హూజురాబాద్ లో పట్టుకోసం కాంగ్రెస్

0 11

కరీంనగర్ ముచ్చట్లు:

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉపఎన్నిక రావ‌డం ఖాయం. దీంతో ఈ స్థానాన్ని నిల‌బెట్టుకునేందుకు ఇప్పటికే అధికార టీ.ఆర్‌.ఎస్‌, రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈట‌ల రాజేంద‌ర్ హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక‌ల్లో తన స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ పార్టీ ఉవ్విల్లూరుతోంది. కొత్త పీసీసీ బాస్ రేవంత్ రెడ్డి రావ‌డంతో పార్టీ క్యాడ‌ర్‌లో జోష్ పెరిగింది. గ‌తంలో మాదిరిగా కాకుండా గ‌ట్టిగా త‌ల‌ప‌డాల‌ని కాంగ్రెస్ యోచిస్తోంది.అయితే.. హుజురాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున బ‌రిలో నిల‌వ‌డానికి స‌రైన అభ్యర్థి లేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి .. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీ.ఆర్‌.ఎస్‌లో చేరారు. దీంతో ఇక్కడ గ‌ట్టి పోటీ ఇవ్వాలంటే ఏం చేయాల‌నే దానిపై కాంగ్రెస్ త‌ర్జన‌భ‌ర్జన‌లు ప‌డుతోంది. మ‌రోవైపు ఇప్పటికే హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాలు, ముఖ్యమైన ప‌ట్టణాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించింది. అలాగే నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌ల‌ను ఎల‌క్షన్ మేనేజ్‌మెంట్ క‌మిటీ చైర్మన్ దామోద‌ర రాజ‌న‌ర్సింహకు అప్పగించారు. వీరితో పాటు ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ముఖ్యనేత‌లు ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి, ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధ‌ర్‌బాబు, పొన్నం ప్రభాక‌ర్‌ల‌కు కో ఆర్డినేష‌న్ బాధ్యత‌లు అప్పగించారు.హుజురాబాద్ విష‌యంలో ఇప్పటికే టీ.ఆర్‌.ఎస్ ఆప‌రేష‌న్ స్టార్ట్ చేయ‌డం.. బీజేపీ త‌ర‌ఫున మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ గ‌ట్టి ప్రయ‌త్నాలు చేస్తున్నారు. దీంతో రెండు పార్టీల‌కు గ‌ట్టి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సామాజిక స‌మీక‌ర‌ణాల దృష్ట్యా.. టీ.ఆర్‌.ఎస్‌, బీజేపీలు బీసీ అభ్యర్థుల‌ను నిల‌బెడుతున్న నేప‌థ్యంలో.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సీ సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉండ‌టంతో.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తిని నిల‌బెట్టాల‌ని సూచాయ‌గా నిర్ణయించార‌ట‌. ఈ నేప‌థ్యంలో కరీంన‌గ‌ర్ డీసీసీ అధ్యక్షుడు క‌వ్వంప‌ల్లి స‌త్యనారాయ‌ణ‌, ప‌ర‌కాల మాజీ ఎమ్మెల్యే దొమ్మాటి సాంబ‌య్యల పేర్లను ప‌రిశీలిస్తోంది కాంగ్రెస్.అధికార పార్టీ ఇప్పటికే దళిత బంధు ప్రకటించి దళితులను దగ్గరికి చేరుకునే పనిలో ఉండగా ఇటు ఈటెల నా వల్లే దళిత బంధు వొచ్చింది అని సింపతి పొందాలని చూస్తున్నారు. అయితే అసలు దళితుడినే అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుంది అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొదట్లో దామోదర రాజనర్సింహనే పోటీ చేస్తారన్న వార్తలు వొచ్చాయి. కానీ ఆయన వాటిని కొట్టి పారేశారు. ఈ నేపధ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది నేతలను పరిశీలించే ఆలోచన చేస్తుంది టీ కాంగ్రెస్. మొత్తం మీద హుజురాబాద్ ఉపఎన్నిక విష‌యంలో కాంగ్రెస్ ప్రయోగం చేయ‌బోతుంది. జ‌న‌ర‌ల్ స్థానం నుంచి ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్యర్థిని నిల‌బెట్టి.. ఆ వ‌ర్గంలో సానుభూతి పొంద‌వ‌చ్చనే యోచ‌నగా భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ చేయ‌బోయే ప్రయోగం ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది వేచిచూడాలి.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Congress to hold on to Huzurabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page