మళ్లీ మొదటికొచ్చిన స్మార్ట్ కార్డులు

0 17

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. ఏడాది కాలంగా కొరత సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అప్పటికప్పుడు ఏవో కొన్ని కార్డులను దిగుమతి చేసుకొని డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ పత్రాలను ముద్రించి వాహనదారులకు అందజేస్తున్నారు. కానీ రెండు, మూడు నెలల్లోనే కొరత సమస్య తిరిగి తలెత్తుత్తోంది. స్మార్టు కార్డులను..వాటిలో వివరాలను ముద్రించేందుకు అవసరమయ్యే రిబ్బన్‌లను ఆర్టీఏకు విక్రయించే సంస్థలకుకోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండడం వల్లనే  తరచుగా ఈ సమస్య తలెత్తుతోంది. పౌరసేవల పేరిట వినియోగదారుల నుంచి ఏటా రూ.కోట్లల్లో వసూలు చేస్తున్నప్పటికీ స్మార్ట్‌కార్డుల తయారీకయ్యే ఖర్చులను సకాలంలో చెల్లించడంలో మాత్రం రవాణాశాఖ జాప్యం చేస్తోంది. దీంతో అన్ని రకాల ఫీజులు, స్పీడ్‌ పోస్టు చార్జీలు కూడా చెల్లించిన వినియోగదారులు తాము కోరుకొనే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్‌ కార్డులను మాత్రం పొందలేకపోతున్నారు. 2 నెలలుగా సుమారు లక్షకు పైగా స్మార్ట్‌కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. ఒకవైపు కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ వాహనదారులు ఎంతో బాధ్యతగా అన్ని రకాల ఫీజులు చెల్లించి వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. అలాగే డ్రైవింగ్‌ పరీక్షలకు  హాజరవుతున్నారు. నిబంధనల మేరకు డ్రైవింగ్‌ లైసెన్సులను, ఆర్సీ పత్రాలను రెన్యూవల్‌ చేసుకుంటున్నారు. కానీ రవాణాశాఖ మాత్రం పౌరసేవల్లో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్,

 

 

 

- Advertisement -

నాగోల్, మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, మెహిదీపట్నం, కొండాపూర్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ తదితర అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో గత 2 నెలలుగా స్మార్ట్‌కార్డుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి  ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 250 నుంచి 300 వరకు స్మార్ట్‌కార్డుల డిమాండ్‌ ఉంటుంది. ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌ కార్యాలయంలో మరో వారం రోజులకు సరిపడా కార్డులు మాత్రమే ఉన్నాయి. మేడ్చల్‌లో ఆర్సీ కార్డుల కొరత తీవ్రంగా ఉంది. ఉప్పల్‌లో డ్రైవింగ్‌ లైసెన్సులు లభించడం లేదు. ప్రతి రోజు సుమారు 300 మందికి డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించి స్పీడ్‌ పోస్టు ద్వారా స్మార్ట్‌ కార్డులను వినియోగదారులకు పంపించే నాగోల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో కొరత తీవ్రంగా ఉండడంతో ఇటీవల ఖైరతాబాద్‌ నుంచి 5 వేల కార్డులను తెప్పించి అందజేశారు. ఇప్పటికే 2 నెలలుగా సుమారు  లక్షలకు పైగా కార్డుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా స్మార్ట్‌ కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా.  ఒకవేళ  ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం చర్యలు చేపట్టినా  ఇప్పుడు ఆర్టీఏ పౌరసేవల కోసం  దరఖాస్తు చేసుకొనేవారు వాటిని స్మార్ట్‌ కార్డుల రూపంలో పొందేందుకు మరో 2నెలలు  ఆగాల్సిందే.  డ్రైవింగ్‌ లైసెన్సు అయినా, ఆర్సీ అయినా  స్మార్ట్‌కార్డు రూపంలో ఉంటేనే వాహనదారుడికి గుర్తింపు లభిస్తుంది. ఇందుకోసం  రవాణాశాఖ విధించే నిబంధనలన్నింటినీ పాటిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్సు కోసం రూ.1550  ఆన్‌లైన్‌లో  ముందే చెల్లించవలసి ఉంటుంది.

 

 

 

 

ఇక వాహనాలు కొనుగోలు చేసిన సమయంలోనే జీవితకాల పన్నుతో పాటు,  వాటి శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌తో సహా అన్ని ఫీజులను షోరూమ్‌లో చెల్లిస్తారు.  స్మార్ట్‌కార్డులను వినియోగదారుల ఇంటికి పంపించేందుకు అయ్యే స్పీడ్‌ పోస్టు చార్జీ రూ.35 లు  కూడా ఆర్టీఏ  ఖాతాలో ముందుగానే జమ చేయవలసి ఉంటుంది. దీంతో పాటు సేవా రుసుము పేరిట  రూ.250 వసూలు చేస్తారు.ఇలా  ఫీజుల రూపంలోనే  రవాణాశాఖ వినియోగదారుల నుంచి ప్రతి సంవత్సరం రూ.వందల కోట్లు వసూలు చేస్తుంది.  గతంలో పూనేకు చెందిన  కొన్ని ప్రైవేట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు స్మార్టు కార్డులను తయారు చేసి ఇచ్చేవి. కానీ రవాణాశాఖ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో  ఆ సంస్థలు  చేతులెత్తేశాయి. ఏకంగా ఒప్పందాన్ని  రద్దు చేసుకున్నాయి. దాంతో హైదరాబాద్‌కే చెందిన   సీఎంఎస్, ఎంటెక్,తదితర సంస్థలతో  గతేడాది  ఒప్పందం కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సర్టిఫికెట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులను అందజేయడం ఈ సంస్థల బాధ్యత.ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ  బిల్లులను చెల్లించకపోవడంతో  ఆ సంస్థలు కార్డుల పంపిణీ నిలిపివేసినట్లు తెలిసింది. సకాలంలో కార్డులు లభించకపోవడం వల్ల  తమ వద్ద  ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సు రశీదులు ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు విధిస్తున్నారని వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Again the first smart cards

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page