హుస్సేన్‌సాగర్ సుందరీకరణ పనులకు శ్రీకారం

0 9,689

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

హెచ్‌ఎండిఏ మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనుంది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పలు పనులకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే అభివృద్ధి పనులు పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు భారీ ఆకాశ మార్గాలతో పాటు హుస్సేన్‌సాగర్ సుందరీకరణ పనులు చేపట్టాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారనుంది. హుస్సేన్‌సాగర్ చుట్టూ చేపట్టే సుందరీకరణ పనులకు సుమారు రూ.2వేల కోట్లు, డబుల్ డెక్కర్ స్కైవేల నిర్మాణానికి సుమారుగా రూ. 5 వేల కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి హెచ్‌ఎండిఏ అధికారులు ప్రభుత్వానికి పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారని, సిఎం కెసిఆర్ ఆమోదం అనంతరం టెండర్లను పిలవనున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే నాలుగైదు సంస్థలు వీటికి సంబంధించిన డిజైన్లు రూపొందించినట్టుగా తెలిసింది. హుస్సేన్‌సాగర్ సుందరీకరణలో భాగంగా సింగపూర్ తరహాలో వాటర్ అక్వేరియాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు సాగర్ చుట్టూ రోప్‌లను నిర్మించనున్నారు.ఈ రోప్‌వే బుద్ధభవన్ నుంచి ప్రారంభమై సాగర్ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించేలా తీర్చిదిద్దనున్నారు. ట్యాంక్‌బండ్ వెంట నడిచేలా పార్కులను, సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. హుస్సేన్‌సాగర్ పైన కట్టెలతో వంతెనలను ఏర్పాటు చేయడంతో పాటు 10 ఎకరాల్లో లేక్ వ్యూను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండిఏ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే సంజీవయ్యపార్కు, ఎన్టీఆర్ పార్కు, బుద్ధభవన్, పివి ఘాట్ తదితర వాటిని ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునేలా హెచ్‌ఎండిఏ గతంలో తీర్చిదిద్దింది. రానున్న రోజుల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని సాగర్‌కు దగ్గరలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు సైతం ప్రారంభమయ్యాయి.

 

 

 

 

- Advertisement -

ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రపంచ పర్యాటకులకు హైదరాబాద్ మరింత దగ్గర అవుతుందని హెచ్‌ఎండిఏ భావిస్తోంది.2024 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీ ప్లస్2 పద్ధతిలో రోడ్డు, ఫ్లైఓవర్‌కమ్ మెట్రో కారిడార్‌తో కూడిన డబుల్ డెక్కర్ స్కైవేల నిర్మాణానికి హెచ్‌ఎండిఏ ప్రణాళికలు రూపొందించింది. జూబ్లీ బస్టాండ్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి కొంపల్లి ఆర్వోబి వరకు స్కైవేల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. జేబీఎస్ టు శామీర్‌పేట స్కైవేకు సంబంధించి డిటైల్డ్ పాజెక్టు రిపోర్టు (డిపిఆర్) ఇప్పటికే సిద్ధం కాగా, మరో స్కైవే నిర్మాణానికి కన్సల్టెన్సీ ద్వారా డిపిఆర్‌ను తయారు చేయిస్తోంది. సుమారు రూ.5వేల కోట్ల వ్యయం కానున్న ఈ ప్రాజెక్టులను సొంతంగా హెచ్‌ఎండిఏనే చేపట్టనుంది. ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పా్‌సల నిర్మాణాలతో ట్రాఫిక్ సమస్యకు కొంత మేర పరిష్కారం లభించనుందని అధికారులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ టు కరీంనగర్ మార్గంలో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 18.50 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ స్కైవేను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 

 

 

అలాగే, హైదరాబాద్ టు నాగ్‌పూర్ మార్గంలో ప్యారడైజ్ నుంచి కొంపల్లి తర్వాత వచ్చే ఆర్‌ఓబి వరకు 18.35 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్‌స్కైవే సాధ్యాసాధ్యాలపై సంబంధిత కన్సల్టెన్సీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.భారీ డబుల్‌డెక్కర్‌స్కైవే ప్రాజెక్టులను లుక్‌ఈస్ట్‌పాలసీకి ఊతమిచ్చేలా రూపొందిస్తున్నారు. నగరానికి అన్ని వైపులా అభివృద్ధి జరిగేందుకు తీసుకొచ్చిన లుక్‌ఈస్ట్‌పాలసీకి అనువుగా ట్రాఫిక్‌లేని రోడ్లు రానున్నాయి. ఈ డబుల్‌డెక్కర్‌స్కైవేలో పివి ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో మధ్య మధ్యలో ఎక్కేందుకు, దిగేందుకు ర్యాంపులను నిర్మించనున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రోడ్డు, ఆ పైన ఫ్లైఓవర్, రెండో అంతస్తులో మెట్రో కారిడార్ వచ్చే విధంగా ప్లాన్ ఉండడంతో ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా ఉండనుంది. ఒక్కో డబుల్ డెక్కర్‌స్కైవే నిర్మాణానికి రూ.1,200 కోట్లు, భూ సేకరణకు రూ.1,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశాలున్నాయి. రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.5,000 కోట్లకుపైనే ఖర్చు కానున్నట్టుగా సమాచారం.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Commencement of Hussain Sagar beautification works

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page