భారీగా పెరిగిన బీటి పత్తి

0 21

గుంటూరు ముచ్చట్లు :

అనుమతుల్లేని బిటి-3 పత్తి సాగు ఈ ఏడాది అధికమైంది. ఎక్కువగా పత్తి సాగయ్యే మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో గతేడాది కంటే సాగు రెట్టింపైనట్లు చెబుతున్నారు. నిరుడు ఆయా రాష్ట్రాల్లో 30 లక్షల ప్యాకెట్ల వరకు విక్రయించగా ప్రస్తుత ఖరీఫ్‌లో 75 లక్షల ప్యాకెట్లకు అమ్మకాలు చేరుకున్నాయని అంచనా. మహారాష్ట్ర, తెలంగాణ, ఎపిలలో ఈ ఖరీఫ్‌లో రూ.300 కోట్ల చట్ట విరుద్ధ చీకటి వ్యాపారం జరిగిందని సమాచారం. ఎపిలో ఇప్పటి వరకు సాగైన పత్తిలో లక్షన్నర నుండి రెండు లక్షల ఎకరాల వరకు అనధికారిక రకం పత్తి ఉంటుందని సమాచారం. అనుమతుల్లేని బిటి-3 వేరియంట్‌ సాగు వలన పర్యావరణానికి, రైతులకు, చట్టబద్ధ పత్తి విత్తన మార్కెట్‌కు, స్థానిక చిన్న కంపెనీలకు, చివరికి ప్రభుత్వ పన్ను ఆదాయానికి నష్టమని సీడ్‌ కంపెనీల అసోసియేషన్స్‌, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని దఫదఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. కాగా మూడు వ్యవసాయ చట్టాలు చేసే విషయంలో రాష్ట్రాల హక్కులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని కేంద్రం, అంతర్రాష్ట్ర సమస్యగా మారిన అనుమతుల్లేని విత్తన విక్రయాలపై చర్యలు తీసుకొనే విషయంలో మాత్రం కట్టడి బాధ్యత రాష్ట్రాలదేనని తప్పించుకుంది.బోల్‌గార్డ్‌ 3/ హెర్బిసైడ్‌ టాలరెంట్‌ (హెచ్‌టి)/ గ్లెయిసెల్‌/ రౌండప్‌ రెడీ ఫ్లెక్స్‌ (ఆర్‌ఆర్‌ఎఫ్‌)/ బిటి-3… పేరేదైనా ఈ రకం పత్తి విత్తనాలకు జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రూవల్‌ కమిటీ (జిఇఎసి) అనుమతుల్లేవు. అయినప్పటికీ 2016 నుండి దేశంలో హెచ్‌టి పేరుతో అక్కడక్కడ అనధికారిక సాగు మొదలైంది. 2017లో పార్లమెంట్‌లో లేవనెత్తిన మీదట ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఆదేశాల మేరకు బయో టెక్నాలజీ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో ఫీల్డ్‌ ఇన్‌స్పెక్షన్‌ అండ్‌ సైంటిఫిక్‌ ఎవాల్యూషన్‌ కమిటీ (ఎఫ్‌ఐఎస్‌ఇసి), మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, ఎపిలలో కొన్ని వేల నమూనాలు పరీక్షించిన మీదట 15 శాతం విస్తీర్ణంలో హెచ్‌టి రకం సాగైందని తేల్చింది. అప్పటి నుండి అనధికారిక సాగు క్రమేపి పెరుగుతూ వస్తోంది.
జన్యుపరంగా మార్పిడి చేసిన పత్తి విత్తనాల్లో ఇప్పటి వరకు బోల్‌గార్డ్‌1, బోల్‌గార్డ్‌2 రకాలకు జిఇఎసి అనుమతులున్నాయి. ఈ టెక్నాలజీని మోన్‌ శాంటో తీసుకొచ్చింది. పత్తిని ఆశించే శనగపచ్చ పురు గును మాత్రమే ఈ రకాలు నిరోధిస్తాయంటున్నారు. బిటి-3 వేరియంట్‌ మొక్కలు కలుపు మొక్కలు పెరగకుండా స్ప్రే చేసే గ్లయిఫోసేట్‌ హెర్బిసైడ్‌ను తట్టుకుంటాయంటున్నారు. అనుమతుల్లేకపోయినా ఐదారేళ్ల నుండి రైతుల పొలాల్లో సాగవుతున్నాయి. బిటి-3 విత్తనాలు వేస్తే రైతులకు ఎకరానికి రూ.7 వేల నుండి 8 వేల వరకు కలుపు తీత ఖర్చు తగ్గుతుందని ప్రచారం చేస్తున్నారు. చాలా మట్టుకు గుజరాత్‌ నుండి మహారాష్ట్ర మీదుగా తెలంగాణ, ఎపిలకు విత్తనాలు రహస్యంగా వచ్చి పడుతున్నాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం గతంలో బిటి-3కి కేంద్రంగా కొనసాగింది. పలు విధాలుగా నష్టపరిచే ప్రమాదకర పత్తి విత్తనాల కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అచేతనంగా వ్యవహరిస్తున్నాయని, బాధ్యత మీదంటే మీదని చేతులెస్తున్నాయని ఆరోపణలొస్తున్నాయి.

 

 

- Advertisement -

Tags:Heavily grown beaty cotton

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page