సీపీ బదిలీ వెనుక ఏం జరిగింది..

0 25

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

ఉపఎన్నిక.. అక్కడి ఉమ్మడి జిల్లాలోని అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోందా? కలెక్టర్‌ నుంచి సీపీ వరకు ఆకస్మిక బదిలీల వెనక కారణాలు అవేనా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తెలంగాణలో హుజురాబాద్‌ ఉపఎన్నిక రాజకీయపార్టీల్లో సెగలు రేపుతుంటే.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రభుత్వ అధికారుల కుర్చీలు కదిలిస్తోంది. కలెక్టర్లు.. ఐపీఎస్‌లను ఉన్నపళంగా బదిలీ చేస్తున్నారు. కర్క్‌ నుంచి కలెక్టర్‌ వరకు.. హోంగార్డు నుంచి సీపీ వరకు ఇంకెన్నో ట్రాన్స్‌ఫర్లు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. బదిలీలకు కారణాలేవైనా.. అన్నీ హుజురాబాద్‌ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక బదిలీపై చర్చ జరుగుతున్న సమయంలోనే కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు. కరీంనగర్‌ను పోలీస్‌ కమిషనరేట్‌గా మార్చినప్పటి నుంచీ కమలాసన్‌రెడ్డే సీపీగా ఉన్నారు. చూస్తుండగానే ఐదేళ్లు పూర్తయింది. తనను బదిలీ చేయాలని రెండేళ్లుగా ప్రభుత్వాన్ని, డీజీపీని ఆయన కోరుతున్నారట. ఎందుకో ఆయన సీటు కదలలేదు. ఇప్పుడు సడెన్‌గా బదిలీ చేయడం ఒక ఎత్తు అయితే.. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయమడం ఆశ్చర్య పరుస్తుంది. గతంలో ఇలాంటి సందర్భాలు.. ఉదంతాలు అరుదుగా చెబుతున్నాయి ఖాకీ వర్గాలు.

 

 

 

 

- Advertisement -

పోలీస్‌ శాఖలో కిందిస్థాయిలో ఎస్‌ఐ, సీఐలను ఎస్పీ, డీఐజీ ఆఫీస్‌లకు అటాచ్‌ చేస్తేనే ఏదోలా చూస్తారు. అలాంటిది ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని ఈ విధంగా డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయమనడం చర్చగా మారింది.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌తో సీపీ కమలాసన్‌రెడ్డికి సాన్నిహిత్యం ఉంటుందనే అనుమానాలు ఉన్నాయట. అందుకే బదిలీ చేసినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఓ మంత్రితో వచ్చిన విభేదాల వల్లే సీపీ ట్రాన్స్‌ఫర్‌ అయ్యారనే ప్రచారం కూడా ఉంది. కారణాలేవైనా.. చర్చ మాత్రం హుజురాబాద్‌ చుట్టూనే తిరుగుతోంది. కమలాసన్‌రెడ్డి ప్లేస్‌లో రామగుండం సీపీగా ఉన్న సత్యనారాయణకు పోస్టింగ్‌ ఇచ్చారు.తెలంగాణలో చాలా కాలంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు ఐపీఎస్‌లు. ఇవిగో ట్రాన్స్‌ఫర్లు.. అవిగో ట్రాన్స్‌ఫర్లు అంటూ లీకులు వచ్చినప్పుడల్లా పోలీసుల ఆశలపై నీళ్లు జల్లే పరిస్థితి. సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నవారు.. పదోన్నతులు దక్కినా.. ఉన్నచోటే కాలం వెళ్లదీస్తున్నవారు ఎందరో. ఇలాంటి సమయంలో కమలాసన్‌రెడ్డిని సడెన్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అదీ రాజకీయవేడి రాజుకున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కావడంతో మరింత చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. హుజురాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించే నాటికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇంకెంతమందికి మూడుతుందో చూడాలి.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags: What happened behind the CP transfer?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page