1000 కు పెరగనున్న లోకసభ స్థానాలు..?

0 25

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
భారత పార్లమెంటులోలోక్‌సభ సభ్యుల సంఖ్య భారీగా పెరగనుందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. భవిష్యత్తు అవసరాలను తీర్చేలా భారీ సామర్థ్యంతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. లోక్‌సభ‌లో సభ్యుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ చేసిన ట్వీట్లు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా పార్లమెంట్‌లో లోక్‌సభలో స్థానాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్య 545. ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ నామినేటెడ్ సభ్యులను తీసేస్తే 543 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే లోక్‌సభ స్థానాలను వెయ్యికి పెంచాల్సిన అవసరముందని మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ కూడా గతంలో వ్యాఖ్యానించారు. లోక్‌సభతో పాటు రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలని అభిప్రాయపడ్డారు.రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత పార్లమెంట్ స్థానాల సంఖ్య కచ్చితంగా పెంచాల్సి ఉంది. అయితే ఆ స్థానాలను 2021 జనాభా లెక్కల ప్రకారం పెంచాలన్న నిబంధనతో ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తీవ్రమైన అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించి, అభివృద్ధిలో దూసుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గించి శిక్ష విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తన ట్వీట్‌లో ఇదే విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభలో ప్రస్తుతమున్న 543 స్థానాల్ని వెయ్యికి పెంచే ఆలోచనలో మోదీ ప్రభుత్వం ఉందని ట్వీట్ చేశారు. తన సహచర బీజేపీ ఎంపీల ద్వారా ఈ సమాచారం తెలిసినట్టు పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ ఛాంబర్‌ని కూడా 1,000 మంది కూర్చునే సామర్ధ్యంతో నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే పార్లమెంట్ స్థానాల్ని పెంచే ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని తన ట్వీట్లలో పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య, రాష్ట్రాల వారీగా నిష్పత్తి ప్రకారం లెక్కగడితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 25 సీట్లు 52కి పెరుగుతాయి. అలాగే తెలంగాణలో 17 నుంచి 39కి చేరతాయి. మొత్తం సీట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.6% నుంచి 4.3%కి పడిపోగా, తెలంగాణలో 3.1% నుంచి 3.3%కు పెరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రా నుంచి హైదరాబాద్ నగరానికి పెరిగిన వలసలే ఈ మార్పునకు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 80 నుంచి 193కు పెరిగే అవకాశముంది. అంతే ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 14.7% నుంచి 16%కు పెరగనుంది. మరోవైపు తమిళనాడు ప్రాతినిధ్యం 7.2 శాతం నుంచి 6.4 శాతానికి, కేరళ ప్రాతినిధ్యం 3.7 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోతుంది. దీని ప్రకారం చూస్తుంటే జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి, అధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం మరింత పెరగనుంది.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Lok Sabha seats to increase to 1000 ..?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page