విశాఖకు మరో ఉపద్రవమా..

0 4,595

విశాఖపట్టణంముచ్చట్లు:

 

విశాఖపట్టణం, ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. స్మార్ట్ సిటీ అని దానికి పేరు. ఇక జగన్ సర్కార్ అయితే విశాఖను పాలనా రాజధానిగా కూడా ప్రతిపాదిస్తూ చట్టం చేసింది. అది ప్రస్తుతం న్యాయ సమీక్షలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే విశాఖకు పెను ముప్పు అంటూ తరచూ వార్తలు రావడం జిల్లా వాసులను కలవరపెట్టే అంశంగా ఉంది. ఇందులో శాస్త్రీయత ఎంత ఉందో అన్నది పక్కన పెడితే దానికి మించి రాజకీయమే ఉందని మేధావులు కూడా అనుమానిస్తున్నారు. విశాఖను రాజధానిగా ఎపుడైతే ప్రకటించారో నాటి నుంచి ఈ నగరం భద్రత మీద నీలినీడలు కమ్ముకునేలా వరసబెట్టి వార్తలు వస్తున్నాయి.విశాఖ దేశంలోని అతి ముఖ్య నగరం. ప్రగతి బాటన సాగుతున్న ప్రాంతం. ఈ నగరానికి ముప్పు ఉందని తాజాగా అమెరికాలోని నాసా పరిశోధనలు వెల్లడించాయి. కేవలం విశాఖ మాత్రమే కాదు, ముంబై, చెన్నై, కొచ్చి వంటి పన్నెండు భారతీయ నగరాలకు ముప్పు ఉందని కూడా లెక్క తేల్చారు. అంతే కాదు ఆసియా ఖండంలోని చాలా తీర ప్రాంత నగరాల‌కు కూడా ఈ ఉపద్రవం పొంచి ఉందని కూడా హెచ్చరించారు. ఇదంతా ఎపుడూ అంటే మరో ఎనభై నుంచి వందేళ్ల లోపు. మరి అప్పటికి కూడా తగిన చర్యలు తీసుకోకపోతేనే ఇలాంటివి ముంచుకొస్తాయని అంటున్నారు. అది కూడా మొత్తం నగరాలకు నగరాలు మునగవు, కొన్ని ముందు ప్రాంతాలు సముద్ర నీటి మట్టం ఎత్తు పెరగడం వల్ల మునుగుతాయని అంటున్నారు.ఏపీలో ఈ రోజుకూ చెప్పుకోదగిన నగరం విశాఖ తప్ప మరేమీ లేదు. అలాంటి నగరం మీద బురద జల్లడానికి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా అతి ఉత్సాహం చూపుతోందని విమర్శలు అయితే ఉన్నాయి. విశాఖ పారిశ్రామిక నగరం. మరి రసాయన పరిశ్రమలు ఉంటాయి. వాటి వల్ల ఇబ్బంది వచ్చి ఏ క్షణాన అయినా భస్మీపటలం అయిపోతుందని వార్తలు వండుతారు. సముద్రపు ఒడ్డున సిటీ ఉంది కాబట్టి సాగర గర్భంలో భూ కంపం వచ్చి సిటీ కొట్టుకుపోతుందని కూడా అంటారు. విశాఖకు సునామీ ప్రమాదం అంటారు. మరి అభివృద్ధి మాటున కొన్ని విపత్తులు కూడా ఉంటాయి. వాటిని సరిచేసుకోవాలి. దానికి తగిన మేనేజ్మెంట్ ని రూపొందించుకోవాలి. అంతే తప్ప మునిగిపోతుందని విష ప్రచారం చేయడం ఎంతవరకూ మంచిది అన్న మాట అయితే ఉంది.విశాఖ అయితే ఇంకా రాజధాని అవలేదు, కాబట్టి మునిగే సిటీకి రాజసం ఎందుకు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాతలు రాస్తోంది. మరి ముంబై, చెన్నై రాజధానులే కదా. అవి మునిగిపోతాయి అంటే ఇప్పటికిపుడు రాజధానులను మార్చేస్తారా. ప్రకృతి విపత్తుల నుంచి తగిన రక్షణకు ఎప్పటికపుడు చర్యలు చేపట్టడం ద్వారా అధిగమించవచ్చు. మరో వందేళ్లలో ఉపద్రవం జరగబోతోంది అని విశాఖను ఖాళీ చేయించే విధంగా భయానకమైన పరిస్థితి సృష్టిస్తే అది రాజకీయంగా బాగుంటుందేమో కానీ ఆంధ్రా భవిష్యత్తుకు మేలు చేసే విషయమేనా అన్నది కూడా ఆలోచించాలి కదా అంటున్నారు మేధావులు. మొత్తానికి విశాఖ రాజధాని అని చెప్పకపోతే ఏ చిక్కూ ఉండేది కాదు కదా అన్నది సగటు జనం మనోగతంగా ఉంది.

 

- Advertisement -

Tags:Another disaster for Visakha ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page