సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్న చిన్నారులు

0 4

హైదరాబాద్   ముచ్చట్లు:
కరోనా వైరస్‌ పుణ్యమా అని చిన్నారులు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్య చిన్నారుల జీవితాల్లోకి ప్రవేశించింది. దీంతో వారి జీవితం కాస్త గ్యాడ్జెట్స్‌తో పెనవేసుకుపోయింది. వీటితో ఉపయోగం ఉన్నప్పటికీ, పిల్లల సమయం అంతా దుర్వినియోగమయ్యే అవకాశాలే అధికంగా కన్పిస్తున్నాయి. ఆటలు, పాటలు, చదువులు అన్నీ గ్యాడ్జెట్స్‌లో సాగడంతో పిల్లలు రోజులో ముప్పావు భాగం వాటితోనే సహ జీవనం చేస్తున్నారు.వినోదం అందిస్తూ, అవసరాలు తీరిస్తే ఫరవాలేదు. కాని, వయసుకు తగని అక్కౌంట్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తెరుచుకుంటూ చిన్నారులు జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారు. వయసుకు తగని విధంగా పిల్లలు ఇతరత్రా మార్గాలకు బానిసలవుతున్నారు. అవసరం లేని, భిన్నమైన మార్గాలకు అలవాటుపడే ప్రమాదకర అవకాశాలు అధికంగా ఉన్నాయని, వాటి వినియోగం తగ్గించుకుని, వాటి పట్ల ముందస్తుగా భద్రత వహిస్తే మంచిదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆరోగ్య భద్రతా నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్య వచ్చి చిన్నారులను స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లతో కట్టిపడేసింది. అంతా ఆన్‌లైన్‌ వ్యవహారాలు నడుస్తున్న తరుణంలో పిల్లలు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు బానిసలవుతున్నారు. సులభంగా అకౌంట్స్‌ తెరుచుకునే సోషల్‌ మీడియాకు పిల్లలు బందీలవుతున్నారు. విభిన్న రకాల యాప్‌లలో ఖాతాలు తెరిచి.. బిజీగా గడుపుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తే చాలు అందులోనే సమయం తెలియకుండా తలమునకలవుతున్నారు.పేరుకు ఆన్‌లైన్‌ చదువుల కోసం మొబైల్‌ వాడకం. కాని, వారు అత్యంత ఆసక్తిగా ఆపరేట్‌ చేసేది మాత్రం ఇతర యాప్‌ల వినియోగం. చదువు తక్కువ చాటింగ్‌ ఎక్కువగా విద్యార్థులు రాంగ్‌ రూట్‌లో నడుస్తున్నారు.

 

దేశ వ్యాప్తంగా 59.2 శాతం మంది పిల్లలు మొబైల్‌ వినియోగించేది ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ అప్లికేషన్స్‌ను వాడటం కోసమే. ఈ ఆసక్తికర విషయాలను ఎన్‌సీపీసీఆర్‌ (నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌) ఎఫెక్ట్స్‌ (పీజికల్‌ బిహేవియర్‌ అండ్‌ సైకో-సోషల్‌) పేరుతో అధ్యయనం జరిపింది.దేశ వ్యాప్తంగా జరిగిన ఈ స్టడీలో ఎనిమిది నుంచి 18 ఏండ్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాలను సేకరించింది. అందులో కేవలం 10.1 శాతం మంది పిల్లలు మాత్రమే ఆన్‌లైన్‌ క్లాసులకు మొబైల్‌ వాడటాన్ని ఇష్టపడుతున్నారని పేర్కొంది. 30.2 శాతం మంది స్టూడెంట్స్‌ సొంత ఫోన్లను కలిగి ఉన్నారని స్పష్టం చేసింది. అంతేకాదు పదేళ్లు ఉన్న 37.8 శాతం మంది పిల్ల్లలకు కూడా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ఉన్నాయని వివరించింది. అదే వయస్సు గల 24.3 శాతం మంది పిల్లలకు ఇన్‌స్టా అకౌంట్స్‌ ఉన్నాయని పేర్కొంది.ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై, రాంచి, గౌహతి నగరాలకు చెందిన 5,811 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో 3,491 మంది విద్యార్థులు(ఎనిమిది నుంచి 18 ఏండ్లు). 1,534 మంది పేరేంట్స్‌, ఆరు రాష్ట్రాలకు చెందిన 60 స్కూళ్ల నుంచి 786 మంది టీచర్లు ఉన్నారు. ఇందులో తొమ్మిది నుంచి 17 ఏండ్లలోపు పిల్లలను ఎంపిక చేసుకున్నారు. స్మార్ట్‌ ఫోన్ల వాడకం, సోషల్‌ మీడియా అకౌంట్స్‌, కరోనా పరిస్థితులతో వచ్చిన మార్పులు, ఆన్‌లైన్‌ స్టడీ తదితర అంశాలపై విద్యార్థులను, పేరెంట్స్‌ను, టీచర్లను అడిగి వారి సమాధానాలను ఎన్‌సీపీసీఆర్‌ నిక్షిప్తం చేసి అధ్యయనంలో వెల్లడించింది.చిన్నారులు స్మార్ట్‌ ఫోన్లు అధికంగా వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎన్‌సీపీసీఆర్‌ హెచ్చరించింది. భౌతికంగా, మానసికంగా, సామాజికంగా పిల్లల్లో ప్రధానంగా సమస్యలు వస్తాయి. స్మార్ట్‌ ఫోన్ల తెరల నుంచి వెలువడే కిరణాలతో కంటి చూపు లోపం తదితర అనారోగ్య సమస్యలు ఉద్భవిస్తాయి. నిద్రలేమి, ఒత్తిడి, కుంగుబాటు, అలసట తదితర సమస్యలు వస్తాయి. 23.80 శాతం మంది పిల్లలు నిద్రకు ఉపక్రమించే వరకు స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారని, సర్వే తేల్చడం వారు ఎంతగా అడిక్ట్‌ అయ్యారో సూచిస్తుంది.అయితే, సోషల్‌ మీడియాలో పిల్లలకు ఉపయోగపడే కంటెంట్‌ చాలా అరుదుగా ఉండొచ్చు. అత్యధికంగా వారికి ఉపయోగపడని కంటెంట్‌ ఎక్కువగా తారసపడుతుంది. హింస, సూసైడ్‌, జుగుప్సాకరమైన ఘర్షణలు, అత్యాచారాలు, దుర్మార్గపు పోకడలతో కూడిన వీడియోలు, ఫొటోలు, తదితర విషయాలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. ఆ కంటెంట్‌తో పిల్లలు తప్పుడు నిర్ణయాలు, హింసాత్మక మార్గంలో నడిచే ప్రమాదం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Children becoming addicted to social media

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page