బూమ్ రాంగ్ అవుతున్న దళిత బంధు

0 5

హైదరాబాద్     ముచ్చట్లు:

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశలు పెంచేశారు. అదే ఇప్పుడు పార్టీకి ట్రాప్ గా మారుతుందేమోననే భయం వెన్నాడుతోంది. ఎస్సీ స్కీమ్ టీఆర్ఎస్ పట్ట బూమ్ రాంగ్ అవుతుందేమోననే అనుమానం నెలకొంటోంది. ఇతర వర్గాల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. దళితబంధుపై ప్రభుత్వం సాగించిన ప్రచారం ఇతర వెనకబడిన , గిరిజన , మైనారిటీ వర్గాల్లో డిమాండ్లకు కారణమవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను లక్ష్యంగా చేసుకుంటూ కేసీఆర్ దళిత బంధుకు రూపకల్పన చేశారు. షెడ్యూల్డ్ కులాలలో చిన్నతరహా పారిశ్రామికీరణకు ప్రోత్సహించేలా కుటుంబానికి పదిలక్షల రూపాయలు అందచేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటిలోకి అత్యంత ఆకర్షణీయమైన పథకమిది.

 

 

 

- Advertisement -

రైతు రుణమాఫీ సహా ఏ స్కీము కూడా దీనికి సాటి రాదు. హూజూరాబాద్ లో 28వేల వరకూ దళితుల ఓట్లు ఉండటంతో టీఆర్ఎస్ కే లభించాలనే టార్గెట్ తోనే పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పక్షపాతంతో వ్యవహరిస్తోంది. తమకూ ఇవ్వాలని మిగిలిన వర్గాలు కోరుకోవడంలో అత్యాశ లేదు. మరీ ముఖ్యంగా మైనారిటీలు, గిరిజనులు, అత్యంత వెనకబడిన వర్గాలు మా సంగతేమిటని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఆ డిమాండ్లను ముందుకు తెస్తూ టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్కీమ్ పై విస్తృత ప్రచారం కారణంగా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. అది ప్రతిపక్షాలకు అందివచ్చిన అవకాశంగా మారుతోంది.కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం ఉద్దేశం మంచిదే. కానీ అమలులో అనేక సమస్యలున్నాయి. లబ్ధిదారులను సక్రమంగా ఎంపిక చేస్తే దాదాపు 12 లక్షల మందికి స్కీమును ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ బ్యాంకుల రుణంతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే వారికి నిధులివ్వాలి. ఇదంత సాధ్యమయ్యే పనికాదు. ఈ స్కీములో ఉండే ఆకర్షణను కనిపెట్టిన కాంగ్రెసు పార్టీ ఇతర వర్గాలను రెచ్చగొడుతోంది.

 

 

 

రాష్ట్రంలో దళితుల కంటే ఆదివాసీలు, లంబాడాలు మరింతగా వెనకబడి ఉన్నారు. ఎస్సీలతో పాటు వారికి కూడా ఈ స్కీము ప్రవేశపెట్టాలనే డిమాండ్ పెడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆదివాసీ, లంబాడీ సమస్యపై సతమతమవుతోంది. ఆయావర్గాల్లో పట్టు సాధించలేకపోతోంది. ఇప్పుడు తాజా డిమాండ్ తో వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగదోసేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ గీశారు. ఇంద్రవెల్లి సభతో మొదలు పెట్టి మరో నాలుగైదు చోట్ల ప్రదర్శనలు, బహిరంగ సభలకు ప్రణాళిక వేస్తున్నారు. కేసీఆర్ కు ఇదో పెద్ద తలపోటుగా మారే ప్రమాదం ఉంది. అందులోనూ దళితులకు ఉద్దేశించిన పథకానికి పరిమితులున్నాయి. అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. ఆ వర్గంలోనూ నూటికి పది శాతం మించి స్కీమ్ ను అమలు చేయలేరు. మిగిలిన వారిలో సహజంగానే అసంతృప్తి ఉంటుంది. ఇక అత్యంత వెనకబడిన మిగిలిన వర్గాలు కూడా ఈ స్కీమ్ ను కోరుకుంటూ రోడ్డెక్కితే ప్రభుత్వం తట్టుకోవడం కష్టమే.దళిత ఓటింగును సంఘటిత పరుచుకుని వచ్చ ఎన్నికల నాటికి సునాయాస విజయం సాధించాలనేది కేసీఆర్ కల. అయితే తాజాగా ఐపీఎస్ కు రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ పెద్ద ఆటంకంగా మారబోతున్నారు. తొమ్మిదేళ్లపాటు గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ ఎస్సీ వర్గాల్లో మంచి పట్టు సాధించారు.

 

 

 

 

స్వేరోస్ ను స్థాపించి సామాజికంగా, ఆర్థికంగా ఎస్సీలు ముందుకు వెళ్లాల్సిన అంశంపై ఇప్పటికే అవగాహన కల్పించారు. రాజ్యాధికారమే లక్ష్యం కావాలంటూ ఆయన తెలంగాణను చుట్టుముడుతున్నారు. మంచి ఆదరణ లభిస్తోంది. యువతరంలో పలుకుబడి ఉండటంతో దళిత వర్గాలు బాసటగా నిలుస్తున్నాయి. బహుజన సమాజ్ పార్టీని ఆయన వేదికగా మలచుకున్నారు. స్కీముల ద్వారా శాశ్వతంగా బానిసత్వం వద్దు. మనం అదికారం తెచ్చుకుంటేనే బాగుపడతామంటూ ప్రవీణ్ చేస్తున్న ప్రచారం ఆయా వర్గాలను ఆకట్టుకుంటోంది . అందువల్ల దళిత బందుతో దరి చేర్చుకుని శాశ్వత ఓటు బ్యాంకును నిర్మించుకోవాలనుకున్న కేసీఆర్ ప్రయత్నం పూర్తిగా ఫలించే సూచనలు కనిపించడం లేదు.తెలంగాణలో బీసీల జనాభా అత్యధికం. బీసీల్లోనూ మరింతగా వెనకబడిన వారు కూడా అధికమే. యాదవ, గౌడ, ముదిరాజ్, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ వంటి కొన్ని వర్గాలు మాత్రం బీసీల్లో పైవరసలో ఉన్నాయి.

 

 

 

రజక, శాలివాహన, గంగపుత్ర వంటి వర్గాలు అత్యంత వెనకబడి ఉన్నాయి. కుటుంబానికి పదిలక్షల రూపాయలనే స్కీమ్ వీరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తోంది. భారతీయ జనతాపార్టీ నిప్పు ఎగదోసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. బీసీలను వెనకబడిన, అత్యంత వెనకబడిన అనే వర్గీకరణ చేయకుండా అందరికీ పదిలక్షల స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్ మొదలు పెట్టింది. దీనిని భారీ ఎత్తున ప్రచారం చేసేందుకు సిద్దమవుతోంది. ఏదేమైనా ఆకర్షణీయమైన పథకంతో తేనెతుట్టను కదిల్చారు కేసీఆర్. అది జుర్రుకోవాలని ఎవరు మాత్రం ప్రయత్నించరు.? కనీసం డిమాండ్ వరకైనా తప్పదు. అందులోనూ ఆచరణ మొదలయ్యాక, మరింతగా ఇతర వర్గాల్లో ఆశలు పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. పథకాల పులి మీద స్వారీ చేయడం మొదలు పెట్టాక కిందకు దిగడం అంత సులభం కాదు. వచ్చే ఎన్నికల నాటికి ఈ డిమాండ్ల జోరు , హోరు మరింత ముదరడం ఖాయంగానే చెప్పవచ్చు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags:Boom Wrong Dalit Relative

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page