ఒలింపిక్స్ పై  ప్రభుత్వాల శ్రద్ధ ఎక్కడ

0 19

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

పేరుకు 130 కోట్ల జనాభా. ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడల్లో ఒక్క పతకం సాధిస్తే దేశం అంతా సంబరాలు చేసుకునే దుస్థితి, దౌర్భాగ్యం. ఏ దేశ అభివృద్ధి అయినా క్రీడలను కూడా కొలమానంగా ప్రపంచం భావిస్తుంది. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడలవైపు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. భారత్ వంటి దేశం ఈ పోటీల్లో కనబరుస్తున్న ప్రదర్శన క్రీడాభిమానుల్లో తీవ్ర నిరాశే నింపుతుంది.క్రీడలు భావి భారత పౌరులను శారీరకంగా మానసికంగా ధృడంగా తయారు చేసేవి. జీవితంలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే అలవాటు చిన్ననాటినుంచి వృద్ధి చేసేవి ఆటలు మాత్రమే అలాంటి క్రీడల పట్ల ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. ఒలింపిక్స్ విజేతలకు నజరానాలు భారీగా ప్రకటించి క్రీడల పట్ల తమ ప్రోత్సహాన్ని వారివరకే పరిమితం చేస్తూ వస్తున్నారు. ఒలింపిక్స్ ముందు హడావిడి వచ్చిన అతికొద్ది పతకాలతో నిట్టూర్పులతో వచ్చే సారి మరిన్ని సాధించేందుకు క్రీడలను ప్రోత్సహిస్తామంటూ ప్రకటనలు తప్ప దేశంలో స్పోర్ట్స్ పాలసీని పటిష్టంగా అమలు చేసే కార్యాచరణ కాగడా పెట్టి వెతికినా కనిపించదు.ఒక మీరాభాయ్ చాను, లవ్లీనా, పివి సింధు,

 

 

 

 

- Advertisement -

రవికుమార్ దహియా ప్రస్తుతం ఒలింపిక్స్ లో తమ సత్తా చాటి ఎంతోకొంత దేశం పరువు నిలిపారు. వీరంతా వారి తల్లితండ్రుల ప్రోత్సహం, స్వయం కృషి, పట్టుదలతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరిన సామాన్యులు. వీరు విజయాలు సాధించడం మొదలు పెట్టాక ప్రభుత్వాలు గుర్తింపు ఇచ్చే పని చేస్తున్నాయి కానీ ముందుగా మట్టిలో మాణిక్యాలను గుర్తించే అంశంలో ఏ మాత్రం శ్రద్ధ లేదన్నది కుండబద్దలు కొట్టి చెప్పొచ్చు. మీరాభాయ్ తల్లితో పాటు అడవిలోకి వెళ్ళి కట్టెలు మోసుకు వచ్చేది. తన గ్రామం నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రాక్టీస్ కు వెళ్ళలిసి వచ్చేది. రవికుమార్ కూడా పేదరికం నుంచి వచ్చిన వాడే. తండ్రి కౌలు రైతు. అయినా కూడా కుమారుడి ఆసక్తిని గమనించి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి అతడికి అవసరమైన పౌష్ఠిక ఆహరం అందించేవాడు. ఇలా వీరే కాదు ఇప్పుడు స్టార్స్ అయిన ప్రతీ క్రీడాకారుడి వెనుక ఒక్కో గాథ తప్పనిసరిగా ఉంటుంది.ప్రస్తుతం దేశంలో ఉన్న విద్యా విధానం లో మార్పు రావాలి. మార్కులు కోసం బట్టి చదువులతో విద్యార్థుల్లో మానసిక ఎదుగుదలను చంపే విధానం కి స్వస్తిపలికి క్రీడలతో కూడిన చదువులు నేర్పించాలి. 20 నుంచి 30 శాతం మార్కులు క్రీడలు ఇతర కళల్లో ప్రతిభ చూపే వారికి కలిపేలా కార్యాచరణ తయారు చేయాలిసిన అవసరాన్ని నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు. విదేశాల్లో ఆ తరహా విధానం అమల్లో ఉండటంతో పాటు ప్రపంచ స్థాయి అత్యుత్తమ క్రీడా సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి. నగరాలకే కాకుండా గ్రామీణ స్థాయిలో ఈవిధమైన చర్యలు చేపట్టినప్పుడే భారత్ ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడల్లో బంగారు పతాకాలపై ఆశలు పెంచుకోవొచ్చు. ఆ దిశగా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని, చేయాలని ఆకాంక్షిద్దాం.

 సింధూకు జగన్ సత్కారం

Tags; Where governments care about the Olympics

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page