ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు బాలారిష్టాలు

0 8,460

వ‌రంగ‌ల్  ముచ్చట్లు:

ప్ర‌భుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు బాలారిష్టాలు తప్పేలా లేవు. భౌతిక, సాంకేతిక, కోవిడ్‌ పరిస్థితులే ఇందుకు కారణం కానున్నాయి. దీంతో ఉపాధ్యాయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు స్కూళ్లు క్వారంటైన్‌ కేంద్రాలుగా మారిపోయాయి. డిజిటల్‌ తరగతులు నిర్వహించాలనే తలంపు మంచిదే అయినా, అందుకు తగ్గ పరిస్థితులను సృష్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ క్లాసులు తరగతి గదికి ప్రత్యామ్నాయం కాకపోయినా, ప్రయివేటు విద్యార్థులతో పొల్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు వెనుకపడకూడదనే ఉద్దేశ్యంతో ఆన్‌లైన్‌ క్లాసులకు సర్కారు శ్రీకారం చుడుతున్నది. ఈ నేపథ్యంలో తరగతులకు సంబంధించి సర్కారు నోటిఫికేషన్లు, జీవోలు, షెడ్యూల్‌ విడుదల చేయడం మినహా , వాటి నిర్వహణకు అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ పాఠశాలను వేధిస్తున్న రవాణా, తాగునీటి, పారిశధ్య సమస్యలను పరిష్కరించడంలో సర్కారు చొరవ చూపలేదు. ఈతరుణంలో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

- Advertisement -

దూరదర్శన్‌, టీ-శాట్‌ ద్వారా తరగతులు చేపట్టాలని భావించినప్పటికి, కేబుల్‌ చానళ్ల సహకారం ఆశించినంతగా లేకపోవడంతో వాటిపై చర్యలకు సర్కారు సమాయత్తమవుతున్నది. ప్రసారాల ద్వారా పాఠాలు అందించని కేబుల్‌ టీవీలపై కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలంటూ టీశాట్‌ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది.రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు కలిపి మొత్తం 29,500 ఉన్నాయి. ఇందులో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 4.50 లక్షలు, పాఠశాల విద్యాశాఖ కింద 23 లక్షల మంది ఉన్నారు. వీరి కోసం ఇప్పటివరకు 70 శాతం పుస్తకాలు స్కూళ్లకు చేరాయి. కమ్యూనికేషన్‌ అందుబాటులో లేని పిల్లలకు స్వయంగా పుస్తకాలు చేరవేయాలని టీచర్లను ప్రభుత్వం ఆదేశించింది. మిగతా విద్యార్థులకు స్కూళ్లకు పిలిచి పుస్తకాలు అందించాలని సూచించింది. సుమారు 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు.రాష్ట్రంలో గత మార్చి నుంచి కోవిడ్‌-19 తీవ్రంగానే ఉన్నది. శనివారం వరకు దాదాపు 1.20 లక్షల కేసులు వచ్చాయి. సుమారు 808 మంది చనిపోయారు. అందులో ఉపాధ్యాయులూ ఉన్నారు. కాగా సెప్టెంబరు ఒకటి నుంచి జరిగే ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ కోసం సమాయత్తం కావడానికి ఈనెల 27 నుంచే టీచర్లు పాఠశాలలకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్‌, వికారాబాద్‌, వనపర్తి జిల్లాల్లో కొన్ని పాఠశాల్లోని టీచర్లకు పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌ కేంద్రాలుగా మారిపోయాయి. ఈనేపథ్యంలో ఉపాధ్యాయుల్లో భయాందోళన నెలకొన్నట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అంతేగాక ఇప్పుడు ఆర్టీసీ బస్సు సర్వీసులు, హైదరాబాద్‌లో మెట్రో కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సీటీ సర్వీసులు నడవని సంగతి తెలిసిందే. పిల్లలకు పాఠాలు చెప్పడానికి అభ్యంతరం లేదనీ, పాఠశాలల్లో మౌళిక సదుపాయాలతోపాటు రవాణాపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.కరోనా వైరస్‌ నేపథ్యంలో పాఠశాలల్లో భౌతిక పరిస్థితులు సున్నితంగా తయారయ్యాయి.

 

గతంలో తాగునీరు, బాత్‌రూమ్‌ల సంగతీ ఎలా ఉన్నా సర్దుకున్నామనీ, ఇప్పటి కోవిడ్‌ పరిస్థితుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. వైరస్‌ కారణంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు చేతులెత్తాయి. తామేమి చేయలేమనీ, నిధుల కొరత ఉందని అంటున్నాయి. సాధారణంగా ప్రతియేటా విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా స్కూళ్లకు రూ. 15 వేల నుంచి రూ.లక్ష వరకు నిర్వహణా నిధులు వస్తాయి. ఈ ఏడాదికి సంబంధించి సర్కారు నుంచి ఎలాంటి ప్రస్తావనా రాలేదు. కోవిడ్‌ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన తరుణంలో నిధుల్లేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రస్తుతం స్కూళ్లల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగానే ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో బోర్లు చెడిపోయాయి. మిషన్‌ భగీరథ తాగునీటి కనెక్షన్లు పూర్తిస్థాయిలో బిగించలేదు. బాత్‌రూమ్‌కు వెళ్లడానికి మహిళా టీచర్లు ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు.డిజిటల్‌ తరగతుల నిర్వహణకు సాంకేతికాంశాలు సైతం అడ్డంకిగా మారాయి. టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా ప్రసారాలు చేస్తున్నా, వాటిని కేబుల్‌ టీవీలు కిందిస్థాయిలోకి తీసుకేళ్లెందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని టీ-శాట్‌ విద్యాశాఖ అధికారులు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు, ప్రధానోపాధ్యాయులకు సూచించింది. దీనిపై కచ్చితంగా ప్రసారాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా, ఏమేరకు అమలవుతుందనేది సెప్టెంబరు ఒకటిన తేలనుంది. ఇకపోతే అనధికారిక సమాచారం ప్రకారం టీవీలు అందరికి అందుబాటులో లేవు. సుమారు 85 శాతం మందికే ఇవి ఉన్నట్టు సమాచారం. మరో 15 శాతం మంది పిల్లలకు టీవీల్లేవు. వీరిని పక్కింట్లోనో, గ్రామపంచాయతీలోనో క్లాసులు వినేలా ప్రొత్సహించాలని సర్కారు చెబుతున్నది. కరోనా కారణంగా ఇది సాధ్యమా ? అని టీచర్లతోపాటు వారి సంఘాలూ ప్రశ్నిస్తున్నాయి. అంతేగాక కేబుల్‌ ఉంటేనే టీ-శాట్‌, దూరదర్శన్‌ ప్రసారాలు వస్తాయి. డీటీహెచ్‌ కనెక్షన్‌ ఉంటే రావడం లేదు. ఒక్క ఎయిర్‌టెల్‌ మినహా టాటా స్కై, డిష్‌టీవీ కనెక్షన్లున్నవారికి ఈ ప్రసారాలు అందవనీ ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Boycotts for conducting online classes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page