మన్సాస్ పార్ట్ 3 

0 22

ఉక్కిరిబిక్కిరవుతున్న రాజుగారు
విజయనగరం  ముచ్చట్లు:

విజయన‌గరం జిల్లా మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో మరో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఇంతవరకూ అశోక్ గజపతిరాజుతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన ఆయన అన్న కూతురు ఊర్మిళా గజపతిరాజు ఇపుడు చైర్ పర్సన్ సీటు తనకు కావాలని అంటున్నారు. తానే అసలైన వారసురాలిని అని కూడా ఆమె క్లైం చేస్తున్నారు. ఎందుకంటే ఆనందగజపతిరాజు రెండవ వివాహం చేసుకున్నారు. ఆయన చివరి రోజులలో రెండవ భార్య సుధా గజపతిరాజే దగ్గరుండి అన్ని సేవలూ చేశారు. ఇక లీగల్ గా చూసినా రెండవ భార్య సంతానానికి అన్ని రకాల హక్కులు ఉన్నాయని అంటున్నారు. దాంతో మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ప్రకారం చూస్తే పెద్ద కుమారుడి వారసులకే ఈ పదవి దక్కుతుంది కాబట్టి తనకే చైర్ పర్సన్ ఇవ్వాలని ఆమె తాజాగా హై కోర్టులో కేసు వేశారు.ఇదిలా ఉంటే ఇంతదాకా అశోక్ గజపతిరాజు వర్సెస్ సంచయిత అన్నట్లుగా వ్యవహారం సాగింది. బాబాయ్ ని పక్కన పెట్టేసి ఏడాది పాటు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా సంచయిత రాజ్యం చేశారు. ఆమెకు వైసీపీ సర్కార్ దన్ను కూడా బాగా ఉంది. అయితే అశోక్ గజపతిరాజు కోర్టులో ఆమె నియామకాన్ని సవాల్ చేసి మరీ తన కుర్చీని తాను సాధించుకున్నారు. ఇక మాన్సాస్ భూముల మీద వివాదం అలాగే ఉంది. సింహాచ‌లం దేవస్థానం భూముల విషయంలోనూ ప్రభుత్వం విచారణ జరిపించి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. ఆ విషయం అలా ఉండగానే ఇపుడు మళ్లీ వారసత్వ పోరు తెరపైకి వచ్చింది. ఈసారి ఊర్మిళా గజపతిరాజు న్యాయ పోరాటం చేస్తున్నారు. దాంతో సంచయిత ఇక తెర వెనకకు వెళ్ళిన మాజీ చైర్ పర్సన్ అవుతారా అన్న చర్చ అయితే ఉంది.ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమకు విడాకులు ఇచ్చారు. దాంతో సంచయితకు హక్కులు ఉండవని అంటున్నారు. ఇక రెండవ భార్య సంతానం అయిన ఊర్మిళ తన తండ్రి వారసత్వంగా వచ్చిన ట్రస్ట్ కి చైర్ పర్సన్ అయ్యేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు అని ఆమె తరఫున లాయర్లు అంటున్నారు. ఇదే వాదనను వారు కోర్టుకు వినిపించబోతున్నారు. అంటే ఇంటికి ఎవరు పెద్దగా ఉంటారో వారి సంతానమే భావి వారసులు అన్నదే ఇక్కడ లాజిక్ పాయింట్. ఇక అశోక్ గజపతిరాజు పెద్దవారు, మగ వారు మాత్రమే మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా ఉండాలి అంటూ బైలాలో ఉందని చెప్పి తన పదవిని తెచ్చుకున్నారు. ఒకవేళ అలాగే అనుకున్నా అశోక్ గజపతిరాజు కి కూడా ఆడపిల్లలే ఉన్నారు. మరి మగవారు లేని కారణంగా అశోక్ గజపతిరాజు తరువాత ఎవరు ట్రస్ట్ చైర్ పర్సన్ అవుతారు అన్న ప్రశ్న ఎటూ ఉంది. దాంతో ఆ నిబంధన లింగ వివక్షకు దారితీస్తోందని, అది తప్పు అన్న వారూ ఉన్నారు. ఈ పాయింట్లతోనే ఇపుడు ఊర్మిళ‌ న్యాయం కోరుతున్నారుట.మొత్తానికి అశోక్ గజపతిరాజు కి మనశ్శాంతి లేకుందా ఈ పరిణామాలు వరసబెట్టి జరుగుతున్నా యని అంటున్నారు. ఒక వైపు మాన్సాస్ లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తూ దర్యాప్తు అంటోంది. మరో వైపు తన అన్న కుటుంబ సభ్యులే, వరసకు కూతుళ్ళు అయిన వారే పోరుకు సై అంటున్నారు. దీంతో నిజాయ‌తీపరుడు, పెద్ద మనిషి అన్న పేరున్న అశోక్ గజపతిరాజు కలత చెందుతున్నారు అంటున్నారు. మరి ఆయన తన తాతల నాటి వారసత్వాన్ని నిలబెట్టాలి. అదే సమయంలో ఇలాంటి చికాకులను కూడా ఎదుర్కోవాలి. ఏడు పదుల వయసులో అశోక్ గజపతిరాజు కి పెద్ద కష్టమే వచ్చిందని అంటున్నారు అంతా.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Mansas Part 3

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page