త్రిపురపై దీదీ కన్ను

0 8,562

కోల్ కత్తా ముచ్చట్లు:

 

 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మంచి దూకుడు మీద ఉన్నారు. ఈ ఊపుతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గద్దె దించేందుకు హస్తిన కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ఆమె చూపంతా జాతీయ రాజకీయాలపైన ఉంది. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి మోదీని అడ్డుకోవడమే ధ్యేయంగా మమతా బెనర్జీ పని చేస్తున్నారు. బెంగాలేతర రాష్టాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో భాజపాను మట్టి కరిపించాలన్న తలంపుతో ఉన్నారు. అదే సమయంలో పార్టీని విస్తరించాలని వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా బెంగాల్ కు సమీపంలో ఉన్న ఈశాన్య భారతంలోని త్రిపురపై దృష్టి కేంద్రీకరించారు.సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ముందు అంటే 2023 ఫిబ్రవరిలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా అన్ని అస్ర్త శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. త్రిపురలోని అధికార భాజపా, ప్రధాన విపక్షమైన సీపీఎం రెండూ మమతా బెనర్జీ పార్టీ అయిన టీఎంసీకి బద్ధ శత్రువులే. ఈ రెండు పార్టీలను దెబ్బతీయడం ఆమె లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. ప్రస్తుతం త్రిపురలో భాజపా ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ పాలన సాగిస్తున్నారు. 2018 ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు భాజపా 36, దాని మిత్ర పక్షం ఐపీఎఫ్ టీ (ఇండీజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) 8, సీపీఎం 16 సీట్లు సాధించాయి. కాంగ్రెస్ కు రిక్తహస్తమే ఎదురైంది. వాస్తవానికి టీఎంసీదే అదే పరిస్థితి. 24 చోట్ల పోటీచేసిన టీఎంసీ ఒక్క చోటా గెలవలేదు. ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం కేవలం 0.3 శాతం మాత్రమే. ఈ గణాంకాలు చూసినప్పుడు మమతా బెనర్జీ నేల విడిచి సాము చేస్తుందన్న అభిప్రాయం కలగక మానదు.
ఒక్క శాతం ఓట్లు కూడా సాధించని పార్టీ 43.59 శాతం ఓట్లు సాధించిన భాజపాను, 42.22 శాతం ఓట్ల శాతం గల సీపీఎం ను ఎలా నిలువరించగలదన్న సందేహం కలగక మానదు. కానీ మమతా బెనర్జీ లెక్కలు, అంచనాలు వేరే విధంగా ఉన్నాయి. భాజపాకు మిత్రపక్షమైన ఐపీఎఫ్ టీ తో ఇటీవల కాలంలో సరిపడటం లేదు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేసే పరిస్థితి లేనేలేదు. దాని వల్ల రెండు పార్టీలు దెబ్బతింటాయి. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇక జాతీయస్థాయిలో నిర్వీర్యమైన సీపీఎం ఇక్కడా చతికిల పడిందని, క్రమంగా భాజపా గ్రాఫ్ దిగజారుతుందని, హస్తం పార్టీకి అసలు అస్థిత్వమే లేదని, ఈ పరిస్థితుల్లో కష్టపడి పనిచేస్తే అగర్తల అధికార పీఠాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదని మమతా బెనర్జీ అంచనా. అందుకు త్రిపుర బాధ్యతను స్వయంగా తన మేనల్లుడు, లోక్ సభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి మమతా బెనర్జీ అప్పగించారు. ఆగస్టు 2న అగర్తలలో ఆయన పర్యటించిన తరవాత ఏడుగురు నాయకులు పార్టీలో చేరారు. వారిలో కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరికొందరు భాజపా, సీపీఎం శాసనసభ్యులు తమతో ‘టచ్’లో ఉన్నారని అయితే తాము తొందర పడదలచుకోలేదని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ విద్యామంత్రి బ్రత బసు, న్యాయ మంత్రి మోలో ఘటక్ , ఎంపీలు డెరెక్ ఒబ్రెయిన్ తదితరులు త్రిపురపైనే ద్రుష్టి కేంద్రీకరించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని ఓ బందం పార్టీకి గల అవకాశాలపై అధ్యయనం చేసేందుకు ఇటీవల అగర్తల వెళ్లగా కొవిడ్ నిబంధనలను  ఉల్లంఘించా రంటూ వారిని అరెస్టు చేశారు. అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పైనా దాడి జరిగింది. ఓటమి భయంతో కాషాయ సర్కారు ఇలా దుందుడుకు వ్యవహరిస్తోందని, తమ విజయానికి ఇదే సంకేతమని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. మున్ముందు ఏం జరుగుతందో చూడాలి.

 

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags:Didi eye on Tripura

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page