పరాకాష్టకు ఓటుబ్యాంకు రాజకీయాలు

0 8,458

న్యూఢిల్లీ   ముచ్చట్లు:

దేశంలో ఓటుబ్యాంకు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. మరికొద్దినెలల్లో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కుల సమీకరణాలకు పెద్దపీట వేస్తున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ నుంచి తాజాగా చోటుచేసుకున్న గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మార్పు వరకు సామాజిక సమీకరణాలు, ఓటుబ్యాంకు రాజకీయాలే ప్రధాన పాత్ర పోషించాయి. కులాల ఓట్లను ఆకట్టుకోవడం కోసం ఎన్నికల వేళ ఇచ్చే హామీల కంటే ముందే ప్రాధాన్యతనిచ్చి నిరూపించుకోవాలని రాజకీయ పార్టీలు తాపత్రయపడుతున్నాయి.పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీని ఎంపిక చేయడానికి ముందు నుంచే దళిత రాజకీయం ఊపందుకుంది. దాదాపు 32 శాతం దళిత జనాభాతో దేశంలోనే అత్యధిక దళిత జనాభా కల్గిన రాష్ట్రం పంజాబ్. రాజకీయాల్లో మాత్రం జాట్ సిక్కులదే ఆధిపత్యం. సంఖ్యాపరంగానూ దళితుల తర్వాత స్థానంలో జాట్ సిక్కులున్నారు. తాజాగా జరిగిన ముఖ్యమంత్రి మార్పు వెనుక పార్టీ అంతర్గత విబేధాలు, వర్గ పోరు ప్రధాన కారణంగా కనిపిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దళిత ఓటుబ్యాంకును టార్గెట్ చేసింది. పీసీసీ పగ్గాలను జాట్ సిక్కు నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు అప్పగించడం, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని దళిత సిక్కు నేత చరణ్‌జీత్ సింగ్ చన్నీకి కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలోని రెండు ప్రధాన సామాజికవర్గాలు జాట్, దళిత ఓట్లను సమీకరించుకునే ప్రయత్నం చేస్తోంది. తద్వారా మరోసారి గెలుపొంది, అధికారాన్ని చేజారకుండా చూసుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అందుకే పంజాబ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిని తామే అందించామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

 

- Advertisement -

కాంగ్రెస్ అధిష్టానం దళిత ఓటుబ్యాంకుపై గురిపెట్టడానికి ప్రధాన కారణం తమ రాజకీయ ప్రత్యర్థి పార్టీ శిరోమణి అకాళీదళ్, దళితుల్లో పట్టున్న ‘బహజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)’తో జట్టు కట్టడమే. రాష్ట్ర జనాభాలో సిక్కు, హిందువుల్లో కలిపి దాదాపు 32 శాతం వరకు దళితులుంటే, జలంధర్, హోషియార్‌పూర్, నవన్‌షహర్, కపుర్తలా జిల్లాలతో కలిసిన దోబా ప్రాంతంలో దళిత జనాభా 38 శాతం ఉంది. బీఎస్పీతో పొత్తు కారణంగా ఈ ఓటుబ్యాంకు ప్రత్యుర్థులపరమైతే మరోసారి అధికారం చేపట్టడం కష్టమని కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేస్తోంది. మరోవైపు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నానాటికీ బలపడుతూ అన్నివర్గాలతో పాటు దళితుల్లోనూ పట్టు పెంచుకుంటోంది. అందుకే కాంగ్రెస్ దళిత సీఎం అస్త్రాన్ని బయటకు తీసింది.గుజరాత్ ముఖ్యమంత్రి మార్పు వెనుక కూడా సామాజిక సమీకరణాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ ఈ మధ్య అనుసరించిన విధానాలకు భిన్నంగా గుజరాత్‌లో వ్యవహరించింది. హరియాణా సహా పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసినప్పుడు, ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శించే వర్గాలను పక్కనపెట్టి, ఇతర వర్గాలకు చెందిన నేతలకు అవకాశం కల్పించింది. గుజరాత్‌లో పాటిదార్ సామాజికవర్గమే రాజకీయంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. నరేంద్ర మోదీ కంటే ముందు ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్, మోదీ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనంది బెన్ పటేల్ వరకు ఆ రాష్ట్రంలో పాటిదార్ వర్గానిదే ఆధిపత్యం. కేవలం బీజేపీలోనే కాదు, అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లోనూ ఇదే వర్గం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ పరిస్థితుల్లో మోదీ పాటిదార్‌యేతర సామాజికవర్గానికి చెందిన విజయ్ రూపానీకి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధిష్టానం అవకాశం కల్పించింది.

 

రూపానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2017 అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎదుర్కొంది. అప్పటికే తమకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో పాటిదార్లు పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమం నుంచే హార్దిక్ పటేల్ వంటి యువనేత పుట్టుకొచ్చి, బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. అప్పటివరకు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచిన పాటిదార్లలో చీలక మొదలైంది. పూర్తిగా బీజేపీకి దూరం కాకపోయినా, చీలిక కారణంగా చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బొటాబొటీ మెజారిటీతో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకుంది. కానీ ఈసారి పాటిదార్ల మద్ధతు లేకుండా గెలిచే పరిస్థితి లేదని అధిష్టానం గ్రహించింది. పైగా కోవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో పరిస్థితులు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా పార్టీ ప్రతిష్టను, మోదీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశాయి. దీంతో ముఖ్యమంత్రిని మార్చి, పాటిదార్ వర్గానికి పగ్గాలు అప్పగించడం ద్వారా బీజేపీ ఆ వర్గంలో పట్టు నిలబెట్టుకోవాలని చూస్తోంది.మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్‌ను అధిష్టానం అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. పాలనానుభవం పెద్దగా లేకపోయినా, పాటిదార్లలో గట్టి పట్టున్న నేత కావడమే భూపేంద్ర పటేల్ ప్రధాన అర్హతగా మారింది. పాటిదార్ సామాజికవర్గానికి చెందిన ధార్మిక, సామాజిక సంస్థలు ‘సర్థార్ ధామ్’, ‘విశ్వ ఉమియా ఫౌండేషన్’కు భూపేంద్ర పటేల్ ట్రస్టీగా ఉండడం, తద్వారా ఆ వర్గంలో అందరికీ సుపరిచితుడు, గట్టి పట్టున్నవాడు కావడంతో అధిష్టానం ఆయన్ను ఎంపిక చేసింది. తద్వారా సంఖ్యాపరంగానూ బలమైన పాటిదార్ వర్గం ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.యూపీని గెలిస్తే దేశాన్ని గెలవొచ్చు అన్నది దేశ రాజకీయాల్లో చాలాకాలంగా కొనసాగుతున్న నానుడి. 2017 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ, ఇప్పుడు ఆధిక్యం తగ్గినా అధికారం చేజారకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. యూపీలో కులాలవారిగా రాజకీయ పార్టీలున్నాయి.

 

సమాజ్‌వాదీ పార్టీ ఓబీసీ (యాదవ)-ముస్లిం కాంబినేషన్‌ ఆధారంగా రాజకీయం చేస్తుంటే, దళిత రాజకీయాల కోసమే బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడింది. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ వారసులు నడుపుతున్న ‘రాష్ట్రీయ లోక్‌దళ్’ జాట్ల పార్టీగా పేరు తెచ్చుకుంది. అప్నాదళ్ సహా ఆ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక కులం, సామాజికవర్గంతో సంబంధం ఉంది. అయితే కేవలం ఏ ఒక్క సామాజిక వర్గం ఓట్లతోనే అధికారం చేపట్టడం అసాధ్యం. అందుకే గతంలో దళితులు-బ్రాహ్మణుల ఓట్లను ఏకం చేసి అధికారాన్ని చేపట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, మరోసారి ఆ కాంబినేషన్‌ను తెరపైకి తెచ్చింది. మరోవైపు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ పేరుతో రాజకీయ ప్రవేశం చేయడంతో ఆ రాష్ట్రంలో దళిత రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో దళితులను కూర్చోబెట్టామని చెప్పుకోవడంతో పాటు, దళితుల ఓట్ల కోసం అధికార బీజేపీ కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇటు దళితుల్లో, అటు ఓబీసీలలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలను మరోవైపు ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏకంగా 27 మంది ఓబీసీలకు చోటు కల్పించడం ద్వారా ఆ వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న సంకేతాలు పంపించింది. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువున్న ఓబీసీల్లో పట్టు సాధిస్తే గెలుపు సునాయసమని భావిస్తోంది. అందుకే బీజేపీ ఓబీసీ మోర్చా సహా ఇతర అనుబంధ విభాగాలన్నీ ఓటుబ్యాంకును సమీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇలా మొత్తానికి దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సామాజిక సమీకరణాల లెక్కలు వేస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. సంఖ్యాపరంగా బలంగా ఉన్న కులాలకు అధిక ప్రాధాన్యతిస్తూ గెలుపు మంత్రం జపిస్తున్నాయి.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:Autobank politics to the climax

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page