కొలువుదీరిన నవ న్యాయమూర్తులు -సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త రికార్డు

0 9,334

-ప్రమాణం చేయించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

-33కి చేరిన జడ్జీల సంఖ్య.. వీరిలో నలుగురు మహిళలు

 

- Advertisement -

దిల్లీ ముచ్చట్లు:

తొమ్మిది మంది న్యాయమూర్తులు, అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణం చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. కొత్త న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టడంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ప్రస్తుతం ఒకేఒక ఖాళీ మిగిలింది. ఇదివరకు ఎన్నడూ లేనంతగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు పెరిగింది. సుప్రీంకోర్టుకు నూతనంగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు వస్తున్న సంప్రదాయానికి అతీతంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సుప్రీంకోర్టు అదనపు భవనం ఆడిటోరియంలో వారిచేత ప్రమాణం చేయించారు. సహచర న్యాయమూర్తులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ కార్యక్రమం అరగంటసేపు సాగింది. సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన పేర్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేసి, నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ సభాముఖంగా చదివి వినిపించి సీనియారిటీ ప్రాతిపదికగా కొత్త న్యాయమూర్తులను వరుసగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బెంగళూర్‌ వెంకటరామయ్య నాగరత్న, జస్టిస్‌ చుడలాయిల్‌ తేవన్‌ రవికుమార్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహల చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అందరికీ అభినందనలు తెలుపుతూ, దైవాశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. సీజేఐ నిర్ణయం మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా జడ్జీల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం.తొలి మహిళా న్యాయమూర్తి నుంచి తొలి మహిళా సీజేఐకి మధ్య 38 ఏళ్లు తొమ్మిది మంది నూతన న్యాయమూర్తుల్లో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులయ్యే అవకాశం ఉంది. అందులోనూ ఇప్పుడున్న సీనియారిటీ ప్రకారం 2027 సెప్టెంబర్‌లో జస్టిస్‌ బీవీ నాగరత్న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వీలుంది. 1989 అక్టోబర్‌ 6న జస్టిస్‌ ఎం.ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కగా, అక్కడి నుంచి చరిత్ర పుటల్లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి పేరు చేరడానికి 38 ఏళ్ల సమయం పడుతోంది. ఇప్పటివరకు జస్టిస్‌ సుజాతా వి.మనోహర్‌, జస్టిస్‌ రుమాపాల్‌, జస్టిస్‌ జ్ఞానసుధా మిశ్ర, జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌, జస్టిస్‌ ఆర్‌.బానుమతి, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలు మహిళా న్యాయమూర్తులుగా సేవలందించి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం జస్టిస్‌ ఇందిరా బెనర్జీ సిట్టింగ్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ముగ్గురు ఆ వరుసలో చేరారు.

 

సీజేఐ అయ్యే అవకాశం 8 మందికి….

ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి కాకుండా 32 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారు. ఇప్పుడున్న నిబంధనలు, సీనియారిటీ ప్రకారం ఇందులో 8 మందికి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆగస్టు 26న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఆ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వరుసగా సీనియారిటీ పరంగా ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, 16వ స్థానంలో ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, 17వ స్థానంలో ఉన్న జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌, 18వ స్థానంలో ఉన్న జస్టిస్‌ సూర్యకాంత్‌, 26వ స్థానంలో ఉన్న జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, 29వ స్థానంలో ఉన్న జస్టిస్‌ బీవీ నాగరత్న, 33వ స్థానంలో ఉన్న జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహలు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. 2027లో సుప్రీంకోర్టు నలుగురు ప్రధాన న్యాయమూర్తుల సేవలను అందుకొనే సూచనలున్నాయి. ప్రస్తుత న్యాయమూర్తుల్లో 23 మంది 50వ దశకంలో, 10 మంది 60వ దశకంలో జన్మించారు.

 

 

అభినందించిన న్యాయశాఖ మంత్రి నూతనంగా నియమితులైన సుప్రీంకోర్టు జడ్జీలను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అభినందించారు. వీరిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండడం చరిత్రాత్మకమని ట్వీట్‌ చేశారు.

 

తొలిసారిగా నలుగురు తెలుగు జడ్జీలు

తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన 15వ వ్యక్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, న్యాయమూర్తులు- జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి తెలుగువారు కాగా ఇప్పుడు జస్టిస్‌ శ్రీనరసింహ చేరికతో సిట్టింగ్‌ జడ్జీలుగా ఉన్న తెలుగువారి సంఖ్య నాలుగుకి చేరింది. ఇలా ఒకేసారి నలుగురు తెలుగువారు బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి. 2016-18 మధ్యకాలంలో ఇలా ముగ్గురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సేవలందించిన వారిలో జస్టిస్‌ కోకా సుబ్బారావు (ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు), జస్టిస్‌ పి.సత్యనారాయణరాజు, జస్టిస్‌ పి.జగన్‌మోహన్‌రెడ్డి, జస్టిస్‌ ఓ.చిన్నపరెడ్డి, జస్టిస్‌ కె.రామస్వామి, జస్టిస్‌ కె.జయచంద్రరెడ్డి, జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.జగన్నాథరావు, జస్టిస్‌ పి.వెంకటరామరెడ్డి, జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి, జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా సేవలందించిన తెలుగువారిలో ఇప్పటివరకు 11 మంది పదవీ విరమణ చేశారు.

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags: New Judges Acquired – New Record in Supreme Court History

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page