హరీష్ రావు,బాహూబలా… బలిపశువా

0 8,574

కరీంనగర్  ముచ్చట్లు:

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందనేది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రసమితిలో సంచలనం కలిగిస్తోంది. ప్రభుత్వం, పార్టీ సర్వశక్తులు ధారపోస్తోంది. ఏదైమైనా ఈ గెలుపు పార్టీకి అత్యవసరం. ఒకవేళ ఓటమి ఎదురైతే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ అథ: పాతాళానికి పడిపోతుంది. గెలిచి చూపిస్తే కాలరెగరేస్తున్న ప్రతిపక్షాల నోళ్లు మూతపడతాయి. మళ్లీ సాధారణ ఎన్నికల వరకూ వెనుతిరిగి చూడాల్సిన పని ఉండదు. అందుకే కేసీఆర్ సహా పార్టీ యంత్రాంగం మొత్తం హుజూరాబాద్ పైనే కేంద్రీకరించింది. ప్రభుత్వ పరంగా పథకాలపై పథకాలు ప్రకటిస్తున్నారు. సకల సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ అనధికారికంగా నియోజకవర్గంలో మూడు సర్వేలు నిర్వహించారు. ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ సానుకూలత కనిపించలేదని సమాచారం. అందుకే సామదానభేదోపాయాలతో ఏదో రకంగా గెలుపు తెచ్చుకోవాల్సిందేనని కేసీఆర్ సంకల్పించారు. ఈ ఫలితం టీఆర్ఎస్ కు మరింత ఊపు తెస్తుందా? ప్రతిపక్ష రాజకీయాలకు ప్రాణం పోస్తుందో తేలాల్సి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకూ పథకాలతో ప్రభుత్వం నియోజకవర్గాన్ని ముంచెత్తబోతోంది.పార్టీని గెలిపించే బాధ్యతను అధినేత కేసీఆర్ హరీశ్ భుజస్కంధాలపై ఉంచారు. ఇది పెద్ద పరీక్ష లాంటిదే. అనేక సందర్భాల్లో పార్టీని విషమ స్థితి నుంచి గట్టెక్కించిన నైపుణ్యం హరీశ్ సొంతం. కానీ పరిస్తితులు ఎల్లవేళలా తనకు అనుకూలంగా ఉండవని దుబ్బాక ఎన్నికలు నిరూపించాయి. అక్కడ అధికారపార్టీ ఓటమి పాలయ్యింది. ఆ వైఫల్యానికి హరీశ్ బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ బలమైన ప్రత్యర్థి. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ఆయనకు ప్రత్యేక అనుచరవర్గం ఉంది. దానికితోడు ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. మొత్తం పరిస్థితులు తలకిందులైతే తప్ప ఓడించడం అంత సులభం కాదు. అందుకే క్షేత్రస్తాయిలో కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేయడంలో అనుభవం కలిగిన హరీశ్ కు మరోసారి బాధ్యతలు అప్పగించారు. ఈటలను ఎదుర్కోవడం మరొకరికి సాధ్యం కాదనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ ఎంపిక చేశారు. రాజేందర్ పనితీరు, ఎన్నికల నిర్వహణ, ఉద్యమ నేపథ్యం వంటి అన్ని అంశాలపై హరీశ్ కు పంపూర్ణమైన అవగాహన ఉంది. ప్రతి వ్యూహాలను రచించి దెబ్బతీయడం ద్వారా పార్టీ ప్రతిష్ఠ మసకబారకుండా చూడాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు తనపై పడింది. ఈ ఎన్నికలో టీఆర్ ఎస్ అభ్యర్థి ఎవరనేది నామమాత్రం. రంగంలో హరీశ్ రావు నిలిచినట్లుగానే చెప్పాలి. గెలుపు ఖాయమైతే బాహుబలిగా మరోసారి తన సత్తాను చాటుకున్నట్లవుతుంది. ఒకవేళ అదృష్టం తిరగబడితే పార్టీలో కొంత మేరకు ప్రాధాన్యం తగ్గడమూ ఖాయమే. ఓటమి భారం అతని ఖాతాలోనే పడుతుంది.దుబ్బాక ఓటమి తర్వాత హరీశ్ రావు డీలా పడ్డారు. ఎదురు లేదనుకున్న చోట సొంత జిల్లాలోనే పార్టీ పరాజయం పాలైంది. దాంతో కేసీఆర్ వద్ద కూడా నెగిటివ్ మార్కులు పడ్డాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేయాల్సి వచ్చింది. తర్వాత జీహెచ్ఎంసీలోనూ టీఆర్ఎస్ ఎదురుదెబ్బలు తింది. ఈటల తిరుగుబాటు పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. ఈ స్థితిలో మళ్లీ పునరుత్తేజానికి అన్నిరకాల శక్తులు వినియోగించాల్సి వస్తోంది. అందుకే హరీశ్ రావు కు కేసీఆర్ ప్రాధాన్యం పెంచారు. పార్టీ పరువు పోకుండా చూడాల్సిన కర్తవ్యం అప్పగించారు. నిజానికి ఇంతటి ప్రతిష్టాత్మక స్తానంలో బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించవచ్చు. కానీ గెలుపుపై స్పష్టత లేదు. పరిస్థితులు ప్రత్యర్థికే అనుకూలంగా ఉన్నాయి. ఈ స్థితిలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత తీసుకుంటే ఓటమి ఎదురైతే మరింతగా నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. హరీశ్ రావు ఎన్నో డక్కామొక్కీలు తిన్నారు. పైపెచ్చు గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడే తత్వం అతనిది. అందుకే ఇక్కడ ఈటలను దీటుగా ఎదుర్కొనే అస్త్రంగా ప్రయోగిస్తున్నారని చెప్పాలి. హరీశ్ ఎత్తులు ఫలించి హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం అనుకూలంగా వస్తే ఆయనకు ఎధురుండదు. కేసీఆర్ వద్ద పలుకుబడితోపాటు పార్టీ క్యాడర్ లోనూ పదవులతో సంబంధం లేకుండా గౌరవప్రదమైన తన స్తానానికి భవిష్యత్తులో ఢోకా ఉండదు.టీఆర్ఎస్ కు ఎన్నికలు కొత్త కాదు. అనేక సార్లు రాజీనామాలు చేసి ఉద్యమాన్ని పునరుజ్జీవింప చేసిన ఘనత ఉంది. కానీ ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితి. పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. ఉద్యమంలో కలిసి నడిచిన సీనియర్ నాయకుడే తిరగబడ్డాడు. మరోవైపు బీజేపీ, కాంగ్రెసు పార్టీలు సవాల్ విసురుతున్నాయి. ఇంత పెద్ద యంత్రాంగం, అధికారం ఉండి కూడా ఉప ఎన్నికల సమరాన్ని ఎదుర్కోలేకపోతే క్యాడర్ డీలా పడుతుంది. రానున్న రెండేళ్లు నెగటివ్ ప్రచారం జోరందుకుంటుంది. అందుకే హుజూరాబాద్ ఎన్నికను గతంలో ఎన్నడూ లేనంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అడిగినవారికి, అడగని వారికి అందరికీ అన్నిరకాల వరాలు ప్రకటించేస్తున్నారు. సామాజిక వర్గాల వారీ గా నాయకులకు పదవులు కట్టబెడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు వెల్లువెత్తిస్తున్నారు. రానున్న రెండు నెలల కాలంలో ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే రెండువేల కోట్ల రూపాయల వరకూ సంక్షేమ, అబివ్రుద్ధి కార్యక్రమాలకు వెచ్చిందేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసినట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో నిధులు పెట్టినా పార్టీలో సంపూర్ణ విశ్వాసం నెలకొనడం లేదు. బలమైన ప్రత్యర్థి రంగంలో ఉండటానికి తోడు ప్రబుత్వ వ్యతిరేకత పెరిగిందేమోననే అనుమానం పీడిస్తోంది. ప్రభుత్వానికి , ప్రతిషక్షాల రాజకీయ సమరానికి హుజూరాబాద్ ఒక శాంపిల్ టెస్టుగా మారింది.

 

- Advertisement -

Tags:Harish Rao, Bahubala … Balipashuva

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page