శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ

0 8,765

తిరుమ‌ల‌  ముచ్చట్లు:

 

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా గురువారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియకుండా జ‌రిగిన‌ దోషాల నివార‌ణ‌కు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న‌ట్టు తెలిపారు. ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా రెండో రోజు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టామ‌న్నారు. శుక్ర‌వారం పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్న‌ట్టు చెప్పారు.

కాగా, ప‌విత్రోత్స‌వాల్లో రెండో రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళామాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామివారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags:Sacrifice of the saints scientifically in the Srivari temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page