నిధులు వస్తున్నా… మారని నగరాలు

0 8,572

కరీంనగర్ ముచ్చట్లు:

 

కేంద్రంతో కొట్లాడి మరీ కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ప్రకటించుకున్నది రాష్ట్ర సర్కారు. అప్పటికే వరంగల్‌కు ఆ భాగ్యం దక్కింది. ప్రతీ ఏటా రూ. 100 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి నిధుల వరద వస్తుంది. అందులో ఇప్పటికే కొన్ని విడుదలయ్యాయి. ఖర్చు కూడా అయ్యాయి. ఐదేళ్ళ కాలం పూర్తయింది. కానీ ఈ నగరాలు ‘స్మార్ట్’గా తయారైందీ లేదు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వచ్చిందీ లేదు. వరద బాధ కూడా పోలేదు. గతేడాది కురిసిన వర్షాలకు వరంగల్ నగరం మునిగిపోయింది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ పట్టణం, ఆ జిల్లాలోని సిరిసిల్ల పట్టణం నీట మునిగాయి. స్మార్ట్ సిటీ కోసం పోటీ పడిన ప్రభుత్వం ఆ దిశగా అభివృద్ధి చేయడంలో మాత్రం వెనకబడింది. ఒకటి రెండు రోజుల వర్షానికే నీళ్ళు నిలిచిపోయి వరద నీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.కేంద్ర ప్రభుత్వం  కార్యక్రమం కింద కరీంనగర్ పట్టణానికి రూ. 60 కోట్లు, వరంగల్ పట్టణానికి రూ. 100 కోట్లను విడుదల చేసింది. ఆ పట్టణాల్లోని స్లమ్ ప్రాంతాల అభివృద్ధి కోసం కరీంనగర్‌కు రూ. 36.18 కోట్లు, వరంగల్ నగరానికి రూ. 81 కోట్లు కూడా విడుదలయ్యాయి. ఇంకా విడుదల చేయాల్సిన నిధులతో ఏమేం పనులు చేపట్టనున్నదీ ఆయా పట్టణాల మున్సిపల్ కార్పొరేషన్లు యాక్షన్ ప్లాన్ నివేదికను సమర్పించాయి. ఆ ప్రకారం వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ కింద రూ. 1544.35 కోట్లతో మొత్తం 65 పనులను, కరీంనగర్ పట్టణంలో రూ. 524 కోట్లతో 18 పనులను చేపట్టాల్సి ఉన్నది. ఇందులో వరంగల్‌లో 13 పనులకు రూ. 579 కోట్లు ఖర్చు కూడా అయ్యాయి.

 

 

 

- Advertisement -

కరీంనగర్‌లో ఏడు పనులకు రూ. 65.35 కోట్లు ఖర్చయ్యాయి.పది లక్షల జనాభాకంటే ఎక్కువ ఉండే వంద నగరాలను ఐదేళ్ళ కాలంలో ‘స్మార్ట్’గా తయారుచేసే ఉద్దేశంతో వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న సమయంలో అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమైన నగరాలను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణకు చెందిన హైదరాబాద్, వరంగల్ నగరాలు తొలుత ఎంపికయ్యాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్మార్ట్ సిటీ కార్యక్రమం కింద సంవత్సరానికి రూ. 100 కోట్ల చొప్పున వచ్చే నిధులు హైదరాబాద్ అభివృద్ధితో పోల్చుకుంటే పెద్ద మొత్తమేమీ కాదని, నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయమే ఐదారు వేల కోట్ల రూపాయలకంటే ఎక్కువ ఉంటుందని వివరించిన రాష్ట్ర సర్కారు దీని స్థానంలో కరీంనగర్‌ను ఎంపిక చేయాల్సిందిగా ప్రతిపాదించింది. అప్పటికి కరీంనగర్ జనాభా పది లక్షలు దాటకపోవడంతో శివారు ప్రాంతాలన్నింటినీ కలిపి చూపించి స్మార్ట్ సిటీ గుర్తింపును దక్కించుకున్నది.స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా ఎంపికైన తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులతో ప్రజలకు కనీస సౌకర్యాలను మెరుగుపర్చడం ప్రధాన ఉద్దేశం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నామమాత్రంగా యూజర్ ఛార్జీలను తీసుకుని ఈ సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది. దీర్ఘకాలం పాటు మనుగడ సాగించేందుకు ఆయా సౌకర్యాలకు అనుగుణంగా ప్రజల నుంచి ఈ ఛార్జీలను వసూలు చేయాలని నిర్దేశించింది. మంచి రోడ్లు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఉచిత వై-ఫై సౌకర్యం, బస్ స్టేషన్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ప్రజలకు ఉల్లాసం కలిగించేలా ఆహ్లాదకరమైన పచ్చదనం, పార్కుల అభివృద్ధి, సైకిల్ ట్రాక్.. ఇలా అనేకం ఉన్నాయి.

 

 

 

 

ఇక డిజిటల్ పరిజ్ఞానంలోనే బిల్లుల చెల్లింపు, సర్టిఫికెట్ల జారీ లాంటివి కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగం. కానీ మౌలిక సౌకర్యాలు కూడా తీరలేదు.ఒక్క రోజు కురిసన వర్షాలకే కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీల్లో రోడ్లు జలమయమవుతున్నాయి. రోడ్లు గుంతలమయం అవుతున్నాయి. కొత్త రోడ్లు వేసినా నాలుగైదు నెలలకే మళ్ళీ ఖరాబవుతున్నాయి. రోడ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. టెండర్ల ద్వారా రోడ్ల నిర్మాణం పనులు ఎవరికిస్తున్నారో, దానికి ప్రాతిపదిక ఏంటో, అవి తక్కువ కాలంలోనే చెడిపోతే సంబంధిత కాంట్రాక్టు సంస్థకు జవాబుదారీతనం లేకపోవడం.. ఇవన్నీ అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. గట్టిగా గంటపాటు వర్షం కురిస్తే వరద నీరు పోయే మార్గం లేదు. రోడ్డు మీద ఎక్కడ గుంత ఉందో తెలియక బైక్‌ల మీద ప్రయాణించేవారు కింద పడుతున్నారు. మోకాలోతు గుంతలు నిత్యకృత్యం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద వచ్చి నిధులు ఏమయ్యాయనేది చర్చనీయాంశం.

 

 

 

కరీంనగర్ స్మార్ట్ సిటీ :
విడుదలైన నిధులు : రూ. 60 కోట్లు
స్లమ్ డెవలప్‌మెంట్ కోసం రూ. 36.18 కోట్లు
అభివృద్ధి ప్రణాళిక వ్యయం : రూ. 524 కోట్లు
వర్క్ ఆర్డర్లు ఇచ్చింది : 11 పనులకు రూ. 458.85 కోట్లు
పనులు పూర్తయినవి : 7 పనులు, రూ. 65.35 కోట్లు
వరంగల్ స్మార్ట్ సిటీ :
విడుదలైన నిధులు : రూ. 100 కోట్లు
స్లమ్ డెవలప్‌మెంట్ కోసం : రూ. 81 కోట్లు
అభివృద్ధి ప్రణాళిక వ్యయం : రూ. 1544.35 కోట్లు
వర్క్ ఆర్డర్లు ఇచ్చింది : 36 పనులకు రూ. 555.17 కోట్లు
పనులు పూర్తయినవి : 13 పనులు, రూ. 579.71 కోట్లు
ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నవి : 16 పనులు, రూ. 409.47 కోట్లు

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Funds are coming … cities that have not changed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page