ఆశాజనకంగా వర్షాలు… ఆనందంలో రైతులు

0 16

వరంగల్  ముచ్చట్లు :
రైతులు వరినాట్ల కోసం సిద్ధం అవుతున్నారు. వానల్లు కురవాలి వానదేవుడా అని పాడుకున్న జనం ఇప్పుడు వానరాకతో ఇంటికి చుట్టం వచ్చిన తీరుగా సంబురపడుతున్నది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి చెరువులన్నీ జలకళతో తొణకిసలాడుతున్నాయి. కవిసికెడు నీరులేని చెరువులు ఒక్కసారిగా వరదనీటితో తానమాడుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు ఉక్కపోత వెళ్లిపోయింది. ఈ సీజన్‌లో అత్యధిక వర్షపాతం ఈ రెండు రోజుల్లోనే నమోదు అయింది. జిల్లా వ్యాప్తంగా 643.2 మిమీ వర్షపాతం నమోదుకాగా, సగటున 91.6మీమీ వర్షపాతంగా నమోదు అయింది. హన్మకొండ మండలంలో అత్యధికంగా 119.2 మిమీ వర్షపాతం నమోదైంది. కమలాపూర్ మండలంలో 111.2మిమీ, వరంగల్ మండలంలో 111మిమీ, ఎల్కతుర్తిలో 91.2మీమీ, భీమదేవరపల్లిలో 77.4మీమీ, ధర్మసాగర్ మండలంలో 74.4 మిమీ వర్షపాతం నమోదు కాగా, హసన్‌పర్తి మండలంలో అత్యల్పంగా 58.2 మిమీ వర్షపాతం నమోదు అయింది. కాగా, వేలేరు, కాజీపేట, ఖిలా వరంగల్ మండలాల్లో రెయిన్‌గేజ్ లేకపోవడం వల్ల అక్కడ కురిసిన వర్షాన్ని శాస్త్రీయంగా అంచనా లేకపోయినా ఆ సమీప మండలాల వర్షపాతమే అక్కడా నమోదైందని అధికార యంత్రాంగం ప్రకటించింది.ఉష్ణోగ్రతలు తగ్గాయి. 33-35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 21 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరాయి. జిల్లా వ్యాప్తంగా వాతావరణశాఖ వెల్లడించిన వర్షపాతం నమోదు ఆశాజనకంగా మారింది.. జిల్లా సగటు వర్షపాతం 91.6మిమీగా నమోదు అయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో ప్రాథమిక అంచనాల ప్రకారం 20 ఇండ్లు పూర్తిగా, మరో ఆరు ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. అయితే ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం అయినా అధికారులు సకాలంలో స్పందించి విద్యుత్‌ను పునరిద్ధారించారు. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎటువంటి లోటుపాట్లు రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేయడంతోపాటు రాష్ట్రస్థాయి అధికారిని జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించింది. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వీపీ గౌతమ్ సహా పలువురు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేయడంతో సహాయక చర్యల కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

 

 

Tags:Hopefully it rains … farmers happy

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page