పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న ప్రవీణ్ ప్రకాష్

0 19

విజయవాడ  ముచ్చట్లు:

బ్యూరోకాట్లు రాజకీయాల వైపు చూస్తున్నారా?  ఐఏఎస్ లు, ఐపీఎస్ లుగా మంచి పొజిషన్లలో ఉన్న వాళ్లు.. పాలిటిక్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారా? ఇటీవల పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా మరో ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాశ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ప్రవీణ్ ప్రకాశ్ ఎపిసోడ్‌ బ్యూరోకాట్లు రాజకీయాల వైపు చూస్తున్నారా? ఇంతకీ ప్రవీణ్ ప్రకాశ్ ప్లాన్‌ ఏంటి? ఢిల్లీలో ఆయన చేస్తున్న లాబీయింగ్ వర్కౌట్‌ అవుతుందా?బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. కాకపోతే రిటైర్‌ అయిన తర్వాత మాత్రమే పాలిటిక్స్ వైపు చూసేవారు. కానీ ఇప్పడు ట్రెండ్ మారింది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుంటున్నారు. సర్వీస్‌లో ఉండగానే పొలిటికల్ ఎంట్రీకోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ లు, ఐపీఎస్  లు రాజకీయాల్లో సెటిలయ్యారు. లక్‌ కలిసిరావడంతో  ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. కొందరు కేంద్ర మంత్రులుగా గుడ్‌ పొజిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఐఏఎస్   ప్రవీణ్ ప్రకాశ్ కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని టాక్‌. కొన్ని రోజులుగా ప్రవీణ్ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. అక్కడే ఉండి తనకు తెలిసిన పెద్దల ద్వారా జోరుగా లాబీయింగ్ చేయిస్తున్నారట. అన్నీ కుదిరితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచే బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రవీణ్ ప్రకాశ్ వారణాసినే ఎంచుకోవడానికి కారణాలున్నాయి. స్వస్థలం కావడం మొదటి రీజన్. ఇక వారణాసిలో తెలుగు ప్రజలు, సంఘాలు చాలా ఎక్కువ. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న ప్రవీణ్‌కు కాశీలోని తెలుగు సంఘాలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక మోదీ మానసపుత్రిక పథకమైన స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా గతంలో వారణాసిలో పనిచేసిన అనుభవం ప్రవీణ్‌ ప్రకాశ్‌కు ఉంది. అంటే అక్కడి ప్రజలు, అధికారులతో సంబంధాలున్నాయి. పబ్లిక్‌ కూడా ఆయనకు సుపరిచితమే. అంతే కాదు ప్రవీణ్ ప్రకాశ్ తండ్రి కూడా ఓబ్రా థర్మల్ పవర్‌ ప్రాజెక్ట్‌కు చీఫ్‌ ఇంజినీర్‌గా వారణాసిలోనే పనిచేశారు. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నాయి కాబట్టే… పొలిటికల్ ఎంట్రీకి వారణాసిని ఎంపిక చేసుకున్నట్లు టాక్‌. పొలిటికల్‌ ఎంట్రీపై ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌కు ప్రవీణ్ చెప్పేశారని టాక్ వినిపిస్తోంది.ప్రవీణ్ ప్రకాశ్ 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన బ్యాచ్‌మెట్లు చాలా మంది ఇప్పటికే రాజకీయాల్లో బాగా సెటిలయ్యారు. అందుకే ప్రవీణ్ కూడా అటు వైపు చూస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న అశ్వినీ వైష్ణవ్ ప్రవీణ్ బ్యాచ్‌మెట్టే. అందుకే ప్రవీణ్ పాలిటిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. అయితే ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? వారణాసి టికెట్ దొరుకుతుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే ప్రస్తుతం వారణాసి ఎమ్మెల్యేగా బీజేపీకే చెందిన సౌరబ్ శ్రీవాత్సవ్ ఉన్నారు. పైగా ప్రవీణ్ ప్రకాశ్ సామాజికవర్గమే. బలమైన కమలం నేత. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి సౌరబ్‌ను కాదని బీజేపీ హైకమాండ్ ప్రవీణ్‌ ప్రకాశ్‌కు టికెట్‌ ఇస్తోందా లేదా ప్రస్తుతానికి అప్రస్తుతం.ప్రవీణ్‌ ప్రకాశ్… సీఎం జగన్‌కు ఫేవరేట్ ఆఫీసర్. జగన్ సీఎం అయ్యాక ఓ వెలుగు వెలిగారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం లో అన్నీ తానై నడిపించారు. చీఫ్‌ సెక్రటరి మాదిరిగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అన్ని పనులు చక్కబెట్టి ది బెస్ట్‌ అనిపించుకున్నారు. గతంలో సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను తప్పించడంలో ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహరించిన తీరు కాంట్రవర్సికి దారితీసింది. ప్రస్తుతం సీఎం జగన్‌కు ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్న  ప్రవీణ్ ప్రకాశ్ పొలిటికల్ ఎంట్రీ ఎలా సాగుతుందో చూడాలి. ఢిల్లీలో చేస్తున్న లాబీయింగ్ ఫలిస్తుందా…? వారణాసి టికెట్ దక్కుతుందా? వేచి చూడాల్సిందే.

 

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Praveen Prakash getting ready for political entry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page