిగాని స్కీముల వల్ల ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి..

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Songs for Huzurabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page