ఇది ఆంజనేయ స్వామి సంకల్పం -టీటీడీ అదనపు ఈవో  ఏవి ధర్మారెడ్డి

0 26

తిరుపతి  ముచ్చట్లు:
– అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం కాగానే ఆంజనేయ స్వామి మాతో ఈ పని ప్రారంభింప చేశారు.
– వెబినార్ లో దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రముఖ పండితులు పాల్గొన్నారు
– మాకు మరిన్ని ఆధారాలు ఇచ్చారు
– త్వరలోనే ఒక గ్రంథం ముద్రిస్తాం

 

అయోధ్యలో రామమందిర వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. 2020 ఆగస్టు 5వ తేదీ రామమందిర నిర్మాణానికి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శంఖుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణం ప్రారంభమయ్యాక ఆంజనేయుని జన్మస్థలం తిరుమల అంజనాద్రి అని ప్రకటించే పని టీటీడీ ప్రారంభించింది. ఇది ముమ్మాటికి ఆంజనేయ స్వామివారి ప్రేరణతోనే జరిగిందని నమ్ముతున్నానని టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి చెప్పారు.ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై రెండురోజులు నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ శనివారం సాయంత్రం ముగిసింది. వెబినార్ లోని అంశాలను వివరించడానికి జాతీయ సంసృత విశ్వవిద్యాలయంలో శ్రీ ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీరాముని జన్మస్థలం వివాదం పరిష్కారమైనందువల్ల ఆంజనేయ స్వామి జన్మస్థలం మీద పరిశోధన చేయించాలని ఈవో డాక్టర్ జవహర్ రెడ్డికి అనేక మెయిల్స్, మెసేజ్ లు వచ్చాయన్నారు. దీంతో పలువురు ప్రముఖ పండితులతో పరిషత్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

 

- Advertisement -

ఈ పరిషత్ పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు ఆధారాలను పరిశోధించి అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలం అని నిర్ధారించిందన్నారు.అంజనాద్రి లో ఆంజనేయుడు జన్మించిన చోట 2016 లోనే టీటీడీ గుడి కట్టిందన్నారు.వందల సంవత్సరాల నుంచే అక్కడ బాలాంజనేయ స్వామి వారి విగ్రహం ఉందన్నారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, సుందరకాండ పారాయణం ప్రారంభించడం, 18 గంటల పాటు నిర్విరామంగా సుదరకాండ లోని 2800 కు పైగా శ్లోకాలను పారాయణం చేయడం ఆంజనేయ స్వామి వారి అభీష్టమేనని శ్రీ ధర్మారెడ్డి వివరించారు. అష్టాదశ పురాణాల్లో 12 పురాణాల్లో తిరుమల అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలం అని ఉందన్నారు. వెంకటాచలం మహాత్యం లో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందని, ఈ పుస్తకాన్ని టీటీడీ, మంత్రాలయం పీఠం, శ్రీ చిన్న జీయర్ పీఠం ముద్రించాయన్నారు.

 

ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి నిరాకరించడం తప్పు అని ఆయన తెలిపారు. రెండు రోజుల వెబినార్ లో అనేకమంది పీఠాధిపతులు, స్వామీజీలు, పురాణ, ఇతిహాసాలను అవపోసన పట్టిన నిపుణులు పాల్గొన్నారన్నారు. ఆంజనేయుడు తిరుమల అంజనాద్రిలోనే జన్మించారనే విషయం నిర్ధారించడానికి టీటీడీకి మరిన్ని పురాణ, భౌగోళిక ఆధారాలను ఇచ్చారన్నారు. ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రి అని ఆధారాలతో త్వరలో ఒక గ్రంథం ముద్రించనున్నామన్నారు. పండిత పరిషత్ నిర్ధారించిన అంశాలు, ఆధారాలతో పాటు వెబినార్ ద్వారా లభించిన మరిన్ని ఆధారాలతో ఈ గ్రంథం ముద్రిస్తామని శ్రీ ధర్మారెడ్డి చెప్పారు. ఆంజనేయుని జన్మస్థలం తిరుమల అంజనాద్రి అని టీటీడీ నిరూపించిందన్నారు.ఇంకా ఎవరి వద్ద అయినా కాదనే బలమైన ఆధారాలుంటే ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో వాదనలు, దూషణలు టీటీడీ కోరుకోవడం లేదన్నారు.ఆంజనేయుడు జన్మించిన స్థలం లోని ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులు దర్శించుకునే సదుపాయాలు కల్పిస్తామని అదనపు ఈవో తెలిపారు.జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధర శర్మ, ఆచార్య రాణి సదా శివమూర్తి, డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:This is Anjaneya Swamy Sankalpam -TTD Additional Evo Avie Dharmareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page