సమస్యలతో… మున్సిపాల్టీలు కుస్తీ

0 22

హైదరాబాద్ ముచ్చట్లు:
కొత్త మున్సిపాలిటీలు  సమస్యలతో కుస్తీ పడుతున్నాయి. వాటిని ఏర్పాటు చేస్తున్నప్పుడు, ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చిన సర్కారు పెద్దలు.. ఆ తర్వాత గాలికి వదిలేశారు. ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. కనీసం కంకర తేలిన రోడ్లకు, కూలిన డ్రైనేజీలకు కూడా రిపేర్లు చేయించడం లేదు. పంచాయతీల్లో ఉన్నప్పుడే కాస్త బాగుండేదని, కనీసం సర్పంచులను అడిగి పనులు చేయించుకునెటోళ్లమని, ఇప్పుడు ఎవరిని అడగాల్నో కూడా తెలుస్తలేదని  జనం అంటున్నారు.  సరిగ్గా మూడేండ్ల కింద 2018 ఆగస్టులో ప్రభుత్వం 59 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. తర్వాతి ఏడాది మరో 13 పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చింది. అప్పట్లో పేరు కోసం మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చిన ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాలను కూడా బలవంతంగా విలీనం చేసింది. పట్టణాలుగా మార్చడం వల్ల తాము ఉపాధి హామీ పనులు కోల్పోతామని జనం ఆందోళన చేసినా పట్టించుకోలేదు. తీరా మూడేండ్లు గడిచాక చూస్తే ప్రజలకు పన్నులు పెరిగాయి తప్పితే కొంచెం కూడా డెవలప్కాలేదు. అరకొరగా ఉన్న ఫండ్స్తో పట్టణ కేంద్రాల్లో కొన్ని పనులు జరుగుతున్నా.. విలీనగ్రామాల్లో ఎలాంటి మౌలికవసతులు ఉండటం లేదు. తమను ఎన్నికల్లో గెలిపిస్తే రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి, పార్కులు కట్టిస్తామని, ఓపెన్ జిమ్లు పెట్టిస్తామని టీఆర్ఎస్ లీడర్లు వాగ్దానం చేశారు. తీరా గెలిచాక.. ఆ దిక్కు చూడటం లేదు. కొత్త మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా తయారయ్యాయి.

 

గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లను మిషన్ భగీరథ పనుల్లో భాగంగా చాలావరకు తవ్వేశారు. చాలాచోట్ల వీటిని రిపేర్ చేయకుండా వదిలేశారు. దీంతో కొత్తగా సీసీ రోడ్ల కోసం ప్రపోజల్స్ పెట్టినా  శాంక్షన్ రావట్లేదు. పనులు శాంక్షన్ అయి, శంకుస్థాపన చేసినచోట్ల ఫండ్స్ లేక మొదలుపెట్టట్లేదు. దీంతో ఎండాకాలంలో దుమ్ము, వానకాలంలో బురద కారణంగా జనం సఫర్ అవుతున్నారు. చాలా చోట్ల డ్రైనేజీలు కూలిపోయాయి. ప్లానింగ్ ప్రకారం వాటిని కొత్తగా నిర్మిస్తే తప్ప సమస్య తీరదని మున్సిపల్ఆఫీసర్లు చెప్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఉండగా, కొన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేసిన  పైపులైన్లతో వాటర్ సప్లయ్  చేయలేకపోతున్నారు. పైపులు చిన్నగా ఉండడంతో రెండు, మూడు రోజులకోసారి వాటర్ ఇస్తున్నారు. వర్షాకాలంలో వరద వస్తే చెరువు కట్ట మీదుగా ఫిల్టర్ బెడ్ల దారిలో జనం వెళ్లలేకపోతున్నారు. దీనిపై బ్రిడ్జి శాంక్షన్ అయినా నేటికీ వర్క్స్ ప్రారంభం కాలేదు. కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం ఆమేరకు తగిన స్టాఫ్ను ఇవ్వలేదు.

 

- Advertisement -

చాలా మున్సిపాలిటీల్లో కమిషనర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు ఇన్చార్జులు, డిప్యూటేషన్లపై డ్యూటీలు చేస్తున్నారు. ప్రతి పదివేల మంది జనాభాకు 28 మంది సిబ్బంది(కార్మికులు) ఉండాలని నిబంధనలు చెబుతున్నా ఎక్కడా చాలినంతమంది లేరు.  ఉదాహరణకు మంచిర్యాల క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కమిషనర్, మేనేజర్, ఆర్వో , జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ మాత్రమే రెగ్యులర్ ఆఫీసర్లు కాగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఏఈ, టౌన్ప్లానింగ్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లు డిప్యూటేషన్పై  పనిచేస్తున్నారు. ఇతర విభాగాల్లోని అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శానిటేషన్ విభాగానికి 95 మంది అవసరముండగా కేవలం 30 మంది పనిచేస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండడంతో మున్సిపాలిటీల్లో శానిటేషన్ అధ్వానంగా మారింది. అన్ని మున్సిపాలిటీలకు స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసిన సర్కార్ వాటిని నడిపేందుకు డ్రైవర్లను నియమించకపోవడంతో ఆరునెలలుగా వెహికల్స్ అలంకారప్రాయంగా మారాయి. చాలాచోట్ల డంపింగ్యార్డులు లేక చెత్తను శివారుగ్రామాల్లో పోస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. కాలనీల్లో వారాలతరబడి చెత్త పేరుకపోయి కంపుకొడుతోంది.

డంపింగ్ యార్డు, శ్మశానవాటికలు, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ల ఏర్పాట్ల కోసం రెండేండ్ల కిందట అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) కింద ఫండ్స్ కేటాయించినప్పటికీ టెండర్ ప్రక్రియ జాప్యం వల్ల ఇప్పటికీ రిలీజ్ కాలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో స్థల సేకరణ కూడా చేయలేకపోయారు. మున్సిపాలిటీల్లో కనీస సౌలతులు కల్పించకున్నా మున్సిపల్ ఆఫీసర్లు స్థానికుల నుంచి ముక్కుపిండి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినప్పటికీ వాటి అభివృద్ధి ప్రత్యేకంగా ఫండ్స్ రావడం లేదు. ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు ఎటూ సరిపోవడం లేదు. రాష్ట్రంలోని మొత్తం 141 మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి కింద నెలకు రూ. 171.90 కోట్ల చొప్పున 2020 –21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,026.86 కోట్లు విడుదల చేశారు. 2021–- 22 ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ. 145 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టేట్ఫైనాన్స్ కమిషన్ నుంచి సగం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 15వ ఫైనాన్స్‌‌ కమిషన్‌‌ నుంచి సగం ఇస్తున్నారు. ఈ నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తుండటంతో పెద్ద మున్సిపాలిటీలకు ఎక్కువ, కొత్తగా ఏర్పడిన చిన్న మున్సిపాలిటీలకు తక్కువ ఫండ్స్ వస్తున్నాయి. సగటున ఒక్కో మున్సిపాలిటీకి రూ. 100 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఈ మొత్తంలో నాలుగోవంతు నిధులు  సిబ్బంది జీతభత్యాలకే  పోతోంది. మిగిలిన మొత్తంతో ప్రభుత్వం చెప్పే పట్టణ ప్రగతి పనులకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో డెవలప్మెంట్ పనులు  పెండింగ్పడుతున్నాయి. మరోవైపు చిన్న మున్సిపాలిటీలు కావడం, అందులోనూ విలీన పంచాయతీలు ఉండడతో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలైతలేవు.

ఏ కొత్త మున్సిపాలిటీలో చూసినా ఇదే పరిస్థితి
***వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 2018లో తండాలను కలుపుకొని వర్ధన్నపేట మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు.  మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా రూ. 30 కోట్ల స్పెషల్ఫండ్స్తో ఆదర్శ మున్సిపాలిటీ గా చేస్తామన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రమేశ్హామీ నెరవేరలేదు. పట్టణంలో 60 నుంచి 70 శాతం పన్నులు మాత్రమే వసూలు కావడంతో జీతాలు, మెయింటనెన్స్ కే సరిపోతున్నాయి.
***సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మెయింటనెన్స్లేక బైపాస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీ,  రోడ్ల పనులు మధ్యలో ఆగిపోయాయి. దీంతో వర్షాలు పడ్డప్పుడల్లా నారాయణఖేడ్ లోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. విలీన గ్రామాలైన మన్సూర్ పూర్, చాంద్ ఖాన్ పల్లిల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.
***    జగిత్యాల జిల్లా  ధర్మపురి మున్సిపాలిటీలో ఇరుకుదారులు నరకం చూపిస్తున్నాయి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కు వచ్చే భక్తులు కనీస సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు.  తాగునీరు, డ్రైనేజీ సమస్యలున్నాయి.
***    గద్వాల జిల్లాలోని అలంపూర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్డ్రైనేజీ పనులు సగంలో ఆపేశారు. దీంతో మురుగు రోడ్లపై పారుతోంది. మిషన్ భగీరథ, ఫైబర్ గ్రిడ్ పైపులైన్పనుల కోసం మళ్లీ మళ్లీ తవ్వడంతో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. 18 కిలో మీటర్ల  సీసీ రోడ్ల కోసం ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ ఫండ్స్రిలీజ్కాలేదు.
***  ఖమ్మం జిల్లాలోని వైరాలో ఇంటర్నల్రోడ్లు, డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపై పారుతోంది. యూటీఎఫ్ ఫండ్స్రూ. 20 కోట్లు మంజూరైనా సీసీ రోడ్లు వేయలేదు. విలీన గ్రామాలైన పల్లిపాడు, పాత పల్లిపాడు, దిద్దుపుడి, లాలాపురంలో రోడ్లు ఎప్పుడేస్తారో తెలియడం లేదు.
***    కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం, సర్కారు నుంచి వచ్చే నిధులు ఏ మాత్రం సరిపోక టౌన్తోపాటు విలీన గ్రామాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
***మంచిర్యాల జిల్లాలో లక్సెట్టిపేట, ఊత్కూర్, మోదెల, ఇటిక్యాల గ్రామ పంచాయతీలను కలిపి లక్సెట్టిపేట మున్సిపాలిటీ చేశారు. మూడేండ్లుగా ఈ గ్రామాల్లో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టలేదు. పక్కనే గోదారి ఉన్నా ప్రజలకు మాత్రం తాగునీరు దొరకట్లేదు. మిషన్ భగీరథ పనులు పూర్తవలేదు. ఏడాదికి రూ. కోటి 50 లక్షల వరకు ఇన్కం వస్తుండగా ఖర్చు రూ.  కోటి 50 లక్షల వరకు ఇన్కం వస్తుండగా ఖర్చు రూ. 2 కోట్లకు పైగా ఉంటోంది.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:With problems … Municipalities wrestle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page