ఏడు జిల్లాల్లో  కరువు

0 29

తిరుపతి ముచ్చట్లు:

 

మళ్లీ కరువు మేఘాలు కమ్ముకున్నాయి. రాయలసీమతోపాటు మొత్తం ఏడు జిల్లాల్లో దుర్భర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపాతం గణాంకాలే ఇందుకు నిదర్శనం. వైఎస్సార్‌ జిల్లాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జూన్‌ ఒకటో తేదీతో ఆరంభమైన ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకూ చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వర్షపాతం లోటు నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో చినుకు లేకపోవడంతో నామమాత్రంగా సాగైన పంటలు కూడా వాడిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేరుశనగ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పత్తి మొక్కలు వాడిపోయాయి. జొన్న, పెసర తదితర పంటలు కూడా ఎండిపోతున్నాయి. చాలామంది రైతులు పొలాలను దున్ని పదును లేక విత్తనాలు వేయకుండా వదిలేశారు. రాయలసీమ జిల్లాల్లో వర్షాభావం వల్ల భూగర్భ జలమట్టం పాతాళంలోకి పడిపోయింది. బోర్లలో నీరు లేక పండ్ల తోటలు సైతం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  వైఎస్సార్‌ జిల్లాలో 60 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. వేరుశనగ విత్తనం వేసే సీజన్‌ కూడా దాటిపోయింది. ఈ ఖరీఫ్‌లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఆగస్టు రెండో తేదీ నాటికి 9.6 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది. గత ఏడాది ఖరీఫ్‌లో దుర్భిక్షంతో పంటలు పోగొట్టుకుని అప్పుల పాలైన అన్నదాతలు ఈ ఏడాది ఖరీఫ్‌లో పరిస్థితి బాగుంటుందని, పంటలు పండించుకుని నాలుగు రూకలు కళ్లజూద్దామని ఆశపడ్డారు. చినుకు జాడ లేకపోవడంతో అవన్నీ అడియాశలవుతున్నాయి.వర్షాల్లేక సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అరకొరగా అక్కడక్కడా విత్తిన పంటలు కూడా తడిలేక వాడిపోతున్నాయి. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీడు భూములు దుర్భిక్షానికి అద్దం పడుతున్నాయి.వేరుశనగ విత్తడం కోసం రైతులు విత్తనకాయలు కొనుగోలు చేసిన వాటిని వలిచి విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. సీజన్‌ దాటినా వర్షం జాడ లేకపోవడంతో వేరుశనగ పప్పును కిరాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇక వర్షం పడినా వేరుశనగ సాగుకు అనుకూలం కాదని, సీజన్‌ దాటిపోయినందున ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అధిక ధరలకు విత్తనకాయలు కొని చౌకగా పప్పులు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో 247.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది ఈ నెలల్లో  215.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 2016లో ఇదే కాలంలో 283.2 మిల్లీమీటర్లు, 2017లో 239.9 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఈఏడాది ఇంకా తక్కువ కురిసింది. జూన్‌లో ఒక శాతం లోటు నమోదైన వర్షపాతం జూలైలో ఏకంగా 20 శాతానికి చేరింది.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Drought in seven districts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page