కనీస వేతనంలో సగమే

0 8,480

మహబూబ్ నగర్ ముచ్చట్లు:
పెద్దపెద్ద బాయిలర్ల వద్ద ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ముడి ఇనుమును కరగబోయటం…యాసిడ్‌తో కూడిన పాత బ్యాటరీలను పగలగొట్టి లెడ్‌ వేరు చేయడం…పాత ఇనుపసామాను మధ్యలో తిరగాడుతూ పనిచేయడం…ప్రమాదకర రసాయనాలతో బట్టలకు రంగులద్దడం..ఇవన్నీ అత్యంత కష్టమైన, ప్రమాదకర పనులే. ఒక సీకు బయటకు రావాలన్నా..కొత్త బ్యాటరీ తయారు కావాలన్నా… ఇంట్లో వాడుకునే వంట సామాగ్రి మన చెంతకు చేరాలన్నా..బట్టలు కట్టుకోవాలన్నా ఆ కార్మికులంతా రెక్కల కష్టాన్ని ధారబోయాల్సిందే. కొత్తూరు పారిశ్రామిక వాడలో యాజమాన్యాలకు లాభాలు గడించి పెడుతున్న ఈ పరిశ్రమల్లో కార్మికులు మాత్రం శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కనీస వేతనం దేవుడెరుగు అందులో సగం దక్కితే ఒట్టు. కొత్తూరు క్లస్టర్‌లోని పరిశ్రమల్లో యూనియన్లు పెట్టుకునే అవకాశమే లేదు. కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కార్మిక శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.కొత్తూరు పారిశ్రామిక క్లస్టర్‌లో రిజిష్ట్రరైన పరిశ్రమలు 213కిపైగా ఉన్నాయి. 165 వరకు పనిలో ఉన్నాయి. అందులో ఎక్కువగా స్టీల్‌ సామాన్లు(వంటసామాగ్రి), కుర్‌కురే, బిస్కెట్లు, ప్లాస్టిక్‌, టెక్స్‌టైల్‌, ఫార్మా, గోధుమపిండి, బ్యాటరీలు, సబ్బులు, ఫార్మా, తదితరాల తయారీ పరిశ్రమలున్నాయి.

ఒక్కో దాంట్లో 50 నుంచి 600 మంది దాకా ఉన్నారు. ఆ క్లస్టర్‌లో ఏడెనిమిది వేల మంది కార్మికులు పనిచేస్తుంటే అందులో నూటికి 90 శాతానికిపైగా మంది వలస కార్మికులే. ఆ పరిశ్రమల ముందు కనీసం బోర్డులు కూడా లేవు. గేటు ముందు మాత్రం సెక్యూరిటీ బందోబస్తు మస్తుగుంది. లోనికెళ్లి చూస్తేగానీ ఇది స్టీల్‌ పరిశ్రమా? ఇది బ్యాటరీల కంపెనీనా? అని అర్థం కాని పరిస్థితి. ”మీకు వేతనాలు సరిగా ఇస్తున్నారా? సౌకర్యాలున్నాయా? మీరు పడుతున్న ఇబ్బందులేంటీ?” అని గుచ్చిగుచ్చి అడిగినా తమకున్న ఈ చిన్న ఉపాధి అవకాశం ఎక్కడ ఊడిపోతుందో అన్న భయంతో కార్మికులు వెనకడుగు వేస్తున్న దుస్థితి. పరిశ్రమలో తమ హక్కుల కోసం కనీసం యూనియన్లు పెట్టుకునే అవకాశం అక్కడ లేదంటే అక్కడ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఐరన్‌, స్టీల్‌, బ్యాటరీ, లెడ్‌ తయారీ పరిశ్రమల్లో పెద్దపెద్ద బాయిలర్ల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకుండానే యాజమాన్యాలు కార్మికులతో పనిచేయిస్తున్నాయి. బ్యాటరీలను గొడ్డళ్లతో పగులగొడుతున్నారు. కండ్లకు రక్షణ కవచాలు కనిపించలేదు.

 

- Advertisement -

బ్యాటరీ మూతలు ఊడగొట్టే సమయంలో అందులో నుంచి యాసిడ్‌ చిల్లి పడుతున్నది. గొడ్డలి జారి పక్కకుపోతున్నది. ఆ సమయంలో గాయపడ్డా, చనిపోయినా యాజమాన్యాలకు పట్టదు. ‘ఇక్కడ కార్మికుడు చనిపోయినా యజమానులు పట్టించుకోరు. ప్రశ్నించొద్దు. ఎవరి పని వాళ్లు చేసుకోవాల్సిందే. లేకుంటే పనిలో నుంచి తీసేస్తరు. కేసులు పెట్టి వేధిస్తారు. మాదేమో ఈ రాష్ట్రం కాదు. నోరు మూసుకుని పనిచేయాల్సిందే’ అని వాపోయాడు. పని ప్రదేశాల్లో అలసట చెందిన సమయంలో కార్మికులు కూర్చునే వెసులుబాటు కూడా లేదు. చూద్దామన్నా పనిప్రదేశాల్లో కుర్చీ కనిపించలేదు. స్టీల్‌, ఐరన్‌ కంపెనీల్లో స్క్రాప్‌ అంతా అడ్డదిడ్డంగా పడేసి ఉంది. అందులో నుంచే కార్మికులు అటూఇటూ తిరుగుతున్నారు. వారికి కనీసం బూట్లు కూడా లేవు. ఈ క్రమంలో ఐరన్‌, స్టీల్‌ ముక్కలు కోసుకుని కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గాయపడితే వైద్య ఖర్చులు కార్మికుడే భరించాలి. ఇటు ఉపాధి పోయి, అటు వైద్య ఖర్చులు భరించలేక కుటుంబాలు అప్పులపాలవుతున్న దుస్థితివలసకార్మికులను మధ్యవర్తులు కొత్తూరుకు తీసుకొస్తున్నారు. వారికి నెల జీతాలివ్వకుండా రోజువారీగా ఇస్తున్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు లేవు. కొన్ని పరిశ్రమల్లో కార్మికుల వేతనాల నుంచి యాజమాన్యాలు పీఎఫ్‌ కట్‌ చేస్తున్నా జమచేయడం లేదని విమర్శలున్నాయి. చాలా వరకు పరిశ్రమల్లోనే రేకులతో బాత్‌రూమ్‌ల సైజులో రూములు నిర్మించి వాటిలో కార్మికులను కుక్కి ఉంచుతున్న పరిస్థితి. అవి పందుల దొడ్లను తలపిస్తున్నాయి. అందులో కనీససౌకర్యాల ఊసేలేదు. అక్కడకు బయటవారినెవ్వరినీ యాజమాన్యాలు పోనివ్వట్లేదు. కొందరు వలస కార్మికులు కిరాయి ఇండ్లలో ఉంటున్నారు.

 

బాత్‌రూమ్‌ సైజు కంటే కొంచెం పెద్దగున్న ఒక్కో రూముకు రూ. 2 వేల నుంచి 3 వేల అద్దె చెల్లిస్తున్నారు. అక్కడా అరకొర సౌకర్యాలే. అందులో నలుగురు నుంచి ఐదుగురు ఉంటున్న పరిస్థితి. మూడు, నాలుగు కార్మిక వాడల్లో పరిశీలించగా అన్ని చోట్లా సామూహిక మరుగుదొడ్లే వాడుతున్న పరిస్థితి. 15 నుంచి 20 మందికి ఒక బాత్‌రూమ్‌ ఉంది.కొత్తూరు క్లస్టర్ల పరిధిలో ఒకటెండ్రు పరిశ్రమల్లో మినహా మిగతా వాటిలో భూతద్ధం పెట్టి వెతికినా కనీస వేతనాల జాడ కానరాలేదు. కనీస వేతనాలను నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, తల్లిదండ్రుల బాగోగులు, తిండీబట్టా తదితరాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాలి. ఈ లెక్కన ఒక కార్మికుడు తన కుటుంబాన్ని పోషించాలంటే కనీస వేతనం రూ.26 వేలు ఉండాలి. దాన్ని డాక్టర్‌ అక్ట్రారు ఫార్ములా ప్రకారం లెక్కించే పరిస్థితి ఇక్కడ లేదు. సుప్రీం కోర్టు కూడా కనీస వేతనాలివ్వకపోతే పరిశ్రమను మూసేయాలని సూచించింది. ‘మా పోరడు చిన్నగున్నప్పుడే నా పెనిమిటి చనిపోయిండు. కాయకష్టం చేసుకుంట బతుకుతున్న. గీ గిన్నెల కంపెనీల చేస్తే రోజుకు 300 ఇస్తరు బిడ్డ. ఓటీ చేస్తే గంటకు 30 రూపాయలిస్తరు. మాల్‌ను బట్టి గంట నుంచి రెండున్నర గంటల ఓటీ దొరుకుతది. జర రెండు గంటలు కష్టపడితే ఆటోకిరాయిలు, ఇంట్ల కూరగాయల ఖర్చులెల్తయని ఓటీ చేస్త. ఆదివారం రాకుంటే రూ.300 కట్‌చేస్తరు. ఇంటికాడుంటే ఏమొస్తది. కొడుకు పెండ్లిడీకొచ్చిండు. ఆడ్ని ఇంటోన్ని చేసి మనువళ్లు, మనువరాళ్లకు మంచిగ చూసుకోవాలనే గీ కష్టం బిడ్డా’ అని నందిగామకు చెందిన కృష్ణమ్మ అనే కార్మికురాలు ఓ వైపు పనిచేస్తూనే తనకు దక్కుతున్న అరకొర వేతనం, బతుకు చిత్రం గురించి చెప్పేసింది..

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Half of the minimum wage

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page