కాంగ్రెస్ లో శశిధరూర్ రచ్చ

0 9,705

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఢిల్లీస్థాయి నాయకులు హైదరాబాద్‌ వస్తుంటే ఇన్నాళ్లూ బీజేపీ నాయకులు టెన్షన్‌ పడేవారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతల వంతు వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో యుద్ధం చేస్తున్న సమయంలో హస్తిన నుంచి వచ్చి ప్రశంసలు కురిపించడం స్థానిక నేతలకు చిర్రెత్తికొస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి గొడవే హైకమాండ్‌ వరకు చేరి పెద్ద చర్చగా మారి.. రచ్చ రచ్చ అవుతోంది.తెలంగాణలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి. రాష్ట్ర బీజేపీ నేతలు trsని టార్గెట్‌ చేస్తే.. కేంద్రమంత్రులు వచ్చి రాష్ట్ర సర్కార్‌ను ప్రశంసిస్తారు. ఇది కమలనాథులకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు బీజేపీకే కాదు.. కాంగ్రెస్‌కు కూడా తలనొప్పి వచ్చి పడింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్‌ నేత శశిథరూర్.. ఐటీ రంగంలో హైదరాబాద్‌ని మంత్రి కేటీఆర్ గుర్రం మాదిరి పరుగులు పెట్టిస్తున్నారని కామెంట్ చేశారు. పార్లమెంట్‌ స్థాయి సంఘం ఛైర్మన్‌ హోదాలో ఆయన వచ్చినా.. అవి కాంగ్రెస్‌ నేత చేసిన కామెంట్స్‌గానే జనాల్లోకి వెళ్లడంతో పెద్ద పంచాయితీకి దారితీశాయి.టీఆర్ఎస్‌పై ఒంటికాలిపై లేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి.. శశిథరూర్‌ కామెంట్స్‌ మంట పుట్టించాయి. కేటీఆర్ గుర్రమో కాదో కానీ.. శశిథరూర్‌ మాత్రం గాడిదే అని.. ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపాలని రేవంత్‌ మండిపడ్డారు.

 

 

- Advertisement -

రేవంత్‌ చేసిన ఈ కామెంట్స్‌కు సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాలో రావడంతో రచ్చ మొదలైంది. ఇది శశిథరూర్‌తోపాటు హైకమాండ్‌ దృష్టికి వెళ్లడంతో పరిస్థితి వేడెక్కింది. ప్రైవేట్‌ చిట్‌చాట్‌లో జరిగిన సంభాషణపై శశిథరూర్‌కు ఫోన్‌ చేసి క్షమాపణ చెప్పారు రేవంత్‌. దీంతో కాంగ్రెస్‌లో ఈ గొడవ సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో రేవంత్‌కు వ్యతిరేకంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి ఆజ్యం పోశారు. శశిథరూర్‌ను అలా ఎలా అంటారని ఫైర్‌ అయ్యారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ మాత్రం మీడియా తీరును తప్పుపట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీలకంగా మారిన రేవంత్‌ మాత్రం.. పార్టీ పెద్దలకు తెలంగాణలో ఏం జరుగుతుందో.. ఏం జరిగిందో చెప్పే పనిలో ఉన్నారట.

 

 

తెలంగాణలో ఐటీ డెవలప్‌మెంట్‌కు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని.. దాన్ని కొనసాగిస్తున్నారే తప్ప.. కేటీఆర్‌  కొత్తగా చేసిందేం లేదన్నది పీసీసీ అభిప్రాయం. కానీ శశిథరూర్ వచ్చి కేటీఆర్‌ను ప్రశంసించి వెళ్లారు. వాస్తవానికి ఆయన తెలంగాణకు వస్తున్న లేదా వచ్చిన సమాచారం పీసీసీకి లేదట. పైగా టీఆర్‌ఎస్‌తో ఫైట్‌ చేస్తున్న సమయంలో శశిథరూర్‌ చేసిన కామెంట్స్‌ కాంగ్రెస్‌ నేతలను ఇరకాటంలో పడేశాయి. దీనిపైనే రేవంత్‌ అండ్‌ టీమ్‌ ఆగ్రహంతో ఉందట.శశిథరూర్ ఇక్కడికి వచ్చి అధికారపార్టీని ఎందుకు పొగిడారు అనేది కాంగ్రెస్‌ నేతల ప్రశ్న. లోగుట్టు ఏదైనా ఉందా..? ఉద్దేశపూర్వకంగా కామెంట్ చేశారా? అనేదానిపై ఆరా తీస్తున్నారట. మొత్తానికి అటు బీజేపీ..ఇటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాలకు జాతీయ నాయకులు పెద్ద తలనొప్పులే తీసుకొస్తున్నారు. మరి.. ఈ రచ్చ నుంచి రేవంత్‌ ఎలా బయట పడతారో చూడాలి.

 

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Shashidharur bustle in Congress

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page